1964 నాటి కాలం… గుడి గుంటలు షూటింగ్ సాగుతోంది… అందులో ఎన్టీయార్ హీరో… ఆ పాత్ర బాగా సిగరెట్లు తాగుతూ ఉంటుంది సినిమాలో… నిజానికి రామారావు సాధారణంగా సిగరెట్లు కాల్చరు… కానీ ఏదైనా సినిమాలో సిగరెట్లు కాల్చే పాత్ర ఉంటే మాత్రం రోజుకు రెండు డబ్బాల స్టేట్ ఎక్స్‌ప్రెస్ సిగరెట్లు ఊదేసేవారు… సో, గుడిగంటలు షెడ్యూల్‌లో ఆయన కోసం రోజూ రెండు డబ్బాల స్టేట్ ఎక్స్‌ప్రెస్ బ్రాండ్ సిగరెట్లు తెప్పించి రెడీగా ఉంచేవాళ్లు…
ఈ సినిమాకు డూండీ నిర్మాత… వి.మధుసూదనరావు దర్శకుడు… ఆరోజుల్లో స్టేట్ ఎక్స్‌ప్రెస్ సిగరెట్లు గుండ్రటి డబ్బాల్లో వస్తుండేవి… ఒక్కో దాంట్లో ఇరవై సిగరెట్లు… సినిమాలో కొన్నిచోట్ల ఎన్టీయార్ చేతిలో ఈ డబ్బా కూడా కనిపిస్తుంది… ఫారిన్ సిగరెట్లు కదా, అవి ఎక్కడ పడితే అక్కడ దొరికేవి కావు…
Ads
రోజూ ఉదయం తొమ్మిది గంటలకల్లా ఒక డబ్బా ఎన్టీయార్ వద్దకు చేరిపోవాలి… తరువాత మధ్యాహ్నం భోజనం కాగానే మరో డబ్బా అందించాలి… ఓరోజు మధ్యాహ్నం… మధ్యాహ్నం భోజనాలయ్యాయి… సెట్‌లో ఉన్నాడు ముళ్లపూడి, నిర్మాత డూండీ… సమయానికి ముళ్లపూడికి సిగరెట్లు లేవు… అయిపోయాయి… నాలుక పీక్కుపోతోంది… దాంతో ఎన్టీయార్ కోసం తెప్పించిన డబ్బా సీల్ తీశారు, చెరొక సిగరెట్ ఎంచక్కా ఊదిపారేశారు…
ఈలోపు ఎన్టీయార్ రెస్ట్ తీసుకుని, మేకప్ చేయించుకుంటూ సిగరెట్ డబ్బా కోసం కబురు పెట్టారు… బాయ్ తెచ్చి అందించాడు… సీల్ తీసి ఉండటం చూసి ఎన్టీయార్‌కు చిర్రెత్తింది… రెండు సిగరెట్లు కూడా లేవు… కోపంతో కేకలేశాడు… బాయ్ భయంతో పరుగుపరుగున వెళ్లి ‘‘సార్, హీరోగారు ఫైరయిపోతున్నారు, ఎవరో సిగరెట్ డబ్బా సీల్ తీసి రెండు సిగరెట్లు కాల్చారట’’ అన్నాడు డూండీ గారితో…
‘‘ఐతే ఏమిటట..? వెళ్లి ఆయనకే చెప్పు… నిర్మాత గారు ఒకటి, రైటర్ గారు మరొకటి కాల్చుకున్నారట అని చెప్పు’’ అని డూండీ ఎన్టీయార్ కోపాన్ని లైట్ తీసుకున్నారు… బాయ్ ఎన్టీయార్ వద్దకు వెళ్లి, బులెట్ వేగంతో వెనక్కి వచ్చాడు… ‘‘తనకు ఫుల్ టిన్ కావల్సిందేనట, లేకపోతే హీరోగారు అసలు సెట్‌కు రానంటున్నారండీ’’ అని చేదు కబురు చెప్పాడు… డూండీ తెల్లబోయారు…
తప్పేదేముంది..? ఈ సిగరెట్ డబ్బా కోసం పంచాయితీ దేనికి..? తెప్పిస్తే పోలా అనుకున్నాడు… ప్రొడక్షన్ అసిస్టెంట్ చిట్టిబాబును పిలిచి, కారెక్కించి, మద్రాస్‌లో ఎక్కడున్నా సరే, అర్జెంటుగా ఓ సిగరెట్ డబ్బా తీసుకురాపో అన్నాడు… మామూలుగా టీనగర్‌లో ఆంధ్రా కిళ్లీ షాపులో ఈ ఫారిన్ సిగరెట్లు చాలా దొరుకుతాయి… కానీ ఆరోజు అక్కడికి వెళ్తే స్టాక్ అయిపోయిందని చెప్పాడు సదరు కిళ్లీ కొట్టు కైలాసం…
ఇంకా ఎక్కడ దొరకొచ్చు అనడిగాడు… ఆయనేదో అడ్రస్ చెప్పాడు… అక్కడికి ఆరు మైళ్లు దూరం… పారిస్ కార్నర్‌లోని కాశిచెట్టి వీథి… అక్కడికి ఆగమేఘాల మీద వెళ్లాడు చిట్టిబాబు… ఇక్కడ ఎన్టీయార్ ధుమధుమలాడిపోతున్నారు ఆ ధూపం కోసం… పొగలు కక్కుతున్నారు… తీరా కొత్త సిగరెట్ టిన్ తీసుకొచ్చి ఎన్టీయార్ చేతికి భద్రంగా ఇచ్చేసరికి టైమ్ నాలుగయిపోయింది… అప్పుడు గానీ ఎన్టీయార్ మేకప్ రూం నుంచి సెట్‌లోకి రాలేదు, షూటింగ్ జరగలేదు…
ఆయన కోపాన్ని గమనించి, చల్లార్చడానికి నిర్మాత డూండీతోబాటు రమణ కూడా ఎన్టీఆర్ కు సారీ చెప్పారు… “సిగరెట్ కోసం కాదు బ్రదర్! డిసిప్లిన్… ఆ ప్రిన్సిపుల్ కు నేను కూడా అతీతుణ్ణి కాను…” అంటూ కూల్ గా నడిచారు షాట్ కోసం ఎన్టీఆర్ …. చేతిలో సిగరెట్ డబ్బాను సుతారంగా ఊపుకుంటూ…. అరవై ఏళ్లయింది, స్టిల్ ఈరోజుకూ తెలుగు సినిమా సెట్లలో హీరోయే కింగ్… అంతే… (ఆచారం షణ్ముఖాచారి వాట్సప్ పోస్టు ఆధారంగా… సరదాగా…)
Share this Article