Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇలా పోలీస్ తనిఖీల్లో దొరికే డబ్బంతా వోటర్లకు పంచేదేనా..?

October 11, 2023 by M S R

2009 – 10 కాలం… అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి . తెలుగుదేశం శాసనసభాపక్షం కార్యాలయం వద్ద నిలబడి కడప జిల్లాకు చెందిన శాసనసభ్యులు లింగారెడ్డి నేనూ ఏదో మాట్లాడుకుంటుంటే విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ శాసన సభ్యులు (రాజు అని గుర్తు) ఆవేశంగా సభ నుంచి వస్తూ, ఇలాంటి వారున్న సభలో నేను శాసనసభ్యునిగా ఉన్నందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాను అని ఆవేశంగా ప్రకటించారు .

ఏమైంది అని పలకరిస్తే జగన్‌ది వేల కోట్ల అవినీతి , అలాంటి అవినీతిపరుని గురించి సభలో చర్చ – విలువలు ఎక్కడికి పోతున్నాయి .. ఇలాంటి వారున్న సభలో నేను ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను – సంక్షిప్తంగా ఇదీ అతని ఆవేదన . అతనికి నన్ను నేను పరిచయం చేసుకొని , మీ జేబులో ఉన్న ఒక్క రూపాయి గురించి కూడా అడిగే అధికారం నాకు లేదు . కానీ మనం విలువల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అడుగుతున్నాను . మీకు ఇష్టం అయితే చెప్పండి ఎన్నికల్లో మీరు ఎంత ఖర్చు చేశారు అని అడిగాను .

అతను కాసేపు అలానే ఉండిపోయి , ఐతే అవినీతి గురించి ప్రశ్నించే హక్కు నాకు లేదా అని అడిగారు . అది కాదు ఎన్నికల్లో నిబంధనల మేరకే ఖర్చు చేసిన వారు ఎవరైనా ఉన్నారా ? అని నాకు పరిచయం అయిన అందరినీ అడుగుతున్నాను , తెలుసుకోవాలి అని ఆసక్తి, అంతే అన్నాను . చెప్పు పరవాలేదు , మురళి మన ఫ్రెండే అని లింగారెడ్డి తాను ఎన్ని కోట్లు ఖర్చు చేశాడో చెప్పారు . ఎక్కువ ఖర్చు చేస్తే అవినీతిని ప్రశ్నించే హక్కు లేదా అని ఆ రాజుగారు మళ్ళీ అడిగారు .

Ads

ఇలాంటి సభలో నేను ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను అన్నారు కదా ? నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ ఖర్చు చేసిన మీకు నైతికంగా అసలు సభలోకి వెళ్లే హక్కే లేదు . డబ్భు లేని వ్యక్తి సభలోకి వెళ్లలేకపోయారు , డబ్బు ఎక్కువ ఖర్చు చేసి మీరు వెళ్లారు . మీ సభా ప్రవేశమే అనైతికం .. మీరే కాదు, ఏ ఒక్కరు కూడా నిబంధనల మేరకు ఖర్చు చేయరు అని చెప్పాను .

విచిత్రం యేమిటంటే కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా నిబంధనల మేరకు ఖర్చు చేయరు . ఇలా ఎక్కువ ఖర్చు చేశారు అని ఒక్కరంటే ఒక్కరి విషయంలోనూ రుజువు కాలేదు , రుజువు చేయలేరు . ఉమ్మడి రాష్ట్రంలో ఆసక్తితో దాదాపు 50-60 మందిని ఖర్చు గురించి అడిగి నిర్ధారించుకున్నాను . వార్త రాయడం కోసం కాదు, ఆసక్తి కొద్ది తెలుసుకోవాలి అని అడుగుతున్నాను అంటే చాలా మంది చెప్పారు . తరువాత తెలంగాణ ఉద్యమం , అంతటా ఉద్రిక్త వాతావరణం వల్ల ఎన్నికల ఖర్చు గురించి మనసు విప్పి మాట్లాడుకోలేదు . 294 మందిని ఖర్చు గురించి అడగాలని ఉండేది . 50-60 మందితోనే ఆగిపోయాను .

*********

రెండు రోజుల క్రితం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల వార్త టివిలో చూస్తుంటే … ఆ వెంటనే మరో ఆసక్తికరమైన వార్త .. ఖమ్మం జిల్లాలో ఓ వ్యక్తి డబ్బు తీసుకొని వెళుతుంటే తనిఖీ చేస్తున్న పోలీసులు ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు . ఎన్నికల కోడ్ తక్షణం అమలులోకి వచ్చినందున ప్రజాస్వామ్యాన్ని ధన స్వామ్యం నుంచి కాపాడేందుకు పోలీసులు రంగంలోకి దిగి ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారన్నమాట . ఎన్నికల కమిషన్ చాలాసేపు మీడియాతో మాట్లాడింది . అది పూర్తి కాక ముందే టివి ముందు నుంచి రంగంలోకి దిగిన పోలీసుల ఉత్సాహాన్ని చూశాక మన ప్రజాస్వామ్యం పోలీసుల వల్ల ఎంతో భద్రంగా ఉంది అనిపించింది .
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎంత ఖర్చు చేయవచ్చునో తెలుసా ? 2014 వరకు అయితే 28 లక్షలు , 2022 లో పెంచిన దాని ప్రకారం ఇప్పుడు 40 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు . జోక్ కాదు నిజం అందరూ ఇంతే ఖర్చు చేస్తారు అధికారికంగా , చేయాలి . ఇంతకన్నా ఎక్కువ ఖర్చు చేసినట్టు తేలితే శాసనసభ్యత్వం రద్దు అవుతుంది .
దేశంలో ఏ ఒక్కరు కూడా ఈ పరిధికి లోబడే ఖర్చు చేయడం సాధ్యం కాదు . అలా అని పరిధికి మించి ఖర్చు చేశారు అని ఒక్కరి విషయంలోనూ రుజువు చేయడం సాధ్యం కాదు . ఇప్పటి వరకు ఒక్క అభ్యర్థి కూడా పరిమితిని మించి ఖర్చు చేశాడు అని రుజువు కాలేదు . . ఆ మధ్య యనమల రామకృష్ణుడు ఓ టివి ఇంటర్వ్యూలో ఎన్నికల్లో తాను చేసిన భారీ ఖర్చు గురించి చెప్పారు . అది విని వైయస్ ఆర్ కాంగ్రెస్ వాళ్ళు సామాజిక మాధ్యమాల్లో తెగ హడావుడి చేశారు . యనమల పని అయిపోయినట్టే ఇదిగో ఆధారం అని .. తరువాత ఏమైందో ఎవరూ పట్టించుకోలేదు .
నామినేషన్ దాఖలు చేసే ఒక్క రోజే ఇంతకు మూడింతలు ఖర్చు అవుతుంది .
******
ఢిల్లీలో ఎన్నికల కమిషన్ మీడియాతో మాట్లాడుతుండగానే పోలీసులు రంగంలోకి దిగి దారులను దిగ్భందం చేసి వెతికితే నోట్ల కట్టలు దొరుకుతాయి . మీడియాలో బోలెడు ప్రచారం . బేగంబజార్ లో నిలబడి వాహనాలు వెతికితే రోజుకు కొన్ని కోట్లు దొరుకుతాయి . అలా డబ్బులు తీసుకువెళ్లే వారు ఎన్నికల్లో పంచడానికి కాదు . వారికి కనీసం ఎన్నికల షెడ్యూల్ వచ్చింది అని కూడా తెలియదు .
బేగంబజార్ లో రోజూ నగదు రూపంలోనే కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది . ఒక్క బేగంబజార్ అనే కాదు ఇలా తనిఖీల్లో దొరికే డబ్బుకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి సంబంధం ఉండదు . వ్యాపారాలు , వ్యక్తిగత అవసరాల కోసం అలా డబ్బు తీసుకువెళుతున్న వారే వారంతా .. ఇంకా వివిధ పార్టీల అభ్యర్థులే తేలనప్పుడు ఎవరు ఎవరికి పంచుతారు డబ్బులు .
2004 , 2009 ఎన్నికల్లో కొందరు ఏకంగా రెడీమేడ్ సిమెంట్ మిక్సర్ భారీ వాహనాల్లో కూడా డబ్బు పంపినట్టు ఎన్నికలల్లో చురుగ్గా పాల్గొన్న వారు ఎన్నికలు అయ్యాక చెప్పిన మాట . ఎన్నికల సంస్కరణలు అంటే చాలా మంది శేషన్ పేరు గుర్తు చేసుకుంటారు . ఒకరు మరో కోణంలో చూశారు . శేషన్ కన్నా ముందు గోడల మీద రాతలతో తక్కువ ఖర్చుతో ప్రచారం జరిగేది . శేషన్ పుణ్యమా అని గోడమీద రాతలు మాయం అయ్యాయి కానీ ఖర్చు భారీగా పెరిగింది . ఎన్నికల ఖర్చు రాసి , ఆడిట్ చేసి ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ కు ఇవ్వాలి . ఎన్నికల ఖర్చు పరిమితిలో సగం ఈ ఆడిటర్ ఫీజుకే సరిపోతుందేమో … – బుద్దా మురళి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions