మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సారి మరో క్రైమ్ థ్రిల్లర్ తో మన ముందుకు వచ్చాడు… ఈసారి కామెడీ ఎక్కువగా దట్టించాడు. ఒక సంపన్న వ్యాపారి ఒక్కగానొక్క కొడుకు (బసిల్ జోసెఫ్). మూడు నెలల క్రితమే పెళ్లి. వివాహ జీవితాన్ని బాగా ఆనందించాలనుకునే మనస్తత్వం. తండ్రి హఠాన్మరణంతో అయిష్టంగానే చేపట్టాల్సిన బరువు బాధ్యతలు.
తన భార్యతో ఏకాంతాన్ని కూడా ఎప్పుడూ చూసుకోవాలనుకునే అత్యుత్సాహం. శృంగారాన్ని ఎంచక్కా సెల్ఫీ వీడియో తీసుకుని ల్యాప్ టాపులో పెట్టుకుంటాడు… ఆఫీస్ కి వెళ్ళిన వెంటనే ఆదాయపు పన్ను శాఖ దాడి… ఆ అధికారులు ఈ ల్యాప్ ట్యాప్ తమతో తీసుకెళ్ళిపోవడం. ఆక్కణుoచి మనవాడి కష్టాలు. ఆ ల్యాప్ ట్యాప్ వెనక్కు తెచ్చుకోవాలనుకునే క్రమంలో ఆ అధికారి ఇంటికీ వెళ్ళడం. ఆ ఆధికారి లేకపోయేసరికి లోపలికి జొరబడాలనుకునే యత్నం…
భర్తతో విడాకులకు కోర్టులో పోరాడుతున్న ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగాలనే యత్నంలో ఉండగా, హీరో అనుకోకుండా అదే ఇంట్లోకి దూరాల్సి వచ్చి, పెగ్గు అనుకుని అది తాగేస్తాడు… ఈ లోగా ఆ విల్లాలో దొంగ (హీరో) వచ్చాడని కలకలం. ఈ ఉద్యోగిని బయటకు వచ్చేసరికి హీరో ఆ ఇంట్లో దూరి మద్యం కనపడగానే తాగేయడం.. ఆ తర్వాత భర్తతో ఫోన్ లో తాను చచ్చిపోతానని బెదిరించడం, అప్పటి దాకా దాక్కున్న బసిల్ జోసెఫ్ ప్రాణ భయంతో బయటకు వచ్చి కాపాడమని వేడుకోవడంలో సటిల్ద్ నటనతో ఆకట్టుకున్నాడు…
Ads
ఆ ఆదాయపు పన్ను అధికారి మేనల్లుడు కధలు పట్టుకుని సినీ నిర్మాతలు, హీరోల చుట్టూ తిరగడం, మేనమామ సిఫార్సుతో ఓ హీరోకు కధ వినిపించడానికి వెళ్లి, హీరో, నిర్మాతతొ కలిసి మందు కనపడితే చాలు మనిషి కాని మేనమామతో పడే ఇబ్బందులు. అదే కారులో ల్యాప్ ట్యాప్ లు మారిపోవడం…
ఇలా నవదంపతుల జీవితంతో ముడిపడిన ఒక ల్యాప్ టాప్ చుట్టూ కథ నడిపించిన తీరు అద్భుతం. వివాహేతర సంబంధాలు, పోలీసుల వ్యవహార శైలి, ఇలా అందర్నీ ఒకరోజు మొత్తంలో జరిగే కథతో స్క్రీన్ ప్లేని పరుగులు పెట్టించాడు. ప్రతి పాత్ర ఒక్కో అబద్ధం చెబుతూ కష్టాల్లో ఇరుక్కున్న తీరు.. సహజంగా ఉంటుంది. ఆగస్టులో థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. NUNAKKUZHI.. ఇప్పుడు జీ5లో తెలుగులోకి అనువాదమై సందడి చేస్తోంది. జీతూ జోసెఫ్ అనగానే ప్రతి సినిమాలో ఉండే కోర్టు సీన్ కూడా ఇందులో ఉంటుంది.
మాలీవుడ్ ఓటిటిలో దాదాపు ప్రతి సినిమాకు తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేస్తోంది. ఆ విధంగా మన వర్ధమాన రచయతలకు ఉపాధి లభిస్తోంది. తెలుగులో సంభాషణలు ఎవరు రాశారో గానీ మాటలు భలే పేలాయి. సినీ హీరో మీద సెటైర్లు.. నిక్ నేమ్లు, అవార్డు వచ్చిందనగానే, వాళ్ళు ఇచ్చారా, కొనుక్కున్నావా అని అనడం, లంచాలకు ఆశపడే పోలీసుల ఆరాటం, అనుమానితులకు లైఫ్ లైన్ ఇస్తానని బేరం చేయడం, గూండాలనగానే ఏ మాత్రం బుర్ర లేని వాళ్ళని, ఇలా సందర్భోచిత కామెడితో సాగిపోతుంది. నేపధ్య సంగీతం (బిజీఎం) కూడా బాగుంది. ముగింపులో రెండో భాగం కూడా ఉందని ఆసక్తిగా ఊరించాడు దర్శకుడు…. (హరగోపాలరాజు ఉనికిలి)
Share this Article