.
దాసరి తీసిన ఓ పాత సినిమా ఎమ్మెల్యే ఏడుకొండలు… తనే హీరో… పార్టీలో వర్గ పోరు వల్ల, ఎవరిని సీఎం చేయాలో తేల్చుకోలేని పరిస్థితుల్లో, అందరికీ ఆమోదయోగ్యంగా (లేదా ఎవరికీ అడ్డంకి కాకూడదని) ఏడుకొండలును సీఎం కుర్చీలో కూర్చోబెడతారు… అనుకోకుండా ఎమ్మెల్యే అవతాడు, అలాగే సీఎం అవుతాడు…
మన ప్రజాస్వామ్యం అంకెలాట (నంబర్ గేమ్)… నవ్వులాటగా మారింది… తమిళనాడు రాజకీయాలు అచ్చంగా అలాగే ఉన్నాయి… పార్టీలు నంబర్లాటలో ఎవరి ఆట వాళ్లు ఆడేస్తున్నారు… జనం వైరాగ్యంతో నవ్వుకునేలా..?
Ads
ఎస్, టీవీకే విజయ్‌కు జనం సంపూర్ణ మద్దతు ఏమీ ప్రకటించలేదు… ఇతరులకన్నా ఎక్కువ సీట్లు ఇచ్చారు, అంతే… సో, గవర్నర్ ఆర్లేకర్ ‘ముందు నీ మెజారిటీ చూపించు, తరువాత ప్రమాణస్వీకారం చేయి’ అంటున్నాడు… (తన వెనుక బీజేపీ ఆలోచన, అడుగులు ఎలా ఉన్నా… ఒక గవర్నర్‌గా తను సరైన ధోరణిలో వెళ్తున్నాడని న్యాయనిపుణులు చెబుతున్నారు… విజయ్‌కు మద్దతు ఇస్తామంటున్న పార్టీల తీరు చూస్తే సగటు మనిషికి కూడా గవర్నర్ సందేహాలు హేతుబద్ధమే అనిపిస్తున్నాయి…)
దశాబ్దాల మైత్రి నుంచి… డీఎంకే విసిరేసే ముష్టి సీట్లలో కొన్ని గెలిచే స్థితిలో మాత్రమే ఉన్న కాంగ్రెస్… ఫలితాలు రాగానే డీఎంకేను విసిరికొట్టి, విజయ్ పంచన చేరింది… మంత్రి పదవులు కావాలట… సెక్యులరిజం కోసం మద్దతు అట… విజయ్, పళనిస్వామిలకు వ్యతిరేకంగా మీకు 5 సీట్లు ఇచ్చారు కదా, మరి జనం తీర్పుకు వ్యతిరేకంగా విజయ్ చంకలో చేరడం జనాన్ని మోసం చేయడం కాదా..? పైగా గవర్నర్ అనైతిక ధోరణి అని విమర్శలు… ఉన్న ఐదుగురినీ కాపాడుకోలేక క్యాంపు రాజకీయాలు…
వీసీకే అని మరో పార్టీ ఉంది… ఉన్నవే రెంటు సీట్లు… అవీ డీఎంకే వోట్ల పుణ్యమే… ఇప్పుడు అచ్చంగా ఎమ్మెల్యే ఏడుకొండలు తరహా ఆట ఆడుతోంది… తమకు డిప్యూటీ సీఎం పోస్టు కావాలట… ప్రభుత్వంలో కీలక శాఖలు కావాలట… విజయ్ ఖాళీ చేసే సీటు తమకు కేటాయించాలట (పాపం, త్రిష కృష్ణన్)… నాన్చుతోంది… ఓసారి మా దగ్గరకు వచ్చి అడగలేదు అంటారు, మరోసారి టీవీకేకు తమ మద్దతు మెయిల్ పంపించాం అంటారు… ఏకంగా ఎఐసీసీ నేతలు ఫోన్లు చేసి బతిమిలాడుతున్న దుర్భర సీన్…
మరో పార్టీ ఐయూఎంఎల్… రెండు సీట్లు… అప్పుడే మద్దతు అంటారు, వెంటనే నో, నో, ఇవ్వం అంటారు… మేం డీఎంకే పక్షమే అంటారు… అదొక డ్రామా… సీపీఐ, సీపీఎం ఎప్పటిలాగే ఎవడికీ అర్థం కాని ధోరణి… బయటి నుంచి మద్దతు, మేం ఇప్పటికీ డీఎంకే కూటమే అంటారు… డీఎంకే కూటమిలోనే మేం అనుకున్నప్పుడు ఇక బయటి నుంచి మద్దతు దేనికి..?
వెరసి 108 పాస్ మార్కులు లేవు, రాలేదు… జనం తీర్పులో స్పష్టత లేకపోతే ఇదుగో ఇలాంటి పార్టీలు ఇలాగే ఆడుకుంటాయి… మరో పార్టీ ఉంది టీటీవీ దినకరన్ పెట్టిన ఏఎంఎంకే పార్టీ… జయలలిత పేరిట అమ్మ పార్టీ అని పెట్టుకున్నాడు… వచ్చింది ఒక సీటు, పేరు కామరాజ్… తను మిస్సయ్యాడు, టీవీకే వాళ్లు హార్స్ ట్రేడింగ్ చేస్తున్నారు… మా మద్దతు అన్నాడీఎంకు మాత్రమే, ఆ కూటమినే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి అంటూ ఓ మద్దతు లేఖతో గవర్నర్ ఆఫీసు దగ్గర అర్ధరాత్రి హంగామా.,.
మరోవైపు జనం వద్దని అన్నారు కదా… బద్ధ ప్రత్యర్థులు కదా… డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు తెరవెనుక చర్చలు, సంప్రదింపులు… మరి జనం ఎక్కువ మార్కులు వేసిన వాడు ఏమైపోవాలి..? ఇదే అంకెలాట కమ్ నవ్వులాటలోని అసలు వైరాగ్యం… ఎస్, గవర్నర్ ధోరణే కరెక్టు… ఈ కప్పల తక్కెడ రాజకీయాల్లో ఏ గంటలకు ఎవడు ఏ కూటమిలో ఉంటాడో తెలియని అనిశ్చితిలో… గ్రేస్ మార్కులు ఉండవు, పాస్ మార్కులు చూపిస్తేనే నువ్వు సీఎం అంటున్నాడు.,. అది రాష్ట్రపతి పాలనకు దారితీసినా సరే..!!
Share this Article