స్ట్రెయిట్‌గా ఓ విషయం… హిందువులు తమ జన్మలో ఒక్కసారైనా వెళ్లాలని భావించే వారణాసికి గతంలో సగటున 30 నుంచి 40 లక్షల మంది భక్తులు వచ్చేవాళ్లు… సరిగ్గా ఒక ఏడాదిలో ఈ సంఖ్య ఎంతకు పెరిగిందో తెలుసా..? 7.35 కోట్లకు పెరిగింది..! గతంలో 14 నుంచి 15 కోట్ల మేరకు మాత్రమే విరాళాలు వచ్చేవి… ఈ ఏడాది 100 కోట్లు దాటింది… ఎందుకింత తేడా..?
కాశీ విశ్వనాథుడి గుడి ఏరియాను 2700 చదరపు అడుగుల నుంచి ఏకంగా 5 లక్షల చదరపు అడుగులకు పెంచారు… జలసేన్, మణికర్ణిక, లలిత ఘాట్ల నుంచి గుడికి వెళ్లడానికి గతంలో సరిగ్గా దారే ఉండకపోయేది… ఇరుకిరుకు గల్లీలు, దుకాణాలు, అక్రమ నిర్మాణాలతో భక్తులకు పెద్ద గందరగోళం… అసౌకర్యాలు, అవస్థలు…
తరువాత ప్రభుత్వం 900 కోట్లు ఖర్చు చేసింది… కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ ప్రాజెక్టుగా పిలిచే ఈ పనుల మీద బాగా శ్రద్ధ పెట్టారు… అక్రమ నిర్మాణాలన్నీ తొలగించారు… దారి వెడల్పు చేశారు… ఆ కారిడార్‌ను గత డిసెంబరు 13న… అంటే ఏడాది క్రితం ప్రధాని మోడీ ప్రారంభించాడు… అప్పటి నుంచి పెరిగిన భక్తుల సంఖ్యను, విరాళాలను వివరించాడు సీఈవో సునీల్ వర్మ… ‘‘ఒక్క ఏడాదిలో ఇంతగా భక్తుల సంఖ్య పెరగడం అనూహ్యం…
Ads
గుడి డేటా ప్రకారం… గత డిసెంబరులో 48 లక్షల మంది వస్తే… ఆ సంఖ్య జనవరిలో 74 లక్షలు, ఫిబ్రవరిలో 68 లక్షలు, మార్చిలో 71 లక్షలు, ఏప్రిలో 66 లక్షలు, మేలో 63 లక్షలు, జూన్‌లో 69 లక్షలు, జూలైలో గరిష్ఠంగా 77 లక్షలకు పెరిగింది… సీజన్ కాదు కాబట్టి ఆగస్టులో 67 లక్షలకు, సెప్టెంబరులో 40 లక్షలకు, అక్టోబరులో 38 లక్షలకు, నవంబరులో 38 లక్షలకు తగ్గింది… 100 కోట్ల విరాళాలు కూడా అనూహ్యమని, అంత పెరుగుదల అంచనా వేయలేదని కాశీ విశ్వనాథ్ ధామ్ స్పెషల్ ఏరియా డెవలప్‌మెంట్ బోర్డు ఛైర్మన్ కుశాల్ రాజ్ శర్మ చెబుతున్నాడు…
గుడి శిఖరం దిగువ భాగానికి, గుడి తలుపులకు బంగారు తాపడం చేయిస్తున్నారు… ఇప్పటికే 23 కిలోల బంగారం పని పూర్తయింది… గర్భగుడిలోని అంతర్ కుడ్యాలకు 37 కిలోల బంగారాన్ని తాపడం చేశారు… ఈ బంగారం ఎక్కడిదో తెలుసా..? ఓ అజ్ఞాత దాత ఏకంగా 60 కిలోల బంగారాన్ని గుడికి ఇచ్చాడు… ఎవరు ఆ అజ్ఞాతదాత..? గుడి నియమాల ప్రకారం అస్సలు బయటపెట్టడం లేదు…
అటు అయోధ్యలో భవ్య మందిరం… అది వైష్ణవం… దాని కథ వేరు, దాని చరిత్ర వేరు… ఇటు వారణాసి గుడికి కొత్త రూపురేఖలు… ఇది శైవం… తరువాత ఏమిటి..? ఎలాగూ చార్ ధామ్ రోడ్డు రవాణా సౌకర్యాల్ని మెరుగుపరుస్తున్న ప్రభుత్వం ఇక మధుర గుడి వివాద పరిష్కారం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తుందా..?!
Share this Article