ఈనాడు సైటులో ఓ శీర్షిక కనిపించింది… ‘రిపోర్టర్‌పై రెజీనా ఫైర్’… స్థాయి తక్కువ హెడ్డింగ్… తప్పుడు థంబ్ నెయిల్స్‌తో చెలరేగిపోయే యూట్యూబ్ చానెళ్లకూ ఈనాడుకూ తేడా ఏమున్నట్టు..? నిజానికి రెజీనా మొహంలో కోపం లేదు, ఆమె అగ్గిమండింది కూడా ఏమీలేదు… చాలా కూల్‌గా, వివరంగా సమాధానం చెప్పింది… ఈ సందర్భంలో మరోసారి తెలుగు సినిమా జర్నలిస్టులు తమ ప్రొఫెషనల్ ఎబిలిటీ, స్టాండర్డ్స్ ఎంత లోెతుల్లో ఉన్నాయో వాళ్లే ప్రదర్శించుకున్నట్టు అయ్యింది తప్ప రెజీనా హుందాగా వ్యవహరించింది…
ఆమధ్య డీజేటిల్లు అనే సినిమా ప్రెస్‌మీట్‌లో ఓ విలేఖరి… ‘‘సినిమాలో హీరోయిన్‌ను నీ దేహం మీద పుట్టుమచ్చలు ఎన్ని అనడిగారు కదా… చూసి తెలుసుకున్నారా’’ అన్నట్టుగా హీరోకు ఓ ప్రశ్న వేశాడు… వెగటు ప్రశ్న… ఆ కంపుకు హీరోయిన్, హీరో కూడా ఇబ్బందిపడ్డారు… అలాగే మరో సందర్భంలో విలేఖరి పేరుతో వచ్చిన ఒకాయన రాజమౌళి పుట్టిన కాలంలో పుట్టినందుకు మా జన్మలు సార్థకమయ్యాయి అని భజన స్టార్ట్ చేశాడు… తోటి జర్నలిస్టులు నోళ్లు, ముక్కులు, అన్నీ మూసుకున్నారు సిగ్గుతో…
సేమ్, శాకిని ఢాకిని సినిమా ప్రెస్‌మీట్‌లో ఓ రిపోర్టర్ ప్రశ్న కూడా అదే రేంజులో ఉంది… తెలుగు సినిమా పాత్రికేయం గర్వించుగాక… తను వేసిన ప్రశ్న ఏమిటో తెలుసా..? ‘‘ఈ సినిమాలో మీరు ఓసీడీ ఉన్న లేడీ కదా, మీ నిజజీవితంలో కూడా మీరు ఓసీడీయేనా..?’’ రెజీనా ముందు ఆశ్చర్యపోయింది ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతారా అని… అదే అడిగింది, మీరు అందరినీ ఇలాగే అడుగుతుంటారా అని… ‘‘నేను ఒక పాత్ర చేశాను, ఆ పాత్రకు ఓసీడీ ఉంటుంది…’’ అని చెప్పింది…
Ads
‘‘ఓసీడీ ఫుల్‌ఫామ్‌లో డిజార్డర్ అనే పదం ఉంటుంది… ఆ పాత్రకు ఆ సైకలాజికల్ డిజార్డర్ ఉంటే, నాకు కూడా ఉన్నదా అని అడుగుతారు ఎందుకు..?’’ అని కూల్‌గా చురక పెట్టింది… నిజంగానే ఓ తలతిక్క ప్రశ్న… తన ప్రశ్నలో తప్పేమిటో సదరు రిపోర్టర్‌కు అర్థమైనట్టుంది, తనే సిగ్గుపడుతూ ‘నా ప్రశ్న ఉద్దేశం అది కాదు, మీరు హైజిన్‌కు ఇంపార్టెన్స్ ఇస్తారా అనేదే’ అని ఏదో కవర్ చేశాడు… దానికీ రెజీనా వివరంగా, బాగా చెప్పింది ఆన్సర్… ఒకసారి వీడియో చూస్తే ఆమె ఎంత కుదురుగా జవాబు ఇచ్చిందో అర్థమవుతుంది…
అమ్మాయిలు తమ ప్రైవేట్ పార్ట్స్ శుభ్రత గురించి కేర్ తీసుకోవాలి, ఆ ఇంపార్టెన్స్ కూడా తెలుసుకోవాలి… మేమేదో మహిళల మీద మంచి కాన్సెప్టుతో సినిమా తీస్తే ఇలాంటి ప్రశ్నలేమిటి అనడిగింది… ప్రెస్‌మీట్ సాగుతున్నంతసేపూ విలేఖర్ల ఫోన్లు మోగుతూనే ఉన్నయ్… సో, వీసమెత్తు ప్రొఫెషనలిజం చూపించడం చేతకాక పరువు పోగొట్టుకుంటున్నదే విలేఖర్లు… పైగా రెజీనా సీరియస్, ఫైర్, రెచ్చిపోయింది, రెజీనాకు తిక్కరేగింది, అనే పిచ్చి శీర్షికలతో వార్తలు… ఆమె అనని మాటల్ని కూడా థంబ్ నెయిల్స్ పెట్టి మరీ కసి చూపించారు… ఎవరి ఇష్టారాజ్యం వాళ్లది… ‘ఇది లెస్బియన్ సినిమా అనుకోవచ్చా అని ఎవరో రిపోర్టర్ అడుగుతున్నట్టుగా ఓ థంబ్ నెయిల్ కనిపించింది… దారుణం… ఓ చానెల్ పెట్టిన శీర్షికలో మరీ సాఖిని, డాఖిని అని ఉంది… శాకిని ఢాకిని అని కూడా రాయలేని భాషాపాటవం మరి… ఇదే కదా నిజానికి ఓసీడీకన్నా డేంజరస్ డిజార్డర్…!!
Share this Article