Bharadwaja Rangavajhala…….. ఎన్టీఆర్ శతజయంతి సంవత్సర సందర్భంగా ….
నక్సలైట్లే దేశభక్తులు అని ఎన్నికల సభల్లో ప్రకటించి అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ …. పాలనలో అంతకు ముందున్న కాంగ్రెస్ పాలనలో లేని ఓ కొత్త పద్దతిని ఎన్టీఆర్ పోలీసులు అమల్లోకి తీసుకువచ్చారు.
అదేమిటీ అంటే …. మనుషుల్ని మాయం చేసి చంపేయడం … ఎవరైనా అడిగితే మాకేం తెల్సూ అని బుకాయించడం.
Ads
లాకప్పు మరణాలు , గుంపుల మీద కాల్పులు, ఎన్ కౌంటర్ పేరుతో చేసే హత్యలు కాకుండా … మనుషుల్ని అదుపులోకి తీసుకుని చంపేసి శవాలను అదృశ్యం చేయడం పోలీసులు చేసే హత్యల్లో ఒక ప్రత్యేక రకం … అది అప్పటికి కొత్తరకం.
మొదటి మూడు రకాల హత్యలకూ ఓ తలనొప్పి నడుస్తుంది.
శవాలకు పంచనామా నిర్వహించడం పోస్ట్ మార్టం చేయించడం, మేజిస్టీరియల్ విచారణ లాంటి తతంగం ఉంటుంది.
ఈ మాయం చేసి హత్య చేసి శవాలను కూడా అదృశ్యం చేసేస్తే ఈ గోలంతా ఉండదు కదా …
ఎన్టీఆర్ ప్రధానంగా సినిమా నటుడు దర్శకుడూ కనుక ….
సినిమా భాషలో చెప్పాలంటే ల్యాగ్ ఉండదు కదా ….
అని ఎన్టీఆర్ అనుకుని ఉండవచ్చు …
అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మాయం హత్య కేసులు మొదలయ్యాయి ఎన్టీఆర్ హయాంలో.
ఇలా మాయం అయిన వారు అప్పటి లెక్క ప్రకారం యాభై పైనే ఉంటుంది.
అయితే దొరికిన ఆధారాలను బట్టీ నలభై ఏడు మంది మాయం అయినట్టు అప్పటి పౌరహక్కుల సంఘం పత్రిక స్వేచ్చ లో వచ్చిన జాబితా బట్టీ అర్ధమౌతుంది.
ఇలా మాయం చేసి చంపేయడం వల్ల పోలీసులకు ఎంత హాయిగా ఉంటుందో చెప్పడానికి ఓ ఉదాహరణ చెప్తాను వినండి …
వరంగల్ జిల్లా కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమిడి అనే గ్రామంలో 1984 డిసెంబర్ 18 న కొడవటి సుదర్శన్ అనే ఓ యువకుడిని కాజీపేట పోలీసులు అరెస్ట్ చేసి చంపేసి శవాన్ని అదే రాత్రి ములుగు అడవుల్లో దహనం చేసి చేతులు దులిపేసుకున్నారు.
దాదాపు రెండు వారాల తర్వాత విషయం బయటకు వచ్చింది.
జిల్లా కలెక్టర్ ఆర్.పి.సింగ్ ను కలసి మేజిస్టీరియల్ ఎంక్వైరీ జరిపించమని పౌరహక్కుల సంఘం అడిగితే శవం కనిపించకపోతే అది కష్టడీ మరణం అని ఎలా చెప్పగలం … కనుక సిఆర్పీసీ 176 సెక్షన్ వర్తించదు కాబట్టి మేజిస్టీరియల్ విచారణ జరిపించడం సాధ్యం కాదని చెప్పారు.
మాయం చేయడం వెనుక ఉద్దేశ్యమే ఇది ఈ తతంగాన్నంతా ఎత్తేయడం … సారీ ల్యాగ్ కట్ చేయడం …
అయితే ఆర్.పి సింగ్ గారు చివరగా ఓ మాట చెప్పారట …
మాయం అయిన కొడవటి సుదర్శన్ దళితుడు కాబట్టి దళితునిపైన అత్యాచారం గా భావించి విచారణ జరిపించవచ్చనీ … సోషల్ వెల్ఫేర్ శాఖ ఆదేశం ఉంటే అది సాధ్యం అవుతుందని ఓ మార్గం సూచించి పంపారు.
అనుకోకుండా సోషల్ వెల్ఫేర్ ప్రిన్స్ పల్ సెక్రటరీగా అప్పుడు శంకరన్ ఉన్నారు.
ఆయన అధికార పరిమితుల్లో ప్రజలకు సేవ చేయలనే తపన ఉన్నవాడు కావడంతో … పౌరహక్కుల సంఘం అర్జీ పెట్టిన మరుక్షణం విచారణకు ఆదేశించారు.
ఆ విచారణకు హాజరు కావాల్సిన సాక్షుల్ని కూడా మాయం చేయడానికి ప్రయత్నం చేశారు.
అయితే కాకతీయ యూనివర్సిటీలో జరిగిన ఓ ఫంక్షన్ లో పాల్గోడానికి వచ్చిన జార్జ్ ఫెర్నాండెజ్ కారులో సాక్షులను పంపి విచారణ జరిగేట్టు చేయగలిగారు పౌరహక్కుల సంఘం కార్యకర్తలు.
కొడవటి సుదర్శన్ హత్యకు నిరసనగా మాత్రమే కాకుండా … ఎఐఆర్ఎస్ఎఫ్ సభలకు హాజరై వెనక్కి వస్తున్న కార్యకర్తలను అరెస్ట్ చేసి విచక్షణారహితంగా వారిని కొట్టి వరంగల్ జైలుకు పంపినందుకు… అలాగే వరంగల్ కాజీపేట ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీ ప్రాంతాల్లో తీవ్రనిర్భంధం సాగిస్తున్నందుకూ ….
కాజీపేట్ ఎస్.ఐ యాదగిరిరెడ్డిని పీపుల్స్ వార్ వారు కాజీపేట రైల్వే స్టేషన్ లోనే చంపేశారు.
కొడవటి సుదర్శన్ కేసు తవ్వినందుకు అప్పటికే పౌరహక్కుల సంఘం మీద కోపంగా ఉన్న పోలీసులు యాదగిరిరెడ్డి హత్యతో మరింత కోపోద్రిక్తులై డాక్టర్ రామనాథంగారిని హత్య చేశారు.
ఆ తర్వాత రాష్ట్రంలో మనుషుల్ని యాయం చేయడం అనేది విపరీతంగా జరిగింది.
కోర్టులు కూడా ఈ మాయం కేసులపై శ్రద్ద పెట్టలేదు.
హెబియస్ కార్పస్ పిటీషన్లు వేసినా జడ్జీలు పట్టించుకోలేదు.
నిజామాబాద్ జిల్లా అంబారీ పేటకు చెందిన లింగారెడ్డి కి సంబంధించి హెబియస్ కార్పస్ పిటీషన్ వేస్తే … కోర్టు పట్టించుకోలేదు.
1988 డిసెంబర్ 25 న హైద్రాబాద్ విక్రాంత్ థియేటర్ దగ్గర అరెస్ట్ అయిన పీపుల్స్ వార్ నాయకుల్ని కూడా ఇలానే మాయం చేశారు.
వీరి గురించి ఎపీసీఎల్సీసీ హెబియస్ కార్పస్ పిటీషన్ వేస్తే ….
మీరు వాళ్లకు బంధువులు కాదు కదా … అని కోర్టు భావించి పోలీసుల నివేదికతో సంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ ఐలయ్య రాజమల్లుల ఆచూకీ కోసమే పీపుల్స్ వార్ ముత్తారం మండలాధ్యక్షుడు మలహర్ రావును కిడ్నాప్ చేసి … ప్రభుత్వం ఐలయ్య రాజమల్లు కేసులో విచారణకు తిరస్కరించడంతో మలహర్ రావును చంపేశారు.
వీళ్లే కాదు 1990 జనవరి లో వరంగల్ జైలు నుంచీ విడుదలైన వ్యవసాయ కూలీ మహిళా సంఘం నాయకురాలు నర్సమ్మను కార్యకర్తలు వసంత, సుజాతలను కూడా పోలీసులు మాయం చేశారు.
మాయం చేయడం అంటే చంపేసి దగ్ధం చేయడమే.
వీరి గురించి కూడా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ వేస్తే … పోలీసులు యధాప్రకారం మాకేం తెల్సూ అని అమాయకం నటించారు.
అన్ని పిటీషన్లనూ కొట్టేసినట్టుగానే జడ్జిగారు ఈ పిటీషన్ ను కూడా కొట్టేశారు.
ఈ కేసులోనే సాక్షాలు సేకరిస్తున్న సుభాష్ ను పోలీసులు కాల్చి చంపేశారు.
కొడవటి సుదర్శన్ తో పాటు ఇలా మాయం అయి చనిపోయిన వారందరిలో తెలంగాణ వారే అత్యధికులు.
అయితే విజయవాడలో డాక్టర్ ఎస్.ఎమ్.ప్రసాద్ ను అరెస్ట్ చేసి హత్య చేసారు పోలీసులు.
1986 అక్టోబర్ పన్నెండున ఆయన పార్టీ పని మీద విజయవాడ వచ్చి … న్యూ కనకదుర్గా లాడ్జిలో దిగారు.
పోలీసులు సహజ పద్దతిలో ఆ రోజు రాత్రి ఆ లాడ్జి మీద రెయిడ్ చేశారు.
అయితే ఈయన గదిలో ఆయన చదువుతున్న పుస్తకం మీద వారి దృష్టి పడింది.
అక్కడ నుంచీ వెళ్లిపోయారు.
వెళ్లిపోయి సిపీ ఆఫీసుకు ఇన్ఫార్మ్ చేశారు.
ఆ తర్వాత యాంటీ గూండా స్క్వాడ్ వారు రంగప్రవేశం చేసి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకుపోయారు.
దీనికి సంబంధించి ఆ మర్నాడు లాడ్జ్ పక్క సందులో ఉన్న టీస్టాల్ దగ్గర చేరిన రూమ్ బాయ్స్ ను విచారిస్తే స్పష్టంగా జరిగిన విషయం అంతా చెప్పారు.
కోర్టులో ఈ విషయం చెప్పడానికి భయపడ్డారు. పోలీసులు కూడా ఈ లోపు వార్ని బెదిరించారు.
లాడ్జిలో రూమ్ ప్రసాద్ పేరుతో కాకుండా వేరేదో పేరుతో ఉండడం లాంటి కొన్ని టెక్నికల్ ఇబ్బందులతో ఈ కేసు ముందుకు నడవలేదు.
ఆయనది మిస్సింగ్ కేసుగా పోలీసులు నమోదు చేసుకున్నారు.
ప్రసాద్ గారి తల్లిగారు అనేక సార్లు అప్పటి హోం మంత్రి కోడెల శివప్రసాద్ ను కల్సినా ప్రయోజనం కలగలేదు.
అప్పటికే ఆయన్ని చంపేసి దహనం కూడా చేసేసి ఉన్నారు కనుక …. పట్టించుకోలేదు.
ఆ లాడ్జ్ పక్క సందులో ఓ మార్వాడీ టీ కొట్టు ఉండేది.
అక్కడకి చాలా మంది ముఖ్యంగా ఆ లాడ్జిలో దిగిన వారూ ఇతరులూ కూడా వచ్చేవారు.
వారితో సంభాషణ జరిపి ఆ రోజు రాత్రి లాడ్జిలో ఏం జరిగిందో తెల్సుకునే పని చేసింది అప్పట్లో పార్టీ యాక్టివిటీస్ లో ఉన్న నేనే ….
అందుకని ప్రసాద్ ను అరెస్ట్ చేశారు అనేది నా మనసుకు బాగా తెల్సు.
కానీ పోలీసులు అడ్మిట్ చేయలేదు. ఇప్పటికీ ఆయనేమైపోయారో ఎవరికీ తెలియదు.
ఇలా మిస్సింగ్ మరణాలు అనే ఓ ప్రక్రియను ఎన్టీఆర్ క్రియేటివ్ గా ఇంప్లిమెంట్ చేస్తే ….
ఆయన అల్లుడు చంద్రబాబు రాజ్యాధికారంలోకి వచ్చాక ….
కోవర్డ్ సిస్టమ్ తీసుకువచ్చి తన సృజనాత్మకతను చాటుకున్నారు.
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరుగుతున్న సందర్భంగా ఇది కూడా గుర్తు చేసుకోవాల్సిన వ్యవహారం అని అనిపించింది … అందుకే ఇలా మీ ముందు ఉంచాను…
#కాలపురుష్, #యుగపురుష్, #శకపురుష్, #ఆదిపురుష్, #యాదిపురుష్, #జాతిపురుష్
Share this Article