ఈమె గురించిన సమాచారం నెట్‌లో పెద్దగా దొరకదు… ఎవరు..? ఓ సాథియా సినిమా దర్శకురాలు దివ్య భావన… ఈమె ప్రముఖ కథారచయిత విజయేంద్రప్రసాద్ దగ్గర కొన్నాళ్లు పనిచేసింది… అదొక్కటే విశేషం కనిపిస్తుంది ఈమె గురించి..! నిజానికి ఇండస్ట్రీలో మహిళలు 24 క్రాఫ్ట్స్‌లో కనిపించేదే అత్యంత అరుదు… అంతా మగమయమే… ఒకవేళ ధైర్యంగా మహిళలు ఈ ఫీల్డులోకి వస్తే వివక్ష, అవమానాలు గట్రా కామన్… అసలు ఆడదాన్ని మనిషిగానే చూడని దుష్ట ఇండస్ట్రీ ఇది…
అలాంటిది ఓడకు కెప్టెన్ వంటి బాధ్యత దర్శకుడిది… చిన్నాచితకా అవకాశాలే ఇవ్వని ఇండస్ట్రీలో ఏకంగా దర్శకుడు లేదా దర్శకురాలు కావడం అపురూపమే… నిన్న రిలీజైన సినిమాల్లో ఓ సాథియా సినిమా కూడా ఉంది… ఏవో వేరే సినిమాలకు ప్రయారిటీ ఇచ్చిన సినిమా జర్నలిజం ఈ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు… బడ్జెట్ పరిమితుల కారణంగా ప్రమోషన్ ఉధృతంగా చేయకపోవడం వల్లనేమో..!
పేరున్న హీరో, హీరోయిన్లు, దర్శకులు అయితే మీడియా ఓ లుక్కేస్తుంది… కానీ దర్శకురాలు కొత్త… హీరో పేరు పెద్దగా వినలేదు… హీరోయిన్ కూడా అంతే… హీరో పేరు ఆర్యన్ గౌర… తెలుగువాడే… గతంలో తన పేరు జీ-జాంబీ, వధుకట్నం సినిమాలకు వినిపించింది… తను స్వతహాగా యాక్టర్, డైరెక్టర్, స్క్రిప్టు రైటర్… ఈ సినిమాలో కూడా కొత్తవాడిలా గాకుండా సీనియర్ నటుడిలా ఈజ్‌తో నటించాడు… ఎమోషనల్ సీన్లలోనూ తడబడలేదు… సరే, డాన్సులు గట్రా రాకపోయినా మాస్టర్లు నేర్పిస్తారు కదా…
Ads
ఇక హీరోయిన్ పేరు మిస్తీ చక్రవర్తి… అసలు పేరు ఇంద్రాణి చక్రవర్తి… బెంగాలీ… కొత్త మొహం ఏమీ కాదు… 2014 నుంచీ ఇండస్ట్రీలో ఉంది… మంచి చాన్సుల కోసం తిప్పలు పడుతూనే ఉంది… చిన్నదాన నీకోసం, కొలంబస్, బాబు బాగా బిజీ, శరభ, బుర్రకథ తదితర సినిమాల్లో నటించింది… వీటిల్లో చిన్నదాన నీకోసం తప్ప మిగతావి ఎప్పుడు వచ్చిపోయాయో కూడా తెలియదు… కన్నడ, హిందీ, తమిళ భాషల్లోనూ నటిస్తుంది… నిజానికి మంచి మెరిట్ ఉన్న నటే… ఓ సాథియాలో కూడా సటిల్డ్ పర్‌ఫామెన్స్ ఇచ్చింది… కాకపోతే సరైన అవకాశాలు రావడం లేదు, అంతే…
సినిమా విషయానికి వస్తే… బడ్జెట్ పరిమితుల్లో తీయబడిన ఓ చిన్న సినిమా… కానీ మరీ అంత తేలికగా తీసిపారేయదగిన సినిమా ఏమీ కాదు… మన పెద్ద సినిమాల్లో ఉన్నట్టు లాజిక్‌లెస్ సీన్లు పెద్దగా ఏమీ లేవు… కాకపోతే స్లో… ఫస్టాఫ్ అంతా హీరో ఆవారా టైప్… అఫ్‌కోర్స్ తెలుగు హీరో అంటేనే ఆవారా టైపు కదా, అది మైనస్ పాయింటేమీ కాదు, ఆనవాయితీ… ఓ ప్రేమకథ… మెల్లిగా నడిచీ నడిచీ క్లైమాక్స్ స్టేజ్‌కు కథ మీద ఆసక్తి పెరిగేసరికి సినిమాకు శుభం కార్డు పడుతుంది…
ఏదైనా భిన్నమైన సబ్జెక్టు ఎన్నుకుంటే, కాస్త పెద్ద బ్యానర్ దొరికితే ఈ దర్శకురాలు దివ్య భావన ఇంకాస్త ఎలివేటయ్యే సూచనలైతే ఉన్నాయి… బెస్టాఫ్ లక్… ఐనా ఇప్పుడు ప్రేమకథల ట్రెండ్ కాదమ్మా… పైగా వాటిని కొత్తగా డీల్ చేయడం కష్టం…
Share this Article