.
సోషల్ మీడియాలో ఓ టికెట్ కనిపించింది… హైదరాబాదు థియేటర్‌దే… 50 రూపాయల టికెట్ మీద 800 స్టాంప్ వేసి ఉంది…
ఇది చూశాక బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల పెంపు, జీఎస్టీ ఎగవేతల మీద అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి… అసలు జీఎస్టీ యంత్రాంగానికి ఈ సినిమా ఆదాయం మీద పట్టు ఉందా..? కావాలని చూసీచూడనట్టు వదిలేస్తున్నదా..?
Ads
సాధారణంగా బెనిఫిట్ షోలు అనేవే ఫ్యాన్స్‌ను నిలువు దోపిడీకి ఉద్దేశించిన ఓ దందా… వీటికితోడు అదనపు షోలకు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతి అదనపు ప్రభుత్వ స్పాన్సర్డ్ దోపిడీలు…
హీరోల కాళ్ల మీద పడి పాకే ఇండస్ట్రీ… ఆ రెమ్యునరేషన్లే సినిమా నిర్మాణ వ్యయంలో ఎక్కువ… వందల కోట్ల ఖర్చును చూపించి, అదేదో సమాజాన్ని ఉద్దరించే పని అన్నట్టు టికెట్ రేట్ల పెంపు అనుమతి పొందుతున్నారు… చివరకు డబ్బింగ్ సినిమాలకు కూడా…
రెండు తెలుగు రాష్ట్రాలకూ ఓ దశ లేదు, ఓ దిశ లేదు, ఈ విషయాల్లో… సంధ్య థియేటర్ దుర్ఘటన తరువాత తెలంగాణ ప్రభుత్వం కొంచెం అభినందనీయంగా తన విధానం ప్రకటించింది… నాలుగు రోజులకే యూటర్న్… కారణాలు ఏవైనా సరే..! ఇక సినిమా కుటుంబాలే పాలించే ఏపీ సినిమా విధానంపై చెప్పుకోవడం వేస్ట్…
1) ఈ టికెట్ ఓజీ సినిమాకు సంబంధించేనా, పాతదో తెలియదు గానీ… 50 రూపాయల టికెట్ మీద 800 స్టాంప్ వేసి అమ్మితే… జీఎస్టీ లెక్కల్లోకి 50 చూపిస్తున్నట్టా..? 800 చూపిస్తున్నట్టా..? అంటే ఈ బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుతో ప్రభుత్వానికి కూడా అదనపు ఆదాయం వస్తున్నది కదానేది ఉత్త డొల్ల ప్రచారమేనా..?
2) ఎక్కడో చదివినట్టు గుర్తు… ‘‘ఆఫ్ లైన్ టికెట్ల అమ్మకాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు… ప్రీమియర్ షో టికెట్లను కూడా బ్లాకులో అమ్ముతున్నారు… ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 800 వరకూ ప్రీమియర్ షో టికెట్లు అమ్ముకోవాల్సి ఉండగా… 2000, 2500 దాకా బ్లాకులో అమ్ముతున్నారు… మామూలు షోల టికెట్లనూ బ్లాక్ చేసి, అడ్డగోలు రేట్లకు అమ్ముకుంటున్నారు…’’ ఇవీ ఆరోపణలు…
3) ప్రభుత్వ నియంత్రణో, పర్యవేక్షణో, సమీక్షో, చర్యలో ఏమీ ఉండవా..? అసలు సినిమాటోగ్రఫీ అనే శాఖ ఒకటి ఉందని ప్రభుత్వ ముఖ్యులకు గుర్తుందా..,?
… అసలు ఎగ్జిబిషనే ఓ సిండికేట్ అనే ఆరోపణలు చాలాకాలంగా ఉన్నవే… దీనికితోడు ఈ టికెట్ల అక్రమ విక్రయాలు, అడ్డగోలు వసూళ్లు, బ్లాక్ యవ్వారాల ఆరోపణలు ఈమధ్య బాగా వినిపిస్తున్నాయి… ఇది ఒక్క ఓజీ సినిమా కథ కాదు… ప్రతి పాపులర్ హీరో సినిమా విడుదలవుతున్నప్పుడూ ఇదే కథ…
Share this Article