పోస్టల్ ప్రసాదం సమర్పయామి!
——————-
హమ్మయ్య. ఇక దేవుడి ప్రసాదం ఇంటికే వస్తుంది. మనం దేవుడి వైపు ఒకడుగు వేస్తే- దేవుడు మనవైపు వందడుగులు వేసి వచ్చి కాపాడతాడని కంచి పరమాచార్య మహా స్వామి చెప్పేవారు. ఆ వాక్కును నిజం చేస్తూ తెలంగాణాలో తంతి తపాలా శాఖ దేవుడి ప్రసాదాలను మన ఇళ్లకే చేర్చే బాధ్యతను నెత్తికెత్తుకుంది. తంతి ప్రసాదం బుట్టలో పడడం అంటే ఇదే కాబోలు. నిజానికి ఈ మహాప్రసాదం బట్వాడా తపాలాశాఖ ఆలోచన కాదు. తెలంగాణ దేవదాయ శాఖ వినూత్న ఆలోచన. దేవ- ఆదాయ రెండు పదాలు సవర్ణదీర్ఘ సంధిగా కలిస్తే దేవాదాయ అవుతుంది అని అనుకుంటారు. వ్యాకరణంలో సంధి పని ముగిసిన చోట సమాసం పని మొదలవుతుంది. దేవాదాయ అంటే దేవుడికి ఆదాయం అని అనుకుంటారు. దేవుడి వల్ల ఆదాయం, దేవుడి పేరుతో ఆదాయం అని విభక్తులను భక్తి నుండి వేరుచేసి అర్థం చేసుకుంది లోకం.
“శివాయ విష్ణు రూపాయ
శివ రూపాయ విష్ణవే”
అంటే శివుడు- విష్ణువు ఒకటే అని అర్థం. శివుడు డబ్బుకు విలువ ఇవ్వడు కానీ- విష్ణువు రూపాయకు బాగా విలువిస్తాడు అందుకే నయా పైసా లేకపోతే శివాలయం, ధనం సమృద్ధిగా ఉంటే విష్ణ్వాలయం అన్నారని- విష్ణు రూపాయకు లేని అర్థాన్ని ఆవిష్కరించారు. విష్ణువు రూపాయ విష్ణువుకే ; శివుడి రూపాయ కూడా విష్ణువుకే అన్నది దీని అసలు అర్థమని మరి కొందరు వాదించారు. శివుడి రూపాయ అయినా, విష్ణువు రూపాయ అయినా, సకల దేవతల రూపాయలయినా దేవాదాయ శాఖదే అన్నది కలి ధర్మం!
Ads
దేవాలయ శాఖ అని పేరు పెట్టకుండా దేవాదాయ శాఖ అని దేవుడి ఆదాయం మీద దృష్టి కేంద్రీకరించి పేరు పెట్టడంలోనే ఆ శాఖ ముందు చూపు స్పష్టంగా కనిపిస్తుంది. దేవుడి ఆదాయ మార్గాలు, వాటి స్వరూప స్వభావాల చర్చ ఇక్కడ అనవసరం. దేవాదాయం ఏదయినా ధర్మాదాయమే అని లోకం స్థూలంగా అనుకుంటోంది. మన తెలుగు భాషకు పట్టిన తెగులును దేవుడే దిగివచ్చినా బాగు చేయలేడు అనడానికి దేవాదాయ- ధర్మాదాయ మాటలే పెద్ద ఉదాహరణలు. తెలుగులో దాయం అంటే భాగం. రాయలసీమలో పాచికలాటను ఇప్పటికీ దాయాలాట అనే అంటారు.
దేవ దాయం – అంటే దేవుడి భాగం;
ధర్మ దాయం- అంటే ధర్మ భాగం అని అర్థం. ఈ మాట ప్రకారం-
దేవదాయ శాఖ; ధర్మదాయ శాఖ అనే అనాలి తప్ప- దేవాదాయ; ధర్మాదాయ అని అనకూడదు. అసలు అలాంటి మాటలే లేవు. మన దృష్టి ఎప్పుడూ ఆదాయం మీదే కాబట్టి దేవుడికి, ధర్మానికి ఆదాయం అంటగట్టాము. దేవుడికి లేని అభ్యంతరం మనకెందుకు? ఇంతకంటే భాషాదోషం వల్ల సాక్షాత్తు దేవుడి శాఖకు జరిగిన అన్యాయం, అవమానం గురించి లోతుగా వెళ్లడం సభా మర్యాద కాదు.
అసలే కరోనా రోజులు. చాలా నెలలు దేవుడి గుడి తలుపులు తెరవడమే కష్టమయ్యింది. చివరికి తెరిచినా వెనకటిలా భక్తులు రావడం లేదు. వచ్చినా భయం పోలేదు. లోకమంతా శానిటైజర్ ద్రావకమే తీర్థంగా గంట గంటకు రెండు చేతుల్లో వేసుకోవాల్సిన రోజులొచ్చాయి. సీ విటమిన్ గుళికలే మహా ఘన ప్రసాదంగా చప్పరించాల్సిన కాలమొచ్చింది. గుళ్లల్లో ప్రసాదాల కోసం చాచే చేతులు తగ్గిపోయాయి కాబట్టి- ప్రసాదమే పోస్టల్ చేతులు చాచి పార్శిళ్లుగా మన గుమ్మాల్లోకి వస్తోంది. రోజులు మారాయి. దేవుళ్లు కూడా మారారు. ఆచారాలు కూడా మారతాయి. ఇందులో పెద్దగా తప్పు పట్టాల్సిందేమీ లేదు. వీడియో కాల్ పౌరోహిత్యాలు, యూట్యూబ్ అర్చనలే అంగీకారమయినప్పుడు- ఒక గుడి ప్రసాదం కొరియర్లో దేశమంతా పంపకానికి బయలుదేరడాన్ని కూడా స్వాగతించాలి. పోస్టల్ ప్రసాదంతో దేవదాయ ధర్మదాయ శాఖకు ఆదాయం. భక్తులకు పుణ్యం!……….. By…. -పమిడికాల్వ మధుసూదన్
Share this Article