మాటీవీని జీటీవీ దాటేసింది..! తెలుగు టీవీ సర్కిళ్లలో ఒక్కసారిగా విపరీతంగా ప్రచారం అవుతున్న వార్త ఇది… అంతేకాదు, జీ తెలుగు వాడు ఇదుగో ఇలా ఓ మెసేజ్ బాగా సర్క్యులేట్ చేస్తున్నాడు… డీజే పెట్టుకుని జీటీమ్స్ తీన్మార్ డాన్సులు చేస్తున్నయ్… ఫుల్ జోష్… నిజమే మరి… రేటింగ్స్ మాయగాడు మాటీవీని దాటేయడం అంటే మాటలా..? దాన్ని కొట్టేయడం అంటే మజాకా..? మాటీవీ మొహం పగిలిపోవడం అంటే పెద్ద వార్తే… అయితే..? ఇక్కడ కొన్ని తిరకాసులున్నయ్… అవి చెప్పుకుందాం.,. నిజానికి జీతెలుగు వాడిది అల్పానందం… అది మాటీవీని దాటేయలేదు… ఈ ప్రచారం ఉత్త ఫేక్… ఎందుకంటే..?
జీవాడు ఏమంటున్నాడు..? వంద శాతం వినోదం, 30 శాతం షేర్‌తో నంబర్ వన్ అని క్లెయిమ్ చేసుకుంటున్నాడు… రాంగ్… నంబర్ వన్ ఎలా అవుతాడు..? తాజా బార్క్ రేటింగ్స్ ఓసారి చూడండి… స్టిల్ మాటీవీ జీవాడికన్నా చాలా ముందంజలో ఉంది… మాటీవీని దాటేయాలంటే ఇంకా కష్టపడాలి… ఎందుకంటే..? ఆ సీరియళ్లను జనం ఎంత తిట్టుకుంటున్నా సరే, కార్తీకదీపం, గృహలక్ష్మి, దేవత వంటి రెండుమూడు సీరియళ్లతోనే మాటీవీ వాడు కథ నడిపిస్తున్నాడు… పరమ దరిద్రమైన కేరక్టరైజేషన్ ఉన్న ఆ సీరియళ్లకు అంత రేటింగ్స్ ఎలా వస్తున్నాయి..? అంతా మాయ…
Ads
సరే, జీవాడు కూడా తక్కువేమీ కాదు… ఆ రెండింటి నడుమ ఎలాంటి పోటీ ఉందో… మాటీవీ రేటింగ్స్‌లో క్రమేపీ ఎలా దిగజారిపోతోందో… జీవాడు ఫిక్షన్లో ఎలా దూసుకుపోతున్నాడో కూడా మనం ఇంతకుముందే ‘ముచ్చట’లో చెప్పుకున్నాం కదా… ఇదిలాగే కొనసాగితే జీవాడు మాటీవీని దాటేసే అవకాశం ఉందని, మాటీవీ నంబర్ వన్ స్థానం కోల్పోనుందని కూడా ‘ముచ్చట’ గణాంకాలతో సహా చెప్పింది…
అయితే… ఇప్పటికైతే జీటీవీ ఇంకా ఆ స్టేజికి రాలేదు… దానికి శాపం నాన్-ఫిక్షన్ కేటగిరిలో, అంటే రియాలిటీ షోలు గట్రా… అదిరింది ఫ్లాప్… సరిగమప ఫ్లాప్… ఈ కేటగిరీలో బాగా ఆశలు పెట్టుకున్న బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్ కూడా సోసో… కేవలం త్రినయని, ప్రేమఎంతమధురం వంటి సీరియళ్లతో కథ నడవదు… మరి మేం నంబర్ వన్ అంటూ జీతెలుగు వాడు డప్పు ఎలా కొట్టుకుంటున్నాడు..? అది ప్రేక్షకులను, యాడ్స్ ఇచ్చే ఏజెన్సీలను మోసగించడం కాదా..? అవున్నిజమే… కాకపోతే తను చెప్పేదాంట్లో అర్ధసత్యం, అల్పానందం ఉన్నయ్… ఎలాగంటే..?
BARC Wk 52
NCCS 2+
Hyderabad
Zee Telugu 17.07
ETV Telugu 12.29
STAR Maa 11.30
Star Maa Movies 4.95
Gemini TV 4.42
ఇది హైదరాబాద్ మార్కెట్… బార్క్ రేటింగ్స్… వాణిజ్యపరంగా కీలకమైన కేటగిరీ… ఇందులో నిజంగానే జీవాడు ఫస్ట్ ప్లేస్… అంతేకాదు, ఈటీవీ సెకండ్ ప్లేస్… మాటీవీ వాడు మరీ మూడో స్థానానికి నెట్టేయబడ్డాడు… పరాభవం… ఇప్పటికైనా మాటీవీ క్రియేటివ్ టీంకు అర్థమై ఉండాలి… పట్టణ ప్రేక్షకులు మాటీవీని పెద్దగా ఇష్టపడడం లేదు… అది తెలుసుకుంటే నంబర్ వన్ నిలబడుతుంది… లేదంటే త్వరలో నిజంగానే జీవాడికి నంబర్ వన్ కిరీటం ఖాయం…!!
ఈ కథనానికి తాజా జోడింపు ఏమిటంటే..? జీవాడి ప్రచారం చూసి, ఉలిక్కిపడిన మాటీవీ వాడు కూడా…. (నారాయణ, శ్రీచైతన్య తరహాలో)… నేనే తోపు, నేనే నంబర్ వన్, జీవాడివి ఆఫ్టరాల్ 838 రేటింగ్స్, ఈటీవీ వాడివి మరీ దరిద్రంగా 604 రేటింగ్స్… మేం 1055… అదీ మా దమ్ము, మేమే నంబర్ వన్ అన్నట్టుగా ఉంది మాటీవీ ప్రచారం… హహహ… మాటీవీ చెప్పింది నిజమే… కానీ అర్బన్, హైదరాబాద్ మార్కెట్లలో సంగతి ఏమిటోయ్…!? అది కూడా చెప్పి ఏడవాలి కదా…!!
Share this Article