Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్..! పుష్పరాజ్‌కు వసూళ్ల తాత వేటగాడు..!!

December 10, 2024 by M S R

.

ప్రేక్షకుల మనసుల్ని వేటాడిన సినిమా . థియేటర్లలో జనాన్ని గంతులేయించిన సినిమా . యన్టీఆర్ రాఘవేంద్రరావు జైత్రయాత్రలో మరో మైలురాయి ఈ సినిమా . 55 ఏళ్ల యన్టీఆర్ 15 ఏళ్ల అతిలోకసుందరితో పోటాపోటీగా డాన్సులేసిన సినిమా .

50+లో NTR , ANR ల నట విహారం ఓ గొప్ప సాహసమే . ముఖ్యంగా 1979 లో వచ్చిన ఈ వేటగాడు సినిమాలో యన్టీఆర్ పడ్డ కష్టం అంతాఇంతా కాదు . ఈనాటి కుర్ర నటీనటులు వాళ్ళిద్దరి నుంచీ చాలా నేర్చుకోవాలి .

Ads

40 సెంటర్లలో యాభై రోజులు , 29 సెంటర్లలో వంద రోజులు , 4 సెంటర్లలో సిల్వర్ జూబిలీ , హైదరాబాదులో 408 రోజులు !! సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ . మా నరసరావుపేట నాగూర్వలి టాకీసులో కూడా వంద రోజులు ఆడిందోచ్ .

జాబిలితో చెప్పనా జాము రాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి పాటలో శ్రీదేవి అందాలు వర్ణనాతీతం . అలాగే కొండ మీద చందమామ కోనలోన కోయభామ పాటలో కూడా శ్రీదేవిని రాఘవేంద్రరావు చాలా అందంగా చూపారు . ప్రేక్షకులు తమ గుండెల్ని థియేటర్లలో వదిలి పెట్టి వెళ్ళారు .

జనాల్ని గంతులేయించిన పాట ఆకుచాటు పిందె తడిసే . ఇద్దరూ పోటీ పడ్డారు . (కోటు, హ్యాటుతో ఫులు డ్రెస్ ఎన్టీయార్, అందాలన్నీ కనిపించే తడి పలుచటి తెల్ల చీరెలో శ్రీదేవి…) వేటగాడు శత దినోత్సవ ఫంక్షన్లో అక్కినేని రాఘవేంద్రరావుకు ఓ కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు . శ్రీదేవిని సాగదీసారు అని . నూటికి నూరు పాళ్ళు కరెక్ట్ . 15 ఏళ్ళలో ఇరవై ఏళ్ళ పరిపక్వ యువతిలాగా కనిపిస్తుంది . హేట్సాఫ్ .

ntr

జనాన్ని ఊపేసిన మరో పాట పుట్టింటోళ్ళు తరిమేసారు కట్టుకున్నోడు వదిలేసాడు . జయమాలినితో పోటీగా డాన్స్ చేసారు యన్టీఆర్ . మిగిలిన పాటలు బంగారు బాతు గుడ్డు , ఓసోసి పిల్ల కోడి పెట్టా పాటలు కూడా వీర హిట్టయ్యాయి . చివరకు ఇది పూవులు పూయని తోట పాటను కూడా హిట్ చేసారు .

పాటలన్నీ వేటూరి వారి విజృంభణే . ఇంత సూపర్ డూపర్ హిట్ పాటలకు మ్యూజిక్కును ఇచ్చింది చక్రవర్తి . అద్భుతంగా పాడారు సుశీలమ్మ , బాలసుబ్రమణ్యం , యస్ జానకి . ఈ సినిమా సూపర్ విజయానికి మరో కారణం డాన్సుల్ని కంపోజ్ చేసిన నృత్య దర్శకుడు సలీం . కొండ దేవత వద్ద గ్రూప్ డాన్స్ జనాన్ని ఊపేస్తుంది .

మనం మెచ్చుకోవలసిన మరో వ్యక్తి జంధ్యాల . కధ ఎక్కడా రొటీన్ అనిపించకుండా బ్రహ్మాండంగా నేసారు . అంతే కాదు ; డైలాగులను ప్రేక్షకులు మరీ మరీ చెప్పుకునేలా వ్రాసారు . ముఖ్యంగా రావు గోపాలరావు ప్రాస డైలాగులు . సత్యనారాయణ హేట్ నుండి బూట్ల దాకా ఒకే రంగు ఐడియా రాఘవేంద్రరావుకు ఎలా వచ్చిందో కానీ బాగానే పేలింది .

అడవిరాముడు , యమగోల సినిమాల తర్వాత తెలుగు సినీ రంగాన్ని కలెక్షన్ల సుమానీలో అదరగొట్టేసిన ఈ సినిమా గురించి ఎంత వ్రాసినా చాలదు . ముఖ్యంగా యన్టీఆర్ , శ్రీదేవిల జోడీ . వాళ్ళిద్దరి జోడీలో మొదటి సినిమా . జంటగా నటించడానికి శ్రీదేవి తటపటాయిస్తుంటే యన్టీఆరే రంగంలోకి దిగి ఒప్పించారట . బహుశా అందుకే ఆంత కష్టపడి ఉంటాడు పని రాక్షసుడు !

నాగేష్ హాస్యం వికటించకుండా జాగ్రత్తగా కంట్రోల్ చేసారు . రావు గోపాలరావు , సత్యనారాయణ నటనలను ప్రత్యేకంగా అభినందించవలసిందే . జగ్గయ్య , కాంతారావు , చలపతిరావు , అల్లు రామలింగయ్య , మమత , పుష్పలత , తదితరులు ఇతర పాత్రల్లో బాగా నటించారు .

తెలుగులో వీర హిట్టయిన ఈ సినిమాను జితేంద్ర , పూనం థిల్లాన్ తో హిందీలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో తీస్తే అక్కడా హిట్టయింది . నిర్మాతలు అర్జునరాజు , శివరామ రాజులకు వద్దంటే డబ్బు . సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . యన్టీఆర్ , శ్రీదేవి అభిమానులు ఎన్ని సార్లయినా చూడొచ్చు . రాంగోపాల్ వర్మ కూడా . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ….. ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం )



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అత్యంత అసాధారణ కరెంటు బిల్లు… నమ్మడమే కష్టం సుమీ….
  • సొంత ‘బతుకమ్మ’ పేర్చుకుని… తన ఆట తాను ఆడుకోవడమేనా..?
  • ఫక్తు అక్కినేని మార్క్ వన్ ప్లస్ టూ రొటీన్ సినిమా ప్రేమ కథ..!!
  • ఆ సిరివెన్నెల పాటలు… రాసిన అర్థాలు వేరు- వాడుకున్న తీరు వేరు…
  • శరణార్థుల ఆశాసూచిక – భారత రాజ్యాంగంలోని కుబేరుని కళాచిత్రం…
  • కశ్మీర్‌లో యూఎన్ ధర్మసత్రం షట్‌డౌన్… శెభాష్ జైశంకర్… ఇదీ టెంపర్‌మెంట్..!!
  • నరాల్ని సుతారంగా గిచ్చే పాటగత్తె… సరిజోడుగా ఆయన అల్లరల్లరి….
  • అసలే సుగర్… మామిడి పండు చూస్తే టెంప్టింగ్… మరెలా..?!
  • జాతికే పిత..! కానీ ‘మంచి పిత’ కాదు…! మిరుమిట్ల వెనుక చీకటి చారికలు..!!
  • ఈ తప్పుడు కలెక్షన్ల ప్రకటనలతో ఇప్పుడు ఒరిగేదేమిటి సూర్యా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions