గత సంవత్సరం మే నెలలో… అంటే ఏణ్నర్థం… మన సీనియర్ నటుడు నరేష్ (సీనియర్ నరేష్) గురించి మనమే ఓ కథనం చెప్పుకున్నాం… ముందుగా దాని సారాంశం చదివి, ఆ తరువాత మరో ముచ్చట చెప్పుకుందాం… అబ్బే, ఆయన సహగామి (అనధికారికంగా నాలుగో భార్య కావచ్చు…) పవిత్రా లోకేష్, మూడో పెళ్లాంతో గొడవల గురించి కాదు… ఇది వేరే…
ఓ ట్వీట్ కనిపించింది… మన సినిమాల్లో నటిస్తుంటాడు కదా… నరేష్… సీనియర్ నరేష్ అంటుంటారు కదా… విజయనిర్మల కొడుకు… సూపర్ స్టార్ కృష్ణకు కొడుకులాంటివాడు… ఆ ట్వీట్లో ఏమన్నాడంటే… ‘‘నైక్ ఎయిర్ షూస్ కోసం గంట సేపట్నుంచి తిరుపతిలో తిరుగుతున్నా, కానీ దొరకడం లేదు, మళ్లీ హైదరాబాద్ వెళ్లాల్సిందే ఇక వీటికోసం…’’ నెటిజన్లు రకరకాలుగా ఈ ట్వీట్‌ను ట్రోల్ చేస్తున్నారు… మనం ఇప్పుడు వాటిల్లోకి పోవడం లేదు… కానీ…
ఆ ట్వీట్లో ఆకర్షించింది ఏమిటంటే… తన పేరుకు ముందు ఉన్న అక్షరాలు… హెచ్.ఈ… డీఆర్… వీకే అంటే తన ఒంటిపేరులో భాగం… యాక్టర్ తన వృత్తి… అవి వదిలేస్తే ఈ హెచ్.ఈ, డీఆర్ ఏమిటి..? సాధారణంగా మన సొసైటీలో బాగా అధికారిక మర్యాదలు దక్కాల్సిన వాళ్లకు, ఉన్నత పోస్టుల్లో ఉన్నవాళ్లను పేరుకు ముందు హిజ్ ఎక్సలెన్సీ అని వ్యవహరిస్తుంటాం… రాస్తుంటాం… ఉదాహరణకు గవర్నర్లు గట్రా… అలా వాడేందుకు కూడా నిర్ణీత ప్రొటోకాల్ ఉంటుంది… మరి ఈ నరేషుడు ఇలా ఎలా రాసుకున్నాడు..?
Ads
ఇప్పుడే కాదు, ఎప్పుడూ అలాగే రాసుకుంటాడు… అప్పట్లో చంద్రబాబుకు మా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హోదాలో రాసిన లెటర్ ప్యాడ్ చూడండి… దిగువన సంతకం పెట్టే దగ్గర కూడా ఈ హెచ్.ఈ పెట్టేశాడు… మరి ఇంతకీ ఈయన హిజ్ ఎక్సలెన్సీ అనిపించుకునే ఏ పోస్టులో ఉన్నాడు..?
ఏమీ లేదు… వికీపీడియాలో ఓ వివరణ కనిపిస్తుంది… 2018లో ఐసీడీఆర్హెచ్ఆర్పీ (international-commission-of-diplomatic-relations-human-rights-and-peace) నుంచి హిజ్ ఎక్సలెన్సీ టైటిల్ మరియు పీహెచ్డీ పొందాడట… అది ఐక్యరాజ్యసమితికి సంబంధించిన సంస్థ అట… ఓహో, ఐరాస ఈ దందాలు కూడా చేస్తుందా..? ఎవరికైనా సరే, ఇలా హిజ్ ఎక్సలెన్సీ టైటిళ్లు ఇచ్చేస్తుందా..?
ఇదేదో తేడాగా ఉన్నట్టుంది అని చెక్ చేస్తే… సదరు సంస్థ సైట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే… వెంటనే యాంటీ వైరస్ దాన్ని ఓపెన్ చేయకుండా అడ్డుపడింది… అంతటి ప్రమాదకరమైన సైట్ అట… licensed Commission of International Diplomacy of this Independent Sovereign Inter Governmental Organization, with universal jurisdiction of the international law, Consisting of Sovereign subjects of international law, thereby processing inherent capacity for diplomatic relations అని ఇంగ్లిష్ వివరణ… సదరు సంస్థ చీఫ్ కూడా దీన్ని అర్థమయ్యేలా చెప్పగలడు అనుకోను…
ఐనా… మానవ హక్కులు, దేశాల దౌత్య సంబంధాలు, శాంతి కోసం ఈయన ఉద్దరించింది ఏముందని సదరు సంస్థ ఆ కిరీటం పెట్టింది..? ఈయన ఇప్పుడు ఏ పార్టీయో తెలియదు గానీ కొన్నాళ్లు బీజేపీలో మాత్రం ఉన్నాడు… (ఇలాంటి టైటిళ్లు ఇవ్వాల్సి వస్తే గిస్తే కేఏపాల్ గట్రా ఎన్ని కేరక్టర్లు లేవు..?) అప్పుడు ఏమైనా విశ్వశాంతి కోసం, మానవ హక్కుల కోసం ప్రపంచ స్థాయిలో బాగా పాటుపడి ఉంటాడా..? కావచ్చు… అవునూ, ఇదంతా బాగా ఖర్చయ్యే వ్యవహారమా హిజ్ ఎక్సలెన్సీ డాక్టర్ నరేష్ వీకే గారూ…?! చివరగా చిన్న సూచన :: హిజ్ ఎక్సలెన్సీ అనే పదాల్ని ఎవరైనా మనల్ని ఉద్దేశించి గౌరవించే పదాలు… అదీ అర్హులయితేనే… అంతేతప్ప మనకు మనమే రాసుకుని, మనమే తొడుక్కునే, రాసుకునే భుజకీర్తులు కావు..!!
హమ్మయ్య… చదివారు కదా… ఇప్పుడు ఈ వార్త చదవండి…
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన 5వ ప్రపంచ కాంగ్రెస్ (???) సమావేశాల్లో ఈయన గారికి సర్ అనే బిరుదు, డాక్టరేట్ ప్లస్ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను, మిలిటరీ ఆర్ట్స్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా గుర్తింపు గట్రా టోకున ఇచ్చారని ఈ వార్త సారాంశం… అది ఇచ్చింది ఎవరో తెలుసా..? నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్లానింగ్ మరియు ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ విభాగాలు కలిసి ఇవన్నీ కట్టగట్టి అప్పగించారుట… ఉగ్రవాదాన్ని అరికట్టడమే లక్ష్యంగా నిర్వహించారట ఈ సమావేశాల్ని…
సరే, ఆ సంస్థలు కూడా గతంలో ఆయనకు హిజ్ ఎక్సలెన్సీ కట్టబెట్టిన ఏవో దిక్కుమాలిన సంస్థలు అయి ఉంటాయి… అన్నట్టు, ఈ సారు గారు ఉగ్రవాదం మీద ఎక్కడైనా ఎప్పుడైనా ఒక్క మాట మాట్లాడినట్టు గుర్తుందా ఎవరికైనా…? మరి ఈ తిక్కల కాంగ్రెస్ సమావేశాలు ఏమిటి..? ఈ అవార్డులు, బిరుదులు, పురస్కారాలు, దండలు, దండాలు ఏమిటి..? ఆస్తి ఉంది కదా, ఏమైనా కొనగలడు… ఎంత ఖర్చయిందో ఏమో గానీ భలే పడతాడు ఇలాంటి సంస్థల్ని… ఈసారి ఏకంగా మిస్టర్ ప్రెసిడెంట్ వంటి ఇంకాస్త బరువైన అవార్డులు, బిరుదులు ట్రై చేయి బ్రదర్…!!
Share this Article