వాణిశ్రీ ముగ్గుబుట్ట విగ్గెట్టుకునీ, ముదురు గులాబీరంగు లిప్ స్టిక్ మందంగా వేసేసుకునీ, కనుబొమ్మల మధ్య ఎర్రని కుంకంబొట్టూ, కాస్త పైన లేత గులాబీరంగు సింగార్ తిలకం, ఆపైన పాపిడి మొదట్లో అంగారుకుంకుమా పెట్టేసుకునీ, కళ్లకూ కనుబొమ్మలకూ, కనురెప్పలకూ అయిటెక్స్ కాటుక రాసేసుకునీ మిగిలిన మొహమ్మీద దట్టంగా రంగూ, పౌడరూ పులిమేసుకునీ దీనంగా గుమ్మంలోకి చూస్తూ శిల్పంలా ఓచెయ్యి పైకి గుమ్మం కేసి పెట్టి, ఇంకో చెయ్యి నడుమ్మీద పెట్టి, ఆ నడుమును ఆంటీక్లాక్ వైజ్ గా నూటాముప్ఫైరెండు డిగ్రీల్లో వంచి రామకృష్ణ కోసం ఎదురుచూస్తూ నుంచునుంది.
ఆమె ఎర్రరంగు, ఆకుపచ్చ బోర్డరూ నైలెక్సు చీర కట్టింది. మ్యాచింగు జాకెట్టు తొడిగింది. ఆ జాకెట్టు ఎదమీద పొదుపుగానూ, చేతులమీద పొడవుగానూ పరుచుకునుంది.
ఆమె అత్తామామలైన సావిత్రీ, కాంతారావు తీర్థయాత్రల కోసం కొడైకెనాల్ వెళ్లారు.
భర్త రామకృష్ణ ఆఫీసు నుండి ఇంటికి వస్తున్నట్టు అతని పసుప్పచ్చ బుల్లెట్టు డుగ్గుడుగ్గు శబ్దం ఆమె గుండెల్లో రాజన్-నాగేంద్ర వాయించిన వాయులీనంలా వినిపించింది.
రామకృష్ణ విగ్గుకు కూడా దాదాపు వాణిశ్రీ విగ్గుకు వాడినంత కేశసంపద వాడారు. ఆ విగ్గుకున్న నొక్కులు శ్రీవారి మోకాళ్ల పర్వతం దగ్గరున్న మెట్లలా ఎత్తెత్తుగా ఉన్నాయి. ఆ విగ్గు మోయడం వల్లో, ఇంకెందుచేతనో, వగలవాణిశ్రీ ముందటే ఉన్నా రామకృష్ణ దిగులుగానే ఉన్నాడు.
రామకృష్ణ తన పసుప్పచ్చ బుల్లెట్టు ఆపి సెంటర్ స్టాండ్ వేసాడు. తను ముదురుచందనం రంగు కోటు, ప్యాంటూ, చొక్కా, టై కట్టాడు. అతని బనియనూ, డ్రాయరూ కూడా అదే రంగు కావచ్చు కానీ, మనక్కనిపించడం లేదు.
రామకృష్ణ తన సూట్కేసూ, ఇంకో కవరూ తీసుకుని, వాణిశ్రీని పట్టించుకోకుండా దాటుకుని ఇంట్లోకి వచ్చి, లోపలి గదిలోకి వెళ్లిపోయాడు.
వాణిశ్రీ పెదాలు రెండో నెంబరు మీద తిరిగే సీలింగు ఫ్యానులా వణుకుతున్న ఫీలింగునిచ్చాయి. ఆమె కళ్లు మిషన్ భగీరధ ట్యాపులా కన్నీళ్లు కార్చ సాగాయి.
రామకృష్ణ బూట్లూ, ప్యాంటూ, టై విప్పి, కింద నూంగబ్బాకం తంగమాళిగైలో కొన్న సన్నంచు తెల్లలుంగీ కట్టి హాల్లోకి వచ్చాడు. అంతపెద్ద కొంపలో డైనింగ్ టేబుల్ లేకపోవడం వల్ల కింద కూర్చుని పొట్ట ఉండటం మూలాన తన ముందో పీట వేసుకున్నాడు.
వాణిశ్రీ పరుగుపరుగున లోపలికి వెళ్లి ఓ రాగిగ్లాసులో నీళ్లూ, ఓ ఖాళీ వెండిప్లేటూ పట్టుకొచ్చి, ఆ పీటమీద పెట్టింది.
రామకృష్ణ అసలే డిప్రెషన్ లో ఉన్నాడు. తనకూ ఎన్టీయారూ, ఏయెన్నారూ, శోభన్ బాబంత గ్లామరున్నా, ఎందుకు హిట్లు పడ్ఢంలేదో, తను వాళ్లంత స్టారెందుకవడంలేదో తనకస్సలు అర్ధం కావడం లేదు.
వాణిశ్రీ కన్ఫ్యూజన్ లో ఉంది. “ఎన్టీయారూ, ఏయెన్నారూ, శోభన్ బాబూ తనని బతిమాలుతూ పాటలు పాడతారు. ఈ గుంటకళ్లోడి ఆటిట్యూడేంట్రా దైవమా..!” అని లోపల్లోపల మధనపడుతోంది.
“అమ్మానాన్నల్ని ఎక్కడ పంపించావ్…?” అన్నాడు రామకృష్ణ.
“నేను పంపడవేంటండీ…? వాళ్లే తీర్ధయాత్రలకని కొడైకెనాల్ వెళ్లారు..!” అంటూ సంజాయిషీ గా చెప్పింది వాణిశ్రీ.
“ఇప్పుడు తీర్ధయాత్రలెందుకట…? ఏం బాగుండాలని…?” తల నేలకేసి అడిగాడు రామకృష్ణ.
“మన ఏకాంతం కోసమేమో…!” అమాయకంగా మొహం పెట్టి చిలిపిగొంతుతో చెప్పింది వాణిశ్రీ.
“అమ్మ ఏమైనా వండిందా…?”
“లేదండీ..! నేనే దోసెలూ, ఉప్మా చేసాను..!”
“నాకఖ్కర్లేదు. నేను శరవణభవన్ వెళ్లి ఊతప్పం తినొస్తా…!” అంటూ ఛర్రుమని లేచాడు రామకృష్ణ.
వాణిశ్రీ అశోకవనంలో సీతమ్మవారి కన్నా, కౌరవ పేరోలగంలో ద్రౌపది కన్నా దారుణంగా భోరుమంటూ ఏడుపు మొదలెట్టింది.
రామకృష్ణ కంగారడిపోయాడు. “ఏవైందేవైందీ…?” అన్నాడు.
“నేను ఇంతకాలం అత్తగారొండిపెడుతుంటే కూర్చుని దొబ్బితిన్నాను. ఇవాళ ఉప్మాలో రవ్వ బదులు ఉప్పూ; ఉప్పు బదులు రవ్వా పోసేసాను. దోసెకోసం మినప్పప్పూ, కంట్రోలు బియ్యం కాకుండా, ఎర్రపప్పూ, బాస్మతీబియ్యం నానబోసాను. మీకు ముందు పెట్టి, మీకేం కాకపోతే నేనూ తిందావనుకున్నా…! మీరిప్పుడు ఇంట్లో తినకపోతే యెలా…?
ఓ పని చేయండి. నాక్కూడా ఆ శరవణభవన్ నుండే ఓ సాంబారిడ్లీ, ఓ నెయ్యికారం దోసే పార్సిల్ తీసుకురండి…!” అంటూ వాణిశ్రీ ముక్కు చీదింది.
రామకృష్ణ మొహం దోసెపెనంలా మాడిపోయింది. స్కూటరు స్టాండు తీస్తూ, “రాత్రికి రెండు కర్డ్ రైస్ కూడా తెస్తా..!” అని గోడకు చెప్పినట్టు చెప్పి వెళ్లిపోయాడు.
రాత్రి వంటపన్లేదన్న ఆనందంతో వాణిశ్రీ తలస్నానం చేసి పూజరూంలో దేవుడిపటాలముందు కూర్చుని “పూజలుసేయా పూలు తెచ్చాను…!” అని పాడేసింది.
ఆ తర్వాత…
వాణిశ్రీ ముగ్గుబుట్ట విగ్గెట్టుకునీ, ముదురు గులాబీరంగు లిప్ స్టిక్ మందంగా వేసేసుకునీ, కనుబొమ్మల మధ్య ఎర్రని కుంకంబొట్టూ, కాస్త పైన లేత ఆకుపచ్చరంగు సింగార్ తిలకం, ఆపైన పాపిడి మొదట్లో అంగారుకుంకుమా పెట్టేసుకునీ, కళ్లకూ కనుబొమ్మలకూ, కనురెప్పలకూ అయిటెక్స్ కాటుక రాసేసుకునీ మిగిలిన మొహమ్మీద దట్టంగా రంగూ, పౌడరూ పులిమేసుకునీ దీనంగా గుమ్మంలోకి చూస్తూ శిల్పంలా ఓచెయ్యి పైకి గుమ్మం కేసి పెట్టి, ఇంకో చెయ్యి నడుమ్మీద పెట్టి, ఆ నడుమును ఆంటీక్లాక్ వైజ్ గా నూటాముప్ఫైరెండు డిగ్రీల్లో వంచి రామకృష్ణ తేబోయే శరవణభవన్ పార్సిల్ కోసం ఎదురుచూస్తూ నుంచుంది…….. రచయిత :: Gottimukkala Kamalakar
Share this Article
Ads