పార్ధసారధి పోట్లూరి……… సుబ్రహ్మణ్యస్వామి నడిచే ఎన్‌సైక్లోపీడియా! కానీ.. ఎన్‌సైక్లోపీడియాని చదివి ఎవరయినా విజ్ఞానము సంపాదించుకోవచ్చు, అదే సమయంలో అదే ఎన్‌సైక్లోపీడియా అదే స్థితిలో ఉంటూ, తనలో విజ్ఞానాన్ని ఇముడ్చుకుంటూ ఉంటుంది కానీ స్వయంగా రంగంలోకి దిగలేదు. స్వామి కూడా అంతే! దేశ విదేశాలలో ఆర్ధిక శాస్త్రం బోధించే విజిటింగ్ ప్రొఫెసర్ గా స్వామికి మంచి పేరుతో పాటు అనుభవం కూడా ఉంది. ఏకసంథాగ్రాహి! ఛాలెంజ్ చేసి మరీ నెల రోజుల్లో మాండరీన్ (చైనా భాష) ని నేర్చుకుని మరీ తన ప్రతిభని ప్రదర్శించాడు. వేరెవ్వరికీ సాధ్యం కాని పని అది. ప్రముఖ క్రిమినల్ లాయర్ రామ్ జెఠ్మలాని స్వామి మీద పరువునష్టం దావా వేసి ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేకపోయాడు స్వామి నుండి. ఈ కేసుని తానే స్వయంగా వాదించుకున్నాడు స్వామి. తన న్యాయవాద వృత్తి జీవితంలో తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమయిన ప్రత్యర్థి సుబ్రహ్మణ్య స్వామి అని వాపోయాడు రామ్ జెఠ్మలాని.
సుబ్రహ్మణ్యస్వామి రాజకీయ జీవితం మొదలయ్యింది భారతీయ జనసంఘ్ తో. తర్వాత జనతా పార్టీలో చేరాడు (1977- 2013). తరువాత మళ్ళీ 2013 లో బిజెపిలో చేరి ఇప్పటివరకు కొనసాగుతున్నాడు. నిన్న అంటే బుధవారంనాడు స్వామి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసాడు కలకత్తాలో. మమతతో సమావేశం ముగిసిన తరువాత విలేఖరులు మీరు TMC లో చేరుతున్నారా అని అడిగినప్పుడు స్వామి బదులిస్తూ, నేను ఎప్పటి నుండో మమతతో ఉంటూ వస్తున్నాను, ఇప్పుడు కొత్తగా చేరేది ఏముంటుంది అంటూ బదులిచ్చారు స్వామి. స్వామి ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశాడు. నేను జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహ రావులతో కలిసి పనిచేశాను. వీళ్ళందరూ ఏమి చెప్పారో అదే చేసి చూపించారు. మమత కూడా అదే కోవలోకి వస్తుంది అంటూ…
Ads
అయితే స్వామి మమతని పొగడడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనే చాలాసార్లు మమతని పొగడ్తలతో ముంచెత్తాడు. సుబ్రహ్మణ్య స్వామిని బీజేపీ నేషనల్ ఎక్జిక్యూటివ్ కమిటీ నుండి తొలగించింది గత నెలలో. ఇక రాజ్యసభ సభ్యుడిగా 2022 ఏప్రిల్ నెల వరకు కొనసాగుతారు. ఆ తరువాత స్వామి ఫ్రీ బర్డ్. బహుశా రాజ్యసభ పదవీకాలం ముగియగానే బీజేపీకి రాజీనామా చేసి తృణమూల్ లో చేరవచ్చు. ఇది మంచిది. చాలా చాలా మంచిది. మహాభారతంలో శకుని, శల్యుడిని మిక్సిలో వేసి రుబ్బితే బయటకి వచ్చేది స్వామి! అసలు తలపండిన రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం బీజేపీ చాలా ముందుగా ఒక వ్యూహం ప్రకారం స్వామిని తృణమూల్ లోకి పంపుతున్నది అని…
ఈ వాదనకి బలం చేకూర్చే సంఘటన ఒకదాని గురించి చెప్పుకోవాలి. మమతని కలిసే ముందు స్వామి బెంగాల్ గవర్నర్ ని కలిసి మాట్లాడిన తరువాతే మమతతో సమావేశంలో పాల్గొనడం ఎందుకు? ఇక మమత పక్కన చేరి వచ్చే లోకసభ ఎన్నికల ప్రచార సమయంలో మమత చేత చెప్పించేది ఓకే ఒక్క మాట… అది తృణమూల్ కి ఓటు వేసి గెలిపిస్తే ఇన్కమ్ టాక్స్ రద్దు చేస్తాము అని! ఇప్పటికి ఇంతే చెప్పగలం. చూద్దాం, వ్యూహ ప్రతి వ్యూహాలు ఎలా వుండబోతున్నాయో! స్వామికి సోనియాగాంధీ పొడ గిట్టదు. ఏదన్నా నష్టం జరిగితే అది కాంగ్రెస్ కి మాత్రమే జరుగుతుంది స్వామి వల్ల…. శుభం భూయాత్!
Share this Article