.
Abdul Rajahussain
… ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారి ‘స్మృతి’ దినం..!!
అక్కినేని అన్నపూర్ణ స్టూడియో స్థలాన్ని ఎన్టీఆర్ లాగేశారా ?
ఎన్టీఆర్,…. ఏఎన్నార్ … నడుమ అన్నపూర్ణ స్టూడియోస్. !!
మూడున్నర దశాబ్దాల నాటి ముచ్చట పునశ్చరణ )
హైదరాబాదు బంజారాహిల్స్ లోని అన్నపూర్ణా స్టూడియోస్ అందరికీ తెలిసిందే. చలనచిత్ర పరిశ్రమను మద్రాసు నుండి హైదరాబాదుకు తరలించాలన్న ఆలోచనకు ప్రప్రథమంగా అక్కినేని నాగేశ్వరరావు శ్రీకారం చుట్టారు. ఆయన కుటుంబంతో సహా హైదరాబాదుకు షిఫ్ట్ అయినపుడు, అప్పటి ముఖ్యమంత్రి ‘జలగం వెంగళరావు’ గారు బంజారా హిల్స్ లో స్టూడియో నిర్మాణానికి స్థలం కేటాయిస్తామన్నారు.
Ads
అయితే తనకు ఉచిత కేటాయింపు అక్కర లేదని, తాను స్థలాన్ని కొనుక్కుంటానని చెప్పారు. అలాగే ప్రభుత్వం నుంచి నామినల్ ధరకు స్థలాన్ని కొని, అక్కడ అన్నపూర్ణ స్టుడియోను నిర్మించారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.
అయితే ఈ స్టూడియోకు ఆనుకొని వున్న లోయ కింది భాగంలో మరో ఏడెకరాల స్థలం కూడా అన్నపూర్ణ స్టూడియో కిందనే వుంది. ఇప్పుడు మనం ముచ్చటించుకోబోయే విషయం దీనికి సంబంధించిందే..!!
మర్రి చెన్నారెడ్డి తొలిసారి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు స్థలాన్ని అన్నపూర్ణ స్టూడియోకు ఔట్ డోర్ షూటింగ్ నిమిత్తం ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమాభివృధ్ధి కోసం ఈ స్థలాన్ని కేటాయించడం జరిగిందని, సినీపరిశ్రమకు సంబంధించి మాత్రమే దీన్ని ఉపయోగించాలని, ఇతరత్రా ఉపయోగించరాదంటూ ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలతో జీవో జారీ చేసింది.
కొండపైన ప్రధాన స్టూడియోకు అనుబంధంగా ఈ ఏడెకరాల స్థలాన్ని అభివృద్ధి చేయాలి. ఈ స్థలం అన్నపూర్ణ స్టూడియోకు కొంత దూరంలో వుండటం, అప్పటికే ప్రధాన స్టూడియో బాగా అభివృద్ధి చెంది వుండటంతో ఈ స్దలాన్ని ఖాళీగానే పెట్టారు . కొంత కాలం తర్వాత సినీ నిర్మాత చదలవాడ తిరుపతి రావుతో కలిసి అక్కినేని ఇక్కడ అనురాధ టింబర్ డిపోను ప్రారంభించారు.
కలప వ్యాపారం సజావుగానే సాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలై తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఓ సంవత్సరం గడిచింది. ఓ రోజు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు గారు ఎందుకనో అటుగా పోతుంటే ఈ టింబర్ డిపో ఆయన కంటబడిందట. ఇక్కడ ఇంత పెద్ద కలప డిపో ఎవరిదని ఆయన ఆరా తీశారు.
అప్పుడు అసలు సంగతి తెలిసింది. ప్రభుత్వం స్టూడియో కోసం స్థలం కేటాయిస్తే అక్కినేని కలప వ్యాపారం చేస్తున్నారు, ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధమని, అక్కినేని జీవోను ఉల్లంఘించారని అధికార గణం విన్నవించింది.
నగరం నడిబొడ్డులో, ఖరీదైన ప్రాంతంలో ఇంత ప్రైమ్ ల్యాండ్ ఇలా కావడం ఎన్టీఆర్ గారికి రుచించలేదు. వెంటనే నిబంధనల ప్రకారం నోటీసు జారీ చేసి అయిదెకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోమని ఆదేశించారు.
ఇంకేముంది? రెవెన్యూ అధికార గణం ఉరుకులు పరుగుల మీద ఓ నోటీసు జారీ చేశారు .నిబంధనల మేరకు అయిదేళ్ళలో మీరు ఇక్కడ స్టూడియోను ఏర్పాటు చేయాల్సి వుండగా, గడువు దాటినా కూడా స్టూడియోను నెలకొల్పలేదు… సరికదా నిబంధనల్ని ఉల్లంఘించి కలప వ్యాపారం చేస్తున్నందున నిబంధనల మేరకు ప్రభుత్వం ఈ అయిదెకరాల్ని ఎందుకు స్వాధీనం చేసుకోరాదో తెలపాలని సంజాయిషీ కోరింది…
అక్కినేని నోటీసు చూసి బిత్తరపోయారు. తన సహనటుడు సిఎంగా వుండగా ఇలా ఎలా జరిగిందని కూపీ లాగితే అసలు విషయం బయటపడింది. సిఎం ఆదేశాల మేరకు జరిగింది కాబట్టి ఇక ఆయనకు చెప్పినా వృధా అన్న నిర్ణయానికి కొచ్చారు అక్కినేని… పైగా అప్పట్లో ఇరువురి మధ్య ‘ఇగో’ ల సమస్య వుండనే వుంది. ఏం చేయాలో పాలుబోక సలహా కోసం ఉభయ మిత్రుడైన ఈనాడు రామోజీ రావు గారిని సంప్రదించారు అక్కినేని…
అయితే ఆయన ఏం సలహా ఇచ్చారో? ఏమిటో ఆ కథాకమామీషు మాత్రం రహస్యం. ఇది జరిగిన మరుసటి రోజు రామోజీరావు గారు నన్ను (అప్పుడు నేను ఈనాడు స్టేట్ ేబ్యూరోలో పొలిటికల్ రిపోర్టర్ గా వున్నాను) క్యాబిన్లోకి పిలిచారు…
అలా ఛైర్మన్ గారు క్యాబిన్లోకి పిలవడం అదే మొదటిసారి. కొంత టెన్షన్ గా వుండింది. ఆయన ఎందుకు
పిలిచి వుంటారు? ఒకటే ఉత్సుకత. లోపలికి వెళ్ళాక కుర్చీలో కూర్చోమన్నారు. “ మరేం లేదు, మీరు అక్కినేని నాగేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళి ఆయన్నుకలవండి . స్టూడియోకు సంబంధించిన విషయం . ఆయనేం చెబుతారో వినండి. నిబంధనలు ఎలా వున్నాయో చూసి వార్త రాయండి అన్నారు.
అలాగే సార్ అంటూ లేవబోతుండగా… “నేను చెప్పానని మీరు అక్కినేని నాగేశ్వరరావు గారికి ఫేవర్ గా రాయాల్సిన పని లేదు. ఆబ్జెక్టివ్ గా వున్నదున్నట్లు రాయండి ‘ అన్నారు హెచ్చరికగా. అలాగే సర్ అంటూ తలూపి బయటకొచ్చి గట్టిగా ఊపిరి పీల్చుకొని అక్కినేని ఇంటికి బయలుదేరాను…
బంజారా రోడ్ నెం.1 లో అక్కినేని నాగేశ్వరరావు గారి ఇల్లు. పక్కనే టి.సుబ్బిరామి రెడ్డి గారి బంగ్లా. సాయంత్రం 5 గంటలు అయింది. గేటు దగ్గరకు వెళ్ళి బెల్ మోగించాను. వాచ్ మెన్ వచ్చి గేటు తెరిచాడు. ‘నేను ఫలానా..’, ఈనాడు పేపర్ నుంచి వచ్చాను. నాగేశ్వరరావు గారికి చెప్పండని అన్నాను.
వాచ్ మెన్ లోపలికి వెళ్ళిన అయిదు నిముషాల్లో అక్కినేని బయటకు వచ్చారు. తెల్ల లాల్చీ, పంచెలో మెరిసిపోతున్నారు. బహుశా నేను వస్తున్న సంగతి ఆయనకు ముందే తెలుసేమో… సాదరంగా ఆహ్వానించి
లాన్ లో ఉన్న తూగుటుయ్యాల మీద కూర్చున్నారు. నన్ను కూడా పక్కనే కూర్చోబెట్టుకున్నారు.
నిజానికి ఆరోజు నాకు పెద్ద పండగ కిందే లెక్క. నేను అక్కినేని అభిమానిని. ఎంతగా అంటే… ఆయన కొత్త సినిమా వస్తే విజయవాడ వెళ్ళి తొలిరోజునే సినిమా చూసి మురిసేంత. అక్కినేని మరో వీరాభిమాని, నా మిత్రుడు నందికంటి సాంబశివరావు (మంగళగిరి) … పరిచయంగా ముందు అటు నుంచి నరుక్కొద్దామని నందికంటి పేరు చెప్పాను. ఆయన ఎంతో సంతోషించాడు… “బాగున్నాడా’ అని అడిగారు…
కాఫీ ‘ సారం ‘......!!
ఈ లోగా వాచ్ మెన్ రెండు పెద్ద కప్పుల నిండా వేడి వేడి కాఫీ తెచ్చాడు. ఓ కప్పు నా చేతిలో పెట్టి, రెండో కప్పు అక్కినేనికిచ్చాడు… తాగండి అన్నారు అక్కినేని. కాఫీ తాగుతూ తలపైకెత్తి చూశాను.
“మీరెప్పుడైనా రామారావు ఇంటికి వెళ్ళారా?ఎప్పుడైనా ఆయన కాఫీ గానీ, టీ గానీ ఇచ్చాడా?” అని అడిగారు.
ఆయనలా ఎందుకడిగారో నాకర్థం కాలేదు. “ చాలాసార్లు వెళ్ళానండీ…. కాఫీ గానీ టీ గానీ ఇస్తూనే వుంటారు” అన్నాను…
అలాగా.., ”పీనాసోడు. ఇచ్చినా ఏ అర కప్పో ఇచ్చి వుంటాడు. ఇలా ఫుల్ కప్ ఇవ్వనే ఇవ్వడు “ అన్నారు అక్కినేని. అప్పుడెందుకో ఆయనిచ్చిన కాఫీ తాగడం ఇబ్బందిగా అనిపించింది… ఆయన కళ్ళలో రామారావు గారి మీద కోపం ప్రస్ఫుటంగా కనిపించింది…
ఇదే సరైన సమయమని అసలు విషయం అడిగాను… అన్నపూర్ణ స్టూడియోస్ కు అయిదెకరాల ల్యాండ్ అలాట్ మెంట్ కు సంబంధించిన జీవో, ప్రభుత్వం జారీ చేసిన తాజా షోకాజ్ నోటీస్ జిరాక్స్ కాపీలు చేతిలో పెట్టారు. ఓసారి చదివాను. మీరేమైనా చెబుతారా అన్నాను…
“నేను చెప్పినట్లు కాకుండా మీకు తెలిసినట్లు రాయండి. లేకుంటే ఆయన (రామారావు) మరోలా ఫీలవుతాడు “ అన్నారు. అలాగే చెప్పండన్నాను.!
“మీకు తెలుసు. అన్నపూర్ణ స్టూడియో కోసం నేనెంత కష్టపడుతున్నదీ.. కొండలో రాళ్ళను తొలిచి మొక్కలు పెంచుతున్నాను. పర్మినెంట్ ఫ్లోఫ్లోర్లు వేశాను. ఇదంతా చూసి చెన్నారెడ్డి గారే ఔట్ డోర్‌కు పనికొస్తుందని ఈ అయిదెకరాలు ప్రభుత్వం తరపున కేటాయించారు. అయితే ఇంతకు ముందు లాగానే కొనుక్కుంటానంటే
ఆయన ఒప్పుకోలేదు .ప్రభుత్వపరంగానే సినీ పరిశ్రమకు ప్రోత్సాహంగా ఈ అయిదెకరాలు కేటాయించారు.
ప్రస్తుత అవసరాలకు అన్నపూర్ణ మెయిన్ స్టూడియో సరిపోతోంది. అందుకని కింది అయిదెకరాల్ని ఖాళీగా పెట్టాను. ఇక్కడ ఖాళీగానే వుంది కదా! నా టింబర్ నిల్వ చేసుకుంటానని మిత్రుడు చదలవాడ అడిగితే సరే అన్నా. అక్కడ కలప బ్యాక్ డ్రాప్ లో రెండు సార్లు షూటింగ్ లు కూడా జరిగాయి. కేవలం నా మీద కోపంతోనే దీన్ని లాక్కోడానికి ఇలా చేస్తున్నాడు” అన్నారు…
షూటింగ్ ఫొటోలు ఇస్తామని ఇంట్లోకి తీసుకెళ్ళారు. అక్కడ నాగార్జున వున్నారు.. అప్పుడే సినిమాల్లోకి వచ్చే ప్రయత్నాల్లో వున్నట్లు పేపర్లో వార్తలు చూశాను. ”మా చిన్నబ్బాయి నాగార్జున.” అంటూ పరిచయం చేశారు…
ఆ తర్వాత ‘వస్తానండీ ‘…. అంటూసెలవు తీసుకున్నాను .సోమాజీగూడలోని ఆఫీసుకెళ్ళి వార్త రాసిచ్చాను. తెల్లారే మొదటి పేజీలో కనిపించింది. దానిమీద సినీవర్గాల నుంచి విమర్శలు, ప్రతివిమర్శలు వచ్చాయి. అందరూ ప్రభుత్వ చర్యను తప్పు పట్టారు. ఎన్టీఆర్ గారిదే తప్పు అన్నట్టు మాట్లాడారు…
కొన్ని రోజుల తరువాత……..!!
ఆ ఐదు ఎకరాల్లో టింబర్ డిపో కనిపించలేదు. ఒకటీ రెండూ ఔట్ డోర్ సెట్లు వెలిశాయి. ఏమైందో ఏమో గానీ …. అక్కినేని ఆ నోటీసుకు బదులిచ్చారు. అక్కడ షూటింగ్ లు జరుగుతున్నాయి. వాటికోసమే కలపను తోలామని ,ప్రస్తుతం కలపను ఖాళీ చేసి, సినిమా ఔట్ డోర్ సెట్లు నిర్మిస్తున్నామని “ సమాధానం ఇచ్చారు.
దీంతో ప్రభుత్వం వార్నింగ్ తో సరిపెట్టుకుంది…
(ఈలోగా తెర వెనుక బుజ్జగింపులు, సంప్రదింపులూ జరిగాయి ) అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా అక్కడ అవుట్ డోర్ షూటింగ్ లు జరుగుతూనే వున్నాయి. ఆ స్థలం అన్నపూర్ణ ఔట్ డోర్ స్టూడియోస్ గానే కొనసాగుతూ వుంది…
నిజానికి ఈ వ్యవహారంలో ఎన్టీఆర్ తప్పేం లేదు. నిబంధనల ప్రకారమే నోటీసు జారీ అయింది…. అయితే నోటీసు ఇవ్వడానికి ముందుగా అక్కినేనికి ఓమాట చెబితే బాగుండేది కదా అన్నది సినీ పెద్దల అభిప్రాయం. సినీపరిశ్రమలో అంతకు ముందు ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య నెలకొన్న స్పర్థ ఈ అపోహకు దారి తీసిందనవచ్చు. మొత్తానికి ఎన్టీఆర్, ఏఎన్నార్ ‘సమ్ వాద ‘కథ చివరకు ఇలా సుఖాంతం అయింది… ఎ.రజాహుస్సేన్...!
Share this Article