ఇక్కడ సంగీతం అనే పదాన్ని వాడటం లేదు…! సినిమా పాటల మీద ఇంట్రస్టు ఉన్నవారికి ఈటీవీలో వచ్చే స్వరాభిషేకం వీనులవిందు… ఏళ్లుగా అది పాటలప్రియుల్ని అలరిస్తూనే ఉంది… రాష్ట్రంలోని పలు ప్రాంతాలకే కాదు, పలు దేశాలకు కూడా వెళ్లొచ్చింది… ఈటీవీలో అభిరుచి ఉన్న ప్రోగ్రాముల్లో ఇదీ ఒకటి… కాకపోతే దీనికి లిమిటెడ్ వ్యూయర్షిప్ ఉంటుంది… రేటింగ్స్ గురించి ఆలోచించకుండా రామోజీరావు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఆ బాధ్యతలు అప్పగించాడు… ఇక్కడ సీన్ కట్ చేయండి ఒకసారి…
మొన్న స్వరాభిషేకం దర్శకుల స్పెషల్ అని ప్రసారం చేశారు… ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లేకపోయినా ఆ ప్రోగ్రామ్ అలా రన్ కావడం ఆనందమే… కానీ..? ఆ ప్రోగ్రాం చూసిన వాళ్ల పాటలప్రియులు ఒక్కసారిగా డీలాపడిపోయారు… బాలు లేని లోటు స్పష్టంగా తెలిసొచ్చింది… కాదు, ఆ ప్రోగ్రామే శృతి, తాళం, రాగం, అన్నీ తప్పినట్టు అనిపించింది… రాగాలు, గమకాలు తెలిసిన వాళ్లనే కాదు, ఏ స్వరజ్ఞానమూ లేకుండా పాటల్ని ఆస్వాదించే సగటు శ్రోతలను, ప్రేక్షకులను కూడా ఈ ప్రోగ్రామ్ తీవ్రంగా నిరాశపరిచింది…
Ads
బాలు ఉన్నప్పుడు ప్రతి పాటా పర్ఫెక్టుగా వచ్చేలా చూసేవాడు… ఎవరికి ఏ పాట ఇవ్వాలో తనే నిర్ణయం తీసుకునేవాడు, రిహార్సల్ జరిగేది… షూటింగ్ సమయంలో తప్పులు దొర్లితే, నిర్దాక్షిణ్యంగా ఆపేసి, మళ్లీ పాడించేవాడు… బాలు ఎదురుగా ఉన్నాడనే భయమో, భక్తో పాడేవాళ్లలోనూ కనిపించేది… ప్చ్, ఇప్పుడది లేకుండాపోయింది… ఫలితంగా అపస్వరాభిషేకం అయిపోయింది…
నిజానికి పాడినవాళ్లు తక్కువ వాళ్లేమీ కాదు… అనుభవం, స్వరజ్ఞానం, మంచి సాధన, శ్రావ్యమైన గొంతులు ఉన్నవాళ్లే… కానీ ఓ డైరెక్షన్ లేకుండా పోయింది… కల్పన, కారుణ్య, ధనుంజయ్, మనో, గోపిక, సాహితి, దామిని, ప్రణవి… ఎవరు తక్కువవాళ్లు..?
అసలు కల్పనకు ఎవరైనా పాటలో మెళకువలు, జాగ్రత్తలు చెప్పగలరా..? జగమెరిగిన విద్వత్తు తనది… కానీ పేలవంగా, అసలు ఈమె ఆ కల్పనేనా అన్నట్టుగా కనిపించింది, వినిపించింది… చివరకు మేకప్, డ్రెస్సింగు కూడా తేడా కొట్టేశాయి… మనో అయితే తను అన్నీ తెలిసినవాడు… సంగీత దర్శకులకే పాఠాలు చెప్పగల ప్రతిభ తనది… ఇక కారుణ్య పాటలో పలికే ఫీల్, తన ఉచ్ఛరణ సూపర్‌గా ఉంటాయి సాధారణంగా… గోపిక దాదాపు కల్పన రేంజ్… కానీ ఆ ప్రతిభలు, విశేషాలు అన్నీ పోయాయి ఒకేసారి… గంటన్నర దాటిన ప్రోగ్రాం… వరుసగా వస్తున్నారు, పాడుతున్నారు, పోతున్నారు… నిర్లిప్తంగా, హమ్మయ్య ఓ పనైపోయింది అన్నట్టుగా… గతంలో కొన్ని పాటల్ని తనే స్వయంగా పాడి, ఆ పాటల వెనుక ముచ్చట్లను చెప్పేవాడు బాలు… ఇప్పుడదీ లేదు… జస్ట్, ఓ చిత్రలహరి లేదా రాగలహరి కార్యక్రమం… అంతే…
Share this Article