ఒకప్పుడు పెళ్లి పదహారురోజుల పండుగ. తరువాత పది, ఆపై మూడు రోజులకు తగ్గి చాలా కాలం రెండ్రోజుల పండుగగా ఉంది. ఇప్పుడు ఒక ఫంక్షన్ హాల్లో నే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం మూడు పెళ్లిళ్లు వేరువేరుగా జరగాలి కాబట్టి గంటల్లోకి వచ్చాము. ట్రాఫిక్ లో చిక్కుకుని ఆలస్యంగా వెళితే మనం వేదరాశివారి పెళ్లికి వెళ్లాల్సి ఉండగా అక్కడ పేదరాశివారి పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఎవరి పెళ్లికి వచ్చారని అక్కడ అడిగేవారుండరు. సినిమా షూటింగ్ లా సాగే ఆ తంతులో పెళ్లి మండపం దాకా వెళ్లి అక్షింతలు చల్లి రావడానికి మనకు సాహస యుద్ధ విద్యలు వచ్చి ఉండవు కాబట్టి- సోమాలియా శరణార్థులు ఐక్యరాజ్యసమితి ఆహారం పొట్లాల కోసం బొచ్చెలు పట్టుకుని దీనంగా క్యూలో నిలుచున్నట్లు బఫే ప్లేట్లలో మృష్టాన్నం ముష్టి వేయించుకుని నిలువు భోజనం ముగించి వచ్చేస్తాం.
తాళికట్టు శుభవేళ-
రత్తాలు రత్తాలు…
బొత్తాలు బొత్తాలు…
లాంటి అర్థవంతమయిన పెళ్లికొడుకుకు ఓరచూపులను నేర్పే పాటలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. దాంతో ఆ పెళ్లి మండపమంతా-
కెవ్వు కేక..!
Ads
కర్ణాటక, రాయలసీమలో ఎలా వచ్చిందో కానీ పెళ్లికి ముందు రోజు సాయంత్రమే రిసెప్షన్ జరుగుతుంది. తాళి కట్టడానికి ముందే దంపతులుగా వారిని లోకం ఆశీర్వదించి వెళుతుంది. పెళ్లికి రాకపోయినా తప్పు కాదు. రిసెప్షన్ కు మాత్రం విధిగా హాజరు కావాలి. తొందరపడి ఒక కోయిల ముందే కూస్తే మనకేమిటి అభ్యంతరం! చాలా చోట్ల పెళ్లి తరువాత రిసెప్షన్ జరుగుతోంది.
ఉత్తరాదిలో హల్దీ, మెహందీ, సంగీత్ అనాదిగా ఉంది. పొరుగింటి పుల్లకూర రుచి ఎక్కువ. ఇప్పుడు దక్షిణాదిలో పెళ్లి తంతులో గౌరీ పూజ నిమిత్తమాత్రమయ్యింది. వర పూజ మొక్కుబడి. కాశీ యాత్ర ఎగతాళి. తాళి తేలిపోయింది. హోమం పొగచూరి మసకబారింది. తలంబ్రాలు రంగుమారాయి. థర్మాకోల్ తలంబ్రాలు తేలుతున్నాయి. ఫోటోగ్రాఫర్ చెప్పింది సంప్రదాయం. వీడియో కెమెరా చేసేది పౌరోహిత్యం.
పెళ్లి ఇప్పుడొక ఈవెంట్.
ఒక షూటింగ్.
ఒక డ్యాన్స్.
ఒక వినోదం.
ఒక డెస్టినేషన్ విహారం…
నాణేనికి మరో కోణం కూడా ఉంది. డబ్బున్నోడు మళ్లీ పదహారు రోజుల పెళ్లి వైపు వెళ్తున్నాడు… ఈవెంట్స్… బ్యాచిలర్స్ పార్టీలు అయ్యాక ముందుగా రోకా, తరువాత ఎంగేజ్మెంట్, హల్ది ఒకరోజు, మెహిందీ మరోరోజు, సంగీత్ ఇంకోరోజు… తరువాత పెళ్లి, చివరన వెట్ గెట్టుగెదర్.
ఒకందుకు ఇదీ మంచిదే. తాళి కట్టాక ఆ నవదంపతుల చేతిలో ఇంకెప్పుడయినా గోరింట పండుతుందా? ఇంకెప్పుడయినా పసుపు చల్లుకుని హల్దీ ఆనందం మిగులుతుందా?
బతుకు పాటగా నిత్య సంగీతంగా సాగుతుందా?
తాళి కట్టడానికి ముందయినా ఈ ఆనందాలు ఉండనీ!
అవి ఫొటోలుగా, వీడియోలుగా కలకాలం మిగలనీ!!
డెస్టినేషన్ పెళ్లి సంగీత్ కు సందర్భ శుద్ధి గీతం-
సినిమా సూపిస్త మావా!
డిస్ క్లైమర్:-
ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. ఇలాంటి సినిమా పెళ్లి నాకు జరగలేదన్న బాధతో కూడిన అసూయనుండి పుట్టిన అకారణ అజ్ఞానంగా పరిగణించగలరు.
- పమిడికాల్వ మధుసూదన్
Share this Article