Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘హలో కేసీయార్‌జీ… నేను అమిత్‌ షాను మాట్లాడుతున్నా…’’

November 25, 2021 by M S R

‘‘‘నో, నో, కేసీయార్‌జీ, అపార్థం చేసుకోకండి, మీరంటే మాకు గౌరవం లేకపోవడమేంటి..? భయం కూడా ఉంది… నేనే మీకు స్వయంగా కాల్ చేస్తున్నాను కదా… మేం ప్రతి ముఖ్యమంత్రితోనూ ఈమధ్య బాగానే ఉంటున్నాం, అసలే మా పరిస్థితి బాగాలేదు.., మీకు తెలుసు కదా, అందరూ రివర్స్ అవుతున్నారు… నిజానికి అగ్రి చట్టాల్ని రద్దు చేయను అన్నాడు మా మోడీజీ, నేనే సర్దిచెప్పాను, బాగుండదు, కేసీయార్‌జీ ఆల్‌రెడీ అల్టిమేటమ్ ఇచ్చాడు, ఢిల్లీకి బయల్దేరాడు, బొచ్చెడు మంది ప్రజాప్రతినిధుల్ని వెంటేసుకుని దండు బయల్దేరింది… అగ్గిపెడతానని ముందే చెప్పాడు, గాయిగత్తర అంటున్నాడనీ గుర్తుచేశాను, అప్పుడు గానీ ఆ చట్టాల్ని రద్దు చేయలేదు ఆయన… మళ్లీ మీరు ఇక్కడికి వచ్చి ఈ గ్యాస్ ధరలేంది..? ఈ పెట్రోల్ ధరలేంది…? అని కొత్త మంట పెడతారని కూడా చెప్పాను… అందుకే గ్యాస్ బుడ్డి ధర 300 వరకూ తగ్గిద్దాం అన్నాడు వెంటనే… పెట్రో ధరలపైనా ఏదో ఆలోచిస్తున్నాడు… ఇంకో 4 నెలలు free రేషన్ ఇస్తాం… మేం మారిపోయాము భాయ్ సాబ్… ఇంకా మారతాం…

paddy

అరుణాచల్ ప్రదేశ్‌లో చైనావాడు దంచుతున్నాడని మీరు చెప్పారు కదా, ఇదే మాట అంటే మా మోడీజీ అస్సలు ఒప్పుకోడు… కేసీయార్ మెడ కోసుకుంటాడు తప్ప, అబద్ధం ఆడడు, ఆ చైనావాడు నిజంగానే ఏదో చేస్తూ ఉండవచ్చు బహుశా అని డౌటనుమానం చెప్పాను… అప్పటికప్పుడు కేబినెట్ సెక్రెటరీని, అజిత్ ధోవల్‌ను, నారవాణెలను పిలిచాడు, వాళ్లు కూడా అబ్బే, అదేమీ లేదు అని బొంకుతున్నారు… ఇక తప్పనిసరై నేనే బీఎస్ఎఫ్, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ బాసులను పిలిచి సమీక్షించే పనిలో పడ్డాను, అందుకే మీకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేకపోయాను, అది చెబుతామనే కాల్ చేస్తున్నాను, రేపు నేనే మీరు క్యాంప్ చేసిన చోటకు స్వయంగా వద్దామనుకున్నాను, ఈలోపు మీరే వెళ్లిపోయారు… సరిహద్దుల్లో అగ్ని-5 పెట్టేస్తున్నాం, రాఫెల్ ఫైటర్లను మొహరిస్తున్నాం, బ్రహ్మాస్ క్షిపణులు రెడీ చేశాం, అర్జెంటుగా ఎస్-400 తరలిస్తున్నాం… మనమూ చైనావాడిని ఉల్టా దంచేద్దాం, సరేనా..?

Ads

kcr modi

(నిన్న సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఓ సరదా మీమ్)

చెప్పాను మోడీజీకి, మీరు పిలిచి మాట్లాడండి, బాగుండదు అని కూడా చెప్పాను, కానీ మీకు మొహాన్ని చూపించడానికి ఏదో ఇబ్బంది ఫీలవుతున్నట్టున్నాడు… పోతేపోనీలే, యాసంగి వరి కూడా కొనేద్దాం అన్నాను, బాయిల్డ్ రైస్ అయినా సరే కొందాం, మీరు పీయూష్ గోయల్‌కు చెప్పండి, కేసీయార్ హెచ్చరించాక కూడా పట్టించుకోకపోతే, ఆయనకు కోపమొస్తే మనకే ఇబ్బంది అని కూడా గుర్తుచేశాను… మీరు కోపంతో పీయూష్‌తో భేటీకి, నరేంద్ర తోమర్ దగ్గరికి కూడా వెళ్లలేదట కదా, నాతో చెప్పారు… అంతకుముందు మీరే బాయిల్డ్ రైస్ కొనకపోయినా సరే అన్నారట కదా… మళ్లీ ఇదేంటి లొల్లి అంటున్నారు వాళ్ళు..! మీరు ఢిల్లీలో ఎటు పోతున్నారో ఫుల్లు నిఘా పెట్టించాడు మోడీజీ నాకు తెలియకుండా… ఏదో 3 లక్షల పరిహారం అన్నారట, రైతు నేతలకు సంఘీభావం అన్నారట, కానీ తికాయత్‌ను గానీ, రైతు ఐక్యసంఘాల నేతల్ని కూడా కలవలేదట, 700 మంది అమర రైతుల జాబితా కూడా తీసుకోలేదట కదా, మరి ఇదేమిటని మోడీజీ తెగ ఆశ్చర్యపోతున్నాడు… నవ్వుతున్నాడు… కేసీయార్ మనకు అంతుపట్టడు భాయ్ అని చెప్పాను… మీరు స్వర్ణదేవాలయ సందర్శనకు, అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ కూడా వెళ్తారేమో అనుకున్నాం కూడా…

paddy

అగ్గిపెడతానని వచ్చాడు, అలా తనే చల్లబడి వెళ్లిపోయాడేమిటి అంటున్నాడు మా బాస్… సింహం రెండు అడుగులు వెనక్కి వేయడం అంటే తదుపరి భీకర దాడికి చిహ్నం, మనమే జాగ్రత్తగా ఉండాలన్నాను… ఈసారి మరింత బలగంతో ముట్టడికి వస్తాడన్నాను… సరే, ఆయనతో మనకు వైరం ఏమిటి, మన రహస్య మిత్రుడే కదా, నువ్వే మాట్లాడు, ఆయన చెప్పినవి చేస్తూనే ఉన్నాం కదా అని ఎట్టకేలకు దారికి వచ్చాడు… అందుకే ఈ కాల్ చేస్తున్నాను… కేసీయార్‌జీ, రాజకీయాలు మీకు తెలియనివి కావు.., మమతకు అపాయింట్‌మెంట్ ముందుగానే ఫిక్సయింది… మీరేమో నేరుగా ఢిల్లీ వచ్చేశారు, ఆయనేమో ఇప్పుడే కేబినెట్ భేటీ పెట్టాడు, అగ్రిచట్టాల రద్దు బిల్లు దగ్గరుండి ప్రిపేర్ చేయిస్తున్నాడు, అందుకని మిమ్మల్ని కలవలేకపోయాను అని మీకు చెప్పమన్నాడు…

paddy

దయచేసి, వెంటనే హైదరాబాద్ పోగానే ప్రెస్‌మీట్ పెట్టేసి, చెడామడా తిట్టకండి… గతంలో ఎప్పుడు ఢిల్లీకి వచ్చివెళ్లినా రోజుల తరబడీ సైలెంటుగా ఉండేవాళ్లు కదా, ఇప్పుడూ అలాగే ఉండిపొండి… మిగతావి ముఖాముఖి మాట్లాడుకుందాం, వీలు చూసుకుని నేనే త్వరలో హైదరాబాద్ వస్తాను… అబ్బా, ఆ ఈటల సంగతి కాసేపు మరిచిపొండి భాయ్ సాబ్… కళ్లాల్లో, రోడ్ల మీద, మార్కెట్లలో, కొనుగోలు కేంద్రాల వద్ద వరి కుప్పలు మొలకలు వస్తున్నాయట, రైతులు ఏడుస్తున్నారట, వానాకాలం పంట ఎలాగూ కొంటామని చెప్పాము కదా, మరెందుకు కొనడం లేదు..? రైతు ఏడిస్తే మీకూ, మాకూ మంచిది కాదు, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు… కాస్త ఆ సంగతి చూడండి ముందు… వోకేనా… ఉంటాను…’’’

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions