సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే చాలామంది నార్తరన్ ఫుడ్ లవర్స్‌కి వెటకారం… అబ్బే, ఏముందండీ… సౌత్ వెజ్ అంటే అవే ఇడ్లీలు, అవే దోశలు, అవే ఊతప్పం, అవే పెసరట్లు, కాదంటే ఉప్మా… అంతేకదా అని తేలికగా తీసిపారేస్తారు… ప్రత్యేకించి ఇడ్లీ మీద బోలెడు జోక్స్ కూడా వేస్తుంటారు… పొద్దున్నే డీప్ ప్రై చేయించిన పావ్ బజ్జీలు, కడక్ సుగర్ జిలేబీలు తినే మొహాలు…
అఫ్‌కోర్స్, ఈమధ్య సౌత్ నగరాల్లో కూడా ఉదయమే మైసూరు బోండా, పూరీలు, వడలు లాగిస్తున్నారు, అది వేరే సంగతి… కానీ ఎక్కువగా సౌత్ ఇండియన్ ఫుడ్డే శ్రేయస్కరం, ఆరోగ్యకరం, రుచికరం, రుచి వైవిధ్యం, ఆత్మారాముడికి అమితానందం అని తేల్చిపడేస్తున్నారు బాగా ఆరోగ్య రహస్యాలు, నిజాలు తెలిసిన పౌష్టిక నిపుణులు…
చాన్నాళ్లు మన చద్దన్నం కూడా అలాగే తీసిపడేశారు… తరువాత అదెంత న్యూట్రిషియసో అర్థమై, ఇప్పుడు స్టార్ హోటళ్లలో కూడా స్పెషల్ డిష్‌గా సర్వ్ చేస్తున్నారు… ప్రముఖ హెల్త్ కోచ్ మరియు ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన శివమ్ దూబే ఏమంటాడంటే..? (క్రికెటర్ శివమ్ దూబే కాదు)…
Ads
‘‘సౌత్ ఇండియన్ బ్రేక్ ఫాస్టుల మంచి విశేషం ఏమిటంటే… అవి బేసిక్‌గా ఫర్మంటెడ్… అంటే పులియబెట్టిన లేదా పులిసిన… దీనివల్ల మనిషి దేహానికి చాలా మేలు చేసే ప్రొబయాటిక్స్ లభిస్తాయి… ఇప్పుడిప్పుడే ప్రపంచం ఫర్మంటెడ్ ఫుడ్ ఉపయోగాల్ని అర్థం చేసుకుంటోంది…
అంతేకాదు, ఈ ఫుడ్ తేలికగా జీర్ణం అవుతుంది… పేగులకు, కడుపుకు క్షేమం… తృణధాన్యాలు, పులిసిన ఫుడ్డే కాదు, ఇడ్లీ-దోశ వంటి ఫుడ్ ఐటమ్స్‌కు ఆధరువుగా తీసుకునే చట్నీలు, సాంబార్‌తో కూడా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి… చట్నీలకు వాడే ఆహార పదార్థాలతో ప్లాంట్ బేస్డ్ ప్రొటీన్లు, ఫైబర్, సూక్ష్మపోషకాలు లభిస్తాయి…
అన్నింటికీ మించి సౌత్ ఇండియన్ ఫుడ్‌లో ఎక్కువగా వాడే ఆవాలు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, ఇంగువ, జిలకర, వాట్ నాట్ అన్నీ ఇమ్యూనిటీకి మంచివే… పైగా టేస్టీ… ఉదాహరణకు పసుపు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ.., ఇంగువ, జిలకర జీర్ణానికి మేలు…
నిజానికి సౌత్ ఇండియన్ ఫుడ్ వండే విధానంలోనే ఆరోగ్యకరమైన విశేషం ఉంది… ఈ ఫుడ్ ఎక్కువగా ఆవిరి మీద ఉడికించేవి లేదా కాల్చేవి… నూనెలో డీప్ ఫ్రై చేసేవి తక్కువ… అందుకని ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలుంటాయి… ఎక్కువ నూనె ఎప్పుడూ ప్రమాదకరమే కదా…
ఉప్మాను తేలికగా తీసిపడేస్తారు గానీ… అందులో వేసే కూరగాయ ముక్కలు, నట్స్, దాన్ని వండే పద్ధతి ఈజీ, సేఫ్, హెల్తీ… లో ఫ్యాట్, లో కేలరీ… ఈరోజుల్లో ఇంతకుమించి ఏం కావాలి..?
సౌత్ ఇండియన్ ఫుడ్‌లో ఎక్కువగా వాడేది చింతపండు… దానివల్ల మలబద్ధకం ఉండదు… సాంబారు, పప్పు పులుసు, పచ్చి పులుసు, పప్పుచారుతో పాటు చాలా వంటల్లో కాస్త చింతపండును పులుపు కోసం వాడుతూ ఉంటారు… పులిహోర సరేసరి… దాంతోపాటు కరివేపాకు, కొబ్బరికి కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి…
మీడియం చెయిన్ ట్రైగ్లిజరైడ్స్… ఇవి కొబ్బరిలో అధికం… ఇవి ఎనర్జీ బూస్టర్లు…’’ అని చెబుతూ పోయాడు సదరు న్యూట్రిషన్ స్పెషలిస్టు… హెలో… వావ్, అంతా వోకే కదా, హెల్తీ కదాని ఎడాపెడా లాగించడం కాదు, పరిమితంగా తీసుకుంటేనే ఇవన్నీ ప్రయోజనాలు అని కూడా చెబుతున్నాడు… నోట్ చేసుకొండి…! భాయ్ సాబ్… కాస్త అల్లం ముక్కలు ఎక్కువ వేసి, నెయ్యి తగిలించిన ఇంకో పెసరట్టు చెప్పు బ్రదర్…!!
Share this Article