Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

న్యాయానికి న్యాయం మన సినిమాల్లోనే దొరుకుతూ ఉంటుంది..!

July 17, 2025 by M S R

.
Subramanyam Dogiparthi....  న్యాయానికి న్యాయం జరగాలనే కధాంశంతో వచ్చిన సినిమాలన్నీ హిట్టయ్యాయి . నిజ జీవితంలో దొరకని , జరగని న్యాయం ఏదో రకంగా సినిమాలలో దొరకటం ప్రేక్షకులకు ఊరట .

చట్టాన్ని అడ్డం పెట్టుకుని పెద్దపెద్దోళ్ళు న్యాయానికి అన్యాయం ఎలా చేస్తారో మనందరికీ క్షుణ్ణంగా తెలుసు . గొప్ప ఉదాహరణలు బోలెడు . పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయిన కేసులన్నీ అంతే .

నేరం నువ్వు చేసావంటే నువ్వు చేసావని పరస్పర ఆరోపణలతో జనాన్ని కన్ఫ్యూజ్ చేయటం తెలియనిది కాదు . షూట్ చేసిన తర్వాత మానసిక సమస్యలు ఉన్న వ్యక్తిగా డాక్టర్ సర్టిఫికెట్లతో న్యాయానికి అన్యాయం చేయటం అందరికీ తెలిసిందే .

Ads

ఇలాంటివన్నీ ఉన్నాయి ఈ న్యాయం మీరే చెప్పాలి సినిమాలో . 1985 ఫిబ్రవరిలోనే వచ్చింది ఈ సినిమా .
నగరంలో విచ్చలవిడిగా జరిగే దోపిడీలు , మానభంగాలు , రౌడీయిజం , వగైరా పరిణామాలతో ఘోరంగా నష్టపోయిన ఒక కాలేజి ప్రొఫెసర్ రాబిన్ హుడ్ గా , కల్కిగా మారి సత్వర న్యాయం చేసేయటమే ఈ సినిమా కధాంశం .

చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా గుర్తుకొస్తుంది ఇప్పుడు చూస్తే . ఆ సినిమాలో లంచగొండితనం మీద యుధ్ధం , ఈ న్యాయం మీరే చెప్పాలి సినిమాలో మానభంగాలు , దోపిడీలు , అరాచకం మీద యుధ్ధం .

1984 లో హిందీలో సూపర్ హిట్టయిన ఆజ్ కి ఆవాజ్ సినిమా ఆధారంగా మన తెలుగు సినిమా తీయబడింది . హిందీలో రాజ్ బబ్బర్ , స్మితాపాటిల్ , నానా పటెకర్ నటించారు . మన తెలుగు సినిమాలో సుమన్ , జయసుధ , రజనీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు .

హీరో సుమన్ అయితే , షీరో జయసుధ . సుమన్ బాధ్యత కల , ఆవేదన కల కాలేజి ప్రొఫెసరుగా , కడుపు రగిలి రాబిన్ హుడ్ గా మారి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే తీవ్రవాదిగా బాగా నటించాడు . ప్రేయసిగా , అభ్యుదయ భావాలు కల లాయరుగా జయసుధ అద్భుతంగా , చాలా అందంగా నటించింది .

ముఖ్యంగా కోర్ట్ సీన్లలో అదరగొట్టేసింది . పేరుకు అతిధి పాత్రే కానీ ప్రేక్షకులు మరచిపోలేని పాత్ర రజనీకాంతుది . తన స్టైల్లో ఇరగతీసేసాడు . ఇతర ప్రధాన పాత్రల్లో ప్రభాకరరెడ్డి , జగ్గయ్య , సంయుక్త , ఈశ్వరరావు , శ్రీలక్ష్మి , అత్తిలి లక్ష్మి , పి జె శర్మ , రాజ్యలక్ష్మి , నూతన్ ప్రసాద్ , కాంతారావు , ప్రభృతులు నటించారు . క్రిమినల్సుగా , విలన్లుగా నటించిన వారి పేర్లు నాకు తెలియవు .

ఇలాంటి క్రైం , ఏక్షన్ సినిమాకు ఆచార్య ఆత్రేయ సంభాషణలను వ్రాయటం విశేషమే . చాలా బాగా వ్రాసారు . ఈ సినిమాలో క్రైం , ఏక్షన్లతో పాటు సెంటిమెంట్ , ఎమోషన్స్ , డ్రామా కూడా ఉన్నాయి . అన్ని రసాలకు న్యాయం చేసారు ఆత్రేయ .

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు శ్రావ్యంగా ఉంటాయి . వేటూరి వారు వ్రాసారు . ముఖ్యంగా సంగీతానివో చెలి సాహిత్యానివో పాట చాలా అందంగా , హాట్ హాటుగా చిత్రీకరించబడింది . ఫేమిలీ పాట పువ్వుల పుట్టిల్లు నవ్వుల నట్టిల్లు కూడా చక్కగా చిత్రీకరించబడింది .

స్వాతంత్ర్య దినోత్సవం నాడు విద్యార్ధులను ఉద్దేశించి సుమన్ పాడే పాట కూడా చాలా బాగా చిత్రీకరించబడింది . గాంధీ , నెహ్రూ , నేతాజీల దగ్గర నుండి ఆనాటి ముఖ్యమంత్రి యన్టీఆర్ , ఆ రోజుల్లోనే హత్య చేయబడిన ఇందిరాగాంధీ అంతిమ యాత్ర వరకు చూపబడుతాయి .

బిర్రయిన స్క్రీన్ ప్లేతో , ఎక్కడా స్లో కాకుండా సినిమాను నడిపించారు దర్శకులు జి రామమోహనరావు . అభినందనీయులు . తెలుగులో కూడా హిట్టయిన ఈ సినిమాను తమిళంలోకి కూడా నాన్ సిగప్పు మనితన్ టైటిలుతో రీమేక్ చేసారు .

తెలుగులో అతిధి పాత్రలో నటించిన రజనీకాంత్ తమిళంలో మెయిన్ హీరోగా నటించారు . అంబిక , భాగ్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు .

ఈ క్రైం , ఏక్షన్ , సెంటిమెంట్ , ఎమోషన్, డ్రామాల హిట్ సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడకపోతే తప్పక చూడండి . ముఖ్యంగా జయసుధ అభిమానులు అస్సలు మిస్ కావద్దు . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమ్మతనం అంటే అన్నీ సహించడం కాదు… కొన్ని వదిలించుకోవడం కూడా..!!
  • ఆ ఉగ్రవాది కసబ్‌ను కోర్టులో గుర్తించిన ఓ చిన్న పాప మీకు గుర్తుందా..?
  • అవునూ.., హీరో మెటీరియల్ ఏంటి తల్లీ..? ఈ చెత్తా ప్రశ్నలే జర్నలిజమా..?!
  • రిషబ్‌ శెట్టి ‘కాంతార’ మ్యాన్షన్… కళాత్మకత, సంస్కృతి, భద్రత మేళవింపు…
  • చావు దాకా తోడుగా, తోడ్పాటుగా వెన్నంటి… A True Love Story…
  • “యుద్ధం తానే, శాంతి తానే — జరగని యుద్ధాలనూ ఆపాడట..!!
  • మరేటి సేస్తాం అలగైపోయినాది… సొంత ‘నోబుల్’ అవార్డులే ఇక దిక్కు…
  • బ్లేమ్ గేమ్… బీసీ రిజర్వేషన్లపై పార్టీల పరస్పర నిందాపర్వం…
  • కేసీయార్ మార్క్ సింపతీ పాలిటిక్స్… సీటుసీటుకూ మారుతుంటయ్…
  • రెండు బొమ్మలూ ఒక్కచోట కుట్టేసి… మరోసారి దండుకో నా రాజామౌళీ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions