వేల కోట్ల వసూళ్ల లెక్కలు చెబుతున్నారు కదా ఇప్పుడు..? పాన్ ఇండియా, పాన్ వరల్డ్ కాదు, జస్ట్ తెలుగులోనే ఆడిన ఈ సినిమా వసూళ్లు ఇప్పటి విలువలో చెప్పాలంటే పదీపదిహేను బాహుబలుల పెట్టు..! ఎన్టీయార్ వసూళ్ల స్టామినా అది… ఆశ్చర్యం ఏమిటంటే, ఈ బ్లాక్ బస్టర్‌ను ఏ భాషలోకి రీమేక్ చేయలేదు, డబ్ చేయలేదు…
రికార్డుల సునామీ . రికార్డు బ్రేకింగ్ సూపర్ డూపర్ మాస్ ఎంటర్టైనర్ . 1977 లో వచ్చిన ఈ అడవిరాముడు సినిమా గురించి సగటు తెలుగు ప్రేక్షకుడు కూడా థీసిస్సులను వ్రాస్తాడు . ఓ లవకుశ , ఓ మాయాబజార్ , ఓ గుండమ్మ కధ , ఓ రాముడు భీముడు సినిమా లాగా ఈ అడవిరాముడు సినిమా కూడా బుర్రల్లో సెటిలయిపోయింది .
సినిమా నిర్మాణం గురించి కూడా కధలు కధలుగా చెప్పుకుంటారు . NTR కు విజయాలు , రికార్డులు కొత్తేమీ కావు . పౌరాణికాలలో , జానపదాలలో చాలా రికార్డు బ్రేకర్సే ఉన్నాయి . సాంఘిక చిత్రాలలో గుండమ్మ కధ , రాముడు భీముడు వంటి సినిమాలు ఉన్నా , ఈ అడవిరాముడు మామూలు రాముడు కాదు బాబో . అసలు టైటిల్లో రాముడు పేరుని తగిలించటమే బ్రహ్మాండమైన ఐడియా . NTR నటించిన రాముడు సినిమాలన్నీ కనక వర్షాన్ని కురిపించాయి . ఈ అడవిరాముడు ఇంకా .
Ads
47 ఏళ్ళు అయినా , ఈరోజుకీ నిన్ననో మొన్ననో వచ్చిన సినిమా లాగా మమైకం అయిపోతారు . కధను ఎవరు తయారు చేసారో కానీ , వారిని ముందుగా మెచ్చుకోవాలి . ఆ తర్వాత సినిమా ప్రొడక్షన్ ప్లానింగ్ . నిర్మాతలను , దర్శకుడు రాఘవేంద్రరావుని మెచ్చుకోవాలి . నేనయితే 20 వ శతాబ్దపు తెలుగు సినీ రంగ బాహుబలిగా చెపుతా . సుమారు 300 మంది నటీనటులను , ప్రొడక్షన్ టీంని మదుమలై అడవుల్లో రెండు నెలల పాటు షూటింగ్ చేయటమంటే సాధారణ విషయం కాదు . అందుకే 20 వ శతాబ్దం బాహుబలి అంటాను .
రాఘవేంద్రరావు- NTR కాంబినేషనుకు మొదటి సినిమా . రాఘవేంద్రుడిని దర్శకేంద్రుడిని చేసి పడేసింది . అప్పుడప్పుడే మంచి నటీమణులుగా పేరు తెచ్చుకుంటున్న జయలు ఇద్దరూ సూపర్ హీరోయిన్లు అయిపోయారు . వెనక్కు తిరిగి చూసుకునే పనిలేకుండా దూసుకొని వచ్చారు . NTR తన కెరీర్లో 35 రోజులు ఔట్ డోర్ షూటింగులో ఉండటం అంటే సాదాసీదా విషయం కాదు . ఉన్నారు . నిజంగా గొప్పే .
ఈ సినిమా అఖండ విజయానికి మరో కారకులు వేటూరి సుందరరామ మూర్తి , కె వి మహదేవన్లు . అన్ని పాటలూ వేటూరే వ్రాసారు . సంగీతపరంగా పాటలన్నీ ఆణిముత్యాలే . సాహిత్యపరంగా నాకు చాలా ఇష్టమైన పాట కృషి ఉంటే మనుషులు రుషులవుతారు మహా పురుషులవుతారు పాట . గిరిజనులను ఉత్తేజపరుస్తూ ఏకలవ్యుడి గురించి , వాల్మీకి గురించి , శబరి గురించి వర్ణించటం చాలా బాగుంటుంది .
ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ పాట . తెలుగు భాషలో ఊతపదం అయిపోయింది . (ఇదొక్కటీ కోటి రూపాయల పాట అంటుంటారు)… ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకు గ్రూప్ డాన్సుని కంపోజ్ చేసిన డాన్స్ డైరెక్టర్ సలీంను ప్రత్యేకంగా అభినందించాల్సిందే . వండర్ఫుల్ ఫొటోగ్రఫీ . ఈ సినిమాలో ఫొటోగ్రఫీ డైరెక్టర్ విన్సెంటుకు నంది అవార్డు కూడా వచ్చింది . అమ్మతోడు అబ్బతోడు , కుకు కుకు కుకు కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరి పాటలు కూడా సూపర్ హిట్టయ్యాయి .
షోలే సినిమాలోలాగా గుర్రబ్బండి ఛేజింగ్ సీన్ బాగా తీసారు . పాపం ! ఈ సినిమా షూటింగులో ఇద్దరు జయలకు రెండు సార్లు ప్రమాదాలు కూడా జరిగి గాయాలు కూడా అయ్యాయట Occupational hazards . అప్పుడప్పుడు తప్పవు . ఇందులో కూడా NTR కు సులేమాన్ అనే మారువేషం ఉంది . మారువేషం లేకపోతే ఎన్టీఆర్ సినిమా ఉండేది కాదు అప్పట్లో.
తెలుగులో ఉత్తమ చిత్రంగా ఫిలిం ఫేర్ అవార్డు వచ్చిన ఈ సినిమా 32 సెంటర్లలో వంద రోజులు , 16 సెంటర్లలో 25 వారాలు , 8 సెంటర్లలో 200 రోజులు , హైదరాబాద్ , విశాఖపట్నం , విజయవాడ , తిరుపతి సెంటర్లలో సంవత్సరం ఆడింది . ఇంక కలెక్షన్స్ గురించి చెప్పే పనిలేదు . జనం కాసుల వర్షం కురిపించారు . ఒక్కో సగటు ప్రేక్షకుడు నాలుగయిదు సార్లు చూసిఉంటాడు .
వంద రోజుల ఫంక్షన్ విజయవాడ అప్సర థియేటర్లో జరిగింది . అక్కినేని , దిలీప్ కుమార్లు ముఖ్య అతిథులుగా వచ్చారు . 200 రోజుల ఫంక్షన్ మద్రాసు తాజ్ కోరమాండల్ హోటల్లో జరిగింది . రాజ్ కపూర్ ముఖ్య అతిధి . ఆశ్చర్యం ఏమిటంటే ఇంత బ్లాక్ బస్టర్ని ఇతర భాషల్లోకి రీమేక్ కాకపోవటం , డబ్ కాకపోవటం .
ఈ సినిమా గురించి చెప్పేటప్పుడు విజయవాడ యాక్స్ టైలర్స్ గురించి కూడా చెప్పుకోవాలి . అతను NTR కు వీరాభిమాని అని చెపుతారు . ఈ సినిమా నుండే NTR కాస్ట్యూంలలో మార్పులు వచ్చాయి . పెద్ద పెద్ద కాలర్లు , ఎలిఫెంట్ బాటం పేంట్లు పాపులర్ అయ్యాయి . యాక్స్ టైలర్స్ ఎంత పాపులర్ అయ్యాడంటే నేను గుంటూరు నుండి విజయవాడ వెళ్లి కుట్టించుకున్నా . నటరాజ్ హోటల్ దగ్గర అనుకుంటా ఆ టైలరింగ్ షాప్ .
యూట్యూబులో సినిమా ఉంది కానీ పూర్తిగా లేదు . పాటల వీడియోలు కూడా పూర్ క్వాలిటీ. ఈతరంలో ఎవరయినా ఒకరూ అరా పాతికా ఉంటారేమో చూడనివారు . ట్రై చేయండి . పాటల వీడియోలు ఉన్నాయి . గ్రూప్ డాన్స్ వీడియో ఉన్నట్లుగా లేదు . ఆడియో వినవచ్చు . టివిలో వస్తే మిస్ కాకండి . A great super duper entertainer . Hats off to NTR , Raghavendra Rao and Producers .
#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు
Share this Article