చాలా ఏళ్ల క్రితం… మనలో చాలామందికి అనుభవమే… చూశాం, చేశాం… ఇంటి వెనుక పెరట్లో ఓ గప్క… అంటే నీళ్లను వేడిచేసే బాయిలర్… ఓ బావి… నీళ్లు తోడుకోవడానికి ఓ బొక్కెన… పెరట్లోని వేపచెట్టు నుంచి ఓ పుల్లను విరిచి, పళ్లు తోముకుని… లేదంటే పొయ్యిలో ఉన్న కట్టెలు, వరిపొట్టు బూడిదను పళ్లకేసి రుద్ది… లేదంటే కాస్త సన్న ఉప్పుతో తోముకుని… ఒకటికి పదిసార్లు పుక్కిలించి… ఇక స్నానం చేయడమే…. మరి తరువాత..?
దంతమంజన్లు వచ్చాయి… కోల్గేట్ వచ్చాక దంతధావనమే మారిపోయింది… నోట్లోకి పొద్దున్నే రసాయనాలను పోసుకోవడం స్టార్టయింది… నురగ… అంతే… పళ్లపై పాచిని తొలగించేది బ్రష్… అంతేతప్ప పేస్టు చేసే పనేమీ ఉండదు… అది ఫ్యాక్ట్… దశాబ్దాలుగా కోటానుకోట్ల రూపాయల్ని నోట్లో పోసుకుని, పళ్లకు రుద్ది, పుక్కిలించి ఊసేశాం…
Ads
ఇప్పుడు కాస్త స్వదేశీ కంపెనీల నుంచి పోటీ ఎక్కువైంది… జనంలో స్వదేశీ భావన కూడా ఎక్కువైంది… అందుకని కోల్గేట్ వాడు మొదట మనం దంతధావనానికి వాడి వదిలేసిన ఉప్పును మళ్లీ తీసుకొచ్చాడు… మన పాత తెలివిని మనకే గుర్తుచేస్తూ… నీ పేస్టులో ఉప్పు ఉందా అంటూ ఈమధ్య మరీ నాగసమంతతో ఉప్పు జ్ఞానాన్ని కూడా బోధిస్తున్నాడు… లవణజ్ఞానం…
తరువాత బొగ్గుపొడితో కూడిన పేస్టు అన్నాడు… అదీ మనం వాడీ వాడీ వదిలేసిందే… మంచివన్నీ వదిలేయడం మానవసహజం కదా… తరువాత ఏ పతంజలి వాడికో చాన్స్ ఇవ్వడం దేనికిలే అనుకుని… వేదశక్తి పేరిట పేస్టులు ప్రవేశపెట్టాడు… ఈమధ్యలో కరోనా వచ్చింది… మరి కార్పొరేట్ కంపెనీలన్నీ, తమ ఉత్పత్తులను క్రిముల చుట్టూ తిప్పడం మొదలుపెట్టాయి కదా… చివరకు ఆసియన్ పెయింట్స్ వాడు కూడా మా రంగులు కొట్టండి, కరోనా ఇంట్లోకి రాదు అన్నట్టుగా యాడ్స్ చేయించాడు… తిప్పలు…
కోల్గేట్ వాడు కూడా అదే వేదశక్తి పేరిట నోట్లో కొట్టుకునే ఓ స్ప్రే తయారు చేశాడు… అంటే ఇది బ్రష్షులు, పొడి, పేస్టులకు అదనం… ఏదోరకంగా వినియోగదారు జేబు ఖాళీ చేయడమే కదా కార్పొరేట్ కల్చర్… ఇప్పుడు మరొకటి…
బొగ్గుపొడి అంటే మరీ ఏ కట్టెలు పడితే ఆ కట్టెల బొగ్గు వాడొద్దు… మేం శ్రేష్టమైన వెదురు బొంగుల్ని కాల్చి, ఆ బొగ్గుల పొడి సేకరించి, అందులో మరింత శ్రేష్టమైన మెంతీ ఫ్లేవర్‌ను కలిపి ప్రవేశపెడుతున్నాం అని స్టార్ట్ చేశాడు… ఇదీ వర్కవుట్ కాకపోతే… ఏ సర్కారు తుమ్మ బొగ్గునో, ఏ లొట్టపీసు చెట్ల బొగ్గునో చూపించి… అసలు ఇదేనోయ్ అద్భుతమైన దంతధావన పదార్థం అని అమ్మేస్తాడు… వాడు తక్కువోడు కాదుగా… వాడు చెప్పడమే ఆలస్యం… మనం కొనేస్తాం అని వాడికీ తెలుసు… అలా మన బుర్రల్ని ట్యూన్ చేశాడు మరి… కొనక చస్తామా..?!
మీరు వెదురు బొగ్గు పేస్టోయ్ అని చెప్పినా పడటం లేదా..? వాడి దగ్గర మరో బొగ్గస్త్రం రెడీగా ఉంది… అది మరీ సింగరేణి బొగ్గంత స్ట్రాంగ్… అదే రాక్షసిబొగ్గు అంటాం కదా… అదన్నమాట… యాక్టివేటెడ్ చార్కోల్ అని పేరు పెట్టేస్తాడు, లేదంటే ఎస్సెన్షియల్స్ చార్కోల్ అంటాడు… మనకే అర్థం కాని పదాల్ని పేర్చి, మనకే ముడిపెట్టి, మన జేబు కొట్టేస్తాడు… ఇదే పురాణాల్లో బొగ్గుజ్ఞానం అని చెప్పబడింది… సెలవు… శుభం భూయాత్… స్వస్తి…
Share this Article