.
( Ashok Pothraj ) …. మలయాళీ సినిమాల తీరు వేరు… ఆ దర్శకులు ఎప్పుడూ తీసుకునే రొటీన్ రొట్ట కథల క్రైం థ్రిల్లర్లను కొత్తగా ప్రజెంట్ చేయడానికి చాలా ప్రయాసపడుతున్నారు… తక్కువ బడ్జెట్లో సినిమా తీయడం ఆరోగ్య లక్షణం. మన టాప్ హీరో హీరోయిన్లు తీసుకునే ఒక్క సినిమా రెమ్యూనరేషన్ తో వీళ్లు డజన్ సినిమాలు తీసి మార్కెట్ లోకి వదులుతున్నారు.
మలయాళ “మార్కో” అనే కళా ఖండం వచ్చిన వెంటనే సూక్ష్మ దర్శిని, ఆ తర్వాత “పని” అనే జోజ్ జార్జ్ చిత్రం, అంతలోనే “రేఖాచిత్రం” ఆసిఫ్ అలీ, “పోన్ మ్యాన్” బేసిల్ జోసెఫ్ సినిమాలను వెంట వెంటనే ఓటీటీలోకి వదులుతున్నారు. అవీ చూసిన వారికి ఆ సినిమాలు ఇంకా మెదట్లో తిరుగుతూనే ఉన్నాయి.
Ads
ఇప్పుడు ఇంకొక మాస్టర్ పీస్. సేం జానర్లోనే. క్రైం థ్రిల్లర్ పోలీస్ ఇన్వెస్టిగేటివ్ “ఆఫీసర్ ఆన్ డ్యూటీ” మరో సూపర్బ్ థ్రిల్లర్ మూవీ. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో థ్రిల్లర్ సినిమాలను ఇంత సులువుగా అంత బాగా ఎలా తీయగలరో అని ఆశ్చర్యం వ్యక్తం చేసేలా తీసారు. ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం మామూలుగానే ఈ మూవీ చూశాను.
ఓటిటీలో రిలీజైన వీళ్ల సినిమాలు చిన్న సినిమాల మార్కెట్ ని డామినేట్ చేస్తున్నాయి. అందుకే ఓటిటీలోకి రాక ముందే హెచ్ డి క్లారిటీలో వీళ్ల సినిమాలను పైరసీ చేస్తున్నారంటే ఇతర భాషల చిత్రాలకు వీళ్లు ఎంత గట్టి పోటీ ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
“ఆఫీసర్ ఆన్ డ్యూటీ” మూవీ గురించి ఓ నాలుగు మాటలు. ఏదో సాధారణ పోలీస్ క్రైం స్టోరీనే అనుకున్నాను. చూసినా కొద్ది సీన్ సీన్లో ఉత్కంఠత లేపుతూ ఊహించని కథనంలోకి మనల్ని లాక్కెళ్తూ ఉంటుంది. ఊహించని ట్విస్ట్, దెబ్బ మీద దెబ్బా అంటూ… చూడబ్బా అంటుంది.
ఈ సినిమా ఫిబ్రవరి నెలలో థియేటర్లలో రిలీజైంది. కుంచకో బొబన్ హీరోగా, తనకు భార్యగా ప్రియమణి నటించింది. బేసిగ్గా పోలీస్ అంటేనే పొగరు ఎక్కువగా ఉండే ఆఫీసర్. ఆ పాత్రలో హీరో అలాగే కనిపిస్తాడు. ఆ ప్రవర్తన కారణంగా అతను డీఎస్పీ నుంచి సీఐకి డీమోట్ అవుతాడు. ఒకరోజు ఓ వ్యక్తి నకిలీ గోల్డ్ ఛైన్ అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడని అతనికి ఫిర్యాదు అందుతుంది.
ఆ తర్వాత జరిగే దర్యాప్తులో దానికి ఎన్నో నేరాలు, ఘోరాలు లింకైనట్లు హీరో గుర్తిస్తాడు. తన వ్యక్తిగత జీవితంలో గతంలో తన కుటుంబానికి జరిగిన విషాదానికి కారణం కూడా అదే అని తెలుస్తుంది. పై ఆఫీసర్ నుంచి ఈ కేసును వదిలేయాలన్న ఒత్తిడి వచ్చినా కూడా అతడు అలాగే మొండిగా ముందుకు వెళ్తాడు. మధ్యలో ఈ కథలో ఊహించని క్యారెక్టర్స్ ఆవిష్కృతమౌతాయి. అవే కథకు హుక్ పాయింట్స్.
ఇక చివరికి ఏమౌతుంది అనేది ఆడియన్స్ ఊహించని సస్పెన్స్ తో ఇంప్రెషన్ రాబట్టింది. అది సినిమాలో చూడండి. చక్కగా స్క్రీన్ ప్లే కుదిరింది. కాబట్టే సినిమా బాగుంది. ఫస్టాఫ్ కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది.
నేషనల్ అవార్డు గెలిచిన షాహి కబీర్ ఈ సినిమాకు కథ అందించాడు. జీతు ఆష్రాఫ్ దర్శకుడు. ఇంటర్వెల్ తర్వాత వెస్ట్రన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అన్నీ భాషల్లో అందుబాటులో ఉంది చూసేయండి…
Share this Article