.
గిరిబాబు ఇక లేడు… 80 దాటిన వయస్సులో ఇక చాలు అని వెళ్లిపోయాడు… ఆ వార్త వినగానే గుర్తొచ్చిన ఎపిసోడ్ మాత్రం ఎన్టీయార్- కృష్ణ నడుమ తను ఇరుక్కున్న అనుభవం… అగ్రనటుల ఆధిపత్య ధోరణులు, రాజకీయాలు, అహంభావాల నడుమ ఇండస్ట్రీ ఎలా ఉండేదో ఈ ఎపిసోడ్ వివరిస్తుంది… చాలామంది చదివి ఉండవచ్చు… కానీ మరోసారి మననం చేసుకుందాం…
…. గిరిబాబు అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది విలక్షణమైన నటన. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా… ఇలా ఎన్నో రకాల పాత్రల్లో తనదైన ముద్ర వేశాడు. కానీ ఆయనలో ఒక మంచి హీరో మాత్రమే కాదు, సాహసం చేయడానికి వెనుకాడని నిర్మాత కూడా ఉన్నాడు. తనకు సాధ్యమైనంతవరకు కొత్త ప్రయత్నాలు చేయాలనుకునే మనస్తత్వం ఆయనది. అందుకు నిదర్శనం 1978లో నిర్మించిన ‘సింహగర్జన’ సినిమా వెనుక ఉన్న కథ.
Ads
నటుడిగా అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న గిరిబాబు నిర్మాతగా మారి 1977లో ‘దేవతలారా దీవించండి’ సినిమా నిర్మించాడు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో రెండో సినిమా మరింత భారీగా తీయాలని అనుకున్నాడు. అదీ ఒక జానపద చిత్రం. కలర్లో భారీ సెట్టింగులు, హంగులతో తీయాలనేది ఆలోచన. కథ కూడా సిద్ధం చేయించాడు. అందులో తానే హీరోగా నటించాలనుకున్నాడు. కానీ బడ్జెట్ అంచనా వేసినప్పుడు దాదాపు రూ.25 లక్షలు అవుతుందని తేలింది. అప్పట్లో అది చిన్న మొత్తం కాదు. తన స్థాయికి మించిన వ్యవహారమని అర్థమైంది.
దాంతో ఒక స్టార్ హీరోను పెట్టి సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు. తనకు కొంత పరిచయం, సాన్నిహిత్యం ఉన్న సూపర్‌స్టార్ కృష్ణ దగ్గరకు వెళ్లి కథ చెప్పాడు. కృష్ణ వెంటనే అంగీకరించాడు. గిరిబాబు కూడా అందులో ఒక ప్రధాన పాత్ర పోషించేలా సినిమా ప్రారంభమైంది. టైటిల్ ‘సింహగర్జన’.
సరిగ్గా అదే సమయంలో ప్రముఖ నిర్మాత డీవీఎస్ రాజు, దర్శకుడు కె. రాఘవేంద్రరావు కాంబినేషన్లో ఎన్టీఆర్ హీరోగా ‘సింహబలుడు’ అనే భారీ జానపద చిత్రం మొదలైంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వస్తున్న ఏకైక జానపద చిత్రం కావడంతో అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటు కృష్ణ, అటు ఎన్టీఆర్… ఇద్దరు అగ్రనటులు. రెండు సినిమాల పేర్లలోనూ ‘సింహ’ ఉంది. రెండూ సింహాలే కదా… రెండూ జానపద చిత్రాలే. ఇంకేముంది? పరిశ్రమలో కొత్త చర్చ మొదలైంది.
అప్పటికే ఎన్టీఆర్, కృష్ణ మధ్య సినిమాల పరంగా పోటీ వాతావరణం ఉంది. అంతకుముందు ఏడాదే ‘దానవీరశూరకర్ణ’, ‘కురుక్షేత్రం’ సినిమాల మధ్య తీవ్ర పోటీ జరిగింది. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి రాబోతోందని అభిమానుల్లోనూ, పరిశ్రమలోనూ ఆసక్తి పెరిగింది.

ఈ నేపథ్యంలో గిరిబాబు తనకు పోటీగా దాదాపు అదే పేరుతో కృష్ణ సినిమా తీస్తున్నాడనే సమాచారం ఎన్టీఆర్‌కు చేరింది. కొందరు ఇండస్ట్రీ పెద్దలు గిరిబాబును మరింత భయపెట్టారు. ‘ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లు కూడా కాలేదు. అప్పుడే ఎన్టీఆర్‌తో పోటీకి దిగుతావా? ఇక నీ పని అయిపోయినట్టే’ అంటూ హెచ్చరించారు.
గిరిబాబుకు విషయం తీవ్రంగా అనిపించింది. ఎన్టీఆర్‌కు తన సినిమా గురించి తప్పుడు సమాచారం వెళ్లిందని భావించాడు. వెంటనే ఒకరోజు తెల్లవారుజామునే ఎన్టీఆర్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ ఎన్టీఆర్‌ను కలిసి నమస్కరించి, తన ఉద్దేశం వివరించాడు.
‘నేను తీస్తున్న సింహగర్జన, మీరు తీస్తున్న సింహబలుడు రెండూ ఒకే కథతో రూపొందుతున్నాయని అందరూ చెప్పుకుంటున్నారు. ఈ విషయం మీ వరకు కూడా వచ్చిందని తెలిసింది. అందుకే మీకు మా సినిమా కథ చెబుదామని వచ్చాను’ అన్నాడు. ఆ తర్వాత తన కథను ఎన్టీఆర్‌కు వివరించాడు.
కథ మొత్తం విన్న ఎన్టీఆర్ ఆశ్చర్యపోయాడు. ‘ఈ రెండు కథలు వేరు కదా! మరి నాకు అలా చెప్తున్నారేంటి?’ అంటూ అసలు విషయం అర్థం చేసుకున్నాడు. గిరిబాబును అభినందించి, సినిమా బాగా తీయాలని ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించాడు.
అక్కడితో కథ ముగిసిపోలేదు. రెండు సినిమాల నిర్మాణం భారీ స్థాయిలోనే సాగింది. ‘సింహబలుడు’ 1978 ఆగస్టు 11న విడుదలవుతుందని ప్రకటించారు. ‘సింహగర్జన’ కూడా అదే రోజు విడుదలవుతుందనే ప్రచారం మొదలైంది. దీంతో మళ్లీ ఎన్టీఆర్ వర్సెస్ కృష్ణ పోటీ తప్పదనే గాసిప్స్ ఊపందుకున్నాయి.
- అయితే ఈసారి ఎన్టీఆర్‌కు గిరిబాబు మీద కొంత అసహనం కలిగింది. తన దగ్గరకు వచ్చి అంత వినయంగా కథ చెప్పి వెళ్లిన వ్యక్తి, ఇప్పుడు తన సినిమాకు పోటీగా అదే తేదీకి సినిమా విడుదల చేస్తున్నాడనే భావన ఆయనలో కలిగింది. గిరిబాబు చెప్పిన జ్ఞాపకాల ప్రకారం, ఈ పరిణామంతో ఎన్టీఆర్ కొంతకాలం ఆయనపై కోపంగా ఉన్నాడు.
చివరకు 1978 ఆగస్టు 11న ఎన్టీఆర్ ‘సింహబలుడు’ విడుదలైంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైంది. మరోవైపు, కృష్ణ నటించిన ‘సింహగర్జన’ 14 రోజుల తర్వాత విడుదలై విజయం సాధించింది. దీంతో కృష్ణ అభిమానులు ‘కృష్ణ గెలిచారు’ అంటూ ప్రత్యేకంగా కరపత్రాలు కూడా పంచారు. (ఏమాటకామాట సింహబలుడులో సన్నజాజులోయ్ పాట మాత్రం సూపర్ హిట్)…
ఈ పరిణామం ఎన్టీఆర్‌కు మరింత అసహనం కలిగించిందో ఏమో కానీ, గిరిబాబు చెప్పిన ప్రకారం దాదాపు నాలుగేళ్లపాటు ఆయనతో మాట్లాడలేదు.
ఇదంతా గిరిబాబు స్వయంగా పంచుకున్న పాత సినీ జ్ఞాపకం. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గిరిబాబు తన రెండో సినిమాను తానే హీరోగా చేయాలనుకున్నాడు. కానీ బడ్జెట్ కారణంగా కృష్ణను హీరోగా పెట్టాడు. ఆ నిర్ణయం ఆయనను అప్పటి తెలుగు సినిమా చరిత్రలోనే ఆసక్తికరమైన ఎన్టీఆర్- కృష్ణ పోటీ కథలో ఒక పాత్రధారిని చేసింది.
ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి కథ చెప్పిన ధైర్యం ఒకవైపు, కృష్ణతో భారీ సినిమా నిర్మించాలన్న పట్టుదల మరోవైపు… గిరిబాబులోని నిర్మాతను కూడా ఈ సంఘటన పరిచయం చేస్తుంది….
Share this Article