ఇప్పటికి ఢిల్లీ ఆప్ ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రితోపాటు మరో ఇద్దరో ముగ్గురో మంత్రులు కూడా తీహార్ జైలులో ఉన్నారు కదా… అదనంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీయార్ బిడ్డ కవిత కూడా..! తాజాగా మరో ఇద్దరు ఢిల్లీ మంత్రులకూ ఉచ్చు బిగుస్తోంది… ఈడీ కోర్టుకు చెబుతున్న వివరాల మేరకు అవే సూచనలు కనిపిస్తున్నాయి…
సాధారణంగా ఏదేని ప్రభుత్వంలో నంబర్‌టూగా ఉంటే బోలెడు ప్రయోజనాలు, హోదా, అధికారాలు, పెత్తనాలు, లాభాలు… అదే సమయంలో నంబర్ వన్‌కు నంబర్ టూ నుంచి రాజకీయాల్లో ఎప్పుడూ ముప్పు అంటుంటారు కదా, కానీ కేజ్రీవాల్ వంటి బేమాన్ కేరక్టర్ నంబర్ వన్‌గా ఉంటే నంబర్ టూ కేరక్టర్లకు కూడా ఎప్పుడైనా డేంజరే… విపత్కర పరిస్థితుల్లో నంబర్ వన్ తమ వెంట నడిచే నంబర్ టూ, నంబర్ త్రీలను కూడా ఇరికిస్తారు… తాజాగా జరిగిందీ అదే…
మొన్నమొన్నటిదాకా కేజ్రీవాల్ ప్రభుత్వంలో అతిషి నంబర్ టూ అనేవాళ్లు కదా… మరో మంత్రి సౌరభ్ భరధ్వాజ్ కూడా కీలకమే… కేజ్రీవాల్ జైలు నుంచే పరిపాలన సాగిస్తాడని మొదటి నుంచీ చెబుతున్నది కూడా అతిషి… జైలులో నుంచి సీఎం హోదాలో కేజ్రీవాల్ ఏవో ఉత్తర్వులు జారీ చేసినట్టు చెప్పారు కదా… నిజానికి తను అతిషికి లేఖ రాస్తే ఆమె ఆ జీవో రిలీజ్ చేయించిందని అంటారు… ఐతే జైలులో పెన్నులు, కాగితాలు, ఫోన్లు అనుమతించబోం కదా, అతిషికి ఆయన లేఖ ఎలా రాశాడంటూ జైలు అధికారులు కొట్టిపారేస్తున్నారు… అది వేరే సంగతి…
Ads
ఇప్పుడు అతిషి ఎలా బుక్కవుతున్నదీ అంటే… ఈ కేసులో ఓ కీలక నిందితుడు విజయ్ నాయర్… తను ఏ విషయమైనా మంత్రి అతిషికి రిపోర్ట్ చేస్తాడనీ, తరువాత సౌరభ్‌కు చెబుతాడని, తనకు విజయ్ నాయర్‌తో టచ్ తక్కువేనని కేజ్రీవాల్ ఈడీ విచారణలో పేర్కొన్నాడట… ఈడీయే కోర్టుకు చెప్పింది… అంటే ఈ ఇద్దరు మంత్రులకూ దర్యాప్తు ఉచ్చు బిగిస్తున్నట్టే లెక్క…
ఈ విజయ్ నాయర్… ఆప్ మాజీ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి… మద్యం పాలసీ రూపకల్పనలో 100 కోట్లను సౌత్ గ్రూపుకి చేరవేయడంలో ఈ విజయ్ నాయరే మధ్యవర్తిగా వ్యవహరించాడని ఈడీ ఆరోపణ… ‘‘ఈ కేసులో మరో నిందితుడు సమీర్ మహేంద్ర… తనకు సీఎం కేజ్రీవాల్‌తో భేటికి నాయర్ ప్రయత్నించాడు, కానీ అది వర్కవుట్ కాలేదు, దాంతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడించాడు… ఆ కాల్‌లో నాయర్ మావాడే, ఏదైనా తనతో డీల్ చేయవచ్చునని కేజ్రీవాల్ చెప్పాడు, ఈ వివరాల్ని మా విచారణలో సదరు సమీరే వెల్లడించాడు’ అని ఈడీ పేర్కొంది…
ఈ విజయ్ నాయర్ ప్రస్తుతం జైలులోనే ఉన్నాడు… ఆయనతోపాటు ఇదే కేసుకు సంబంధించి ఆప్ ప్రముఖులు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, సత్యేందర్ జైన్ కూడా జైలులోనే ఉన్నారు… ‘నాయర్ ఏకంగా సీఎం కేజ్రీవాల్ క్యాంపు ఆఫీసు నుంచే తన కార్యకలాపాలు నడిపేవాడు కదాని ఈడీ అడిగితే కేజ్రీవాల్ సమాధానం ఇవ్వలేదు… తన క్యాంప్ ఆఫీసు నుంచే పనిచేసే పార్టీ కీలక నేతను తనకు పరిచయమే లేదని చెప్పడం మమ్మల్ని తప్పుదోవ పట్టించడమే’ అని ఈడీ చెబుతోంది… కేజ్రీవాల్ తన ఫోన్‌ను కూడా ఇవ్వడం లేదట… సో, ఈ మద్యం కేసు ఇంకా ఎందరికి బిగుసుకుంటుందో..! అన్నట్టు ప్రస్తుతం కేజ్రీవాల్‌ను ఉంచిన జైలు నంబర్ కూడా రెండే..!!
Share this Article