.
ముందుగా ఓ మాట… ‘‘ఈ సినిమాలో అన్నీ గన్సే ఉంటాయి, విలన్ పెద్ద గన్ డీలర్, ఇష్టం వచ్చినట్టు కాల్చేసుకోవచ్చు అని చెబితే చాలు, పవన్ కల్యాణ్ డేట్స్ ఇచ్చేస్తాడు’’ అని పూరి జగన్నాథ్ సరదాగా ఓసారి చెప్పిన మాట… ఓజీ సినిమాలో గన్నులకు తోడు పేద్ద సమురాయ్ కటానా కత్తి కూడా ఉంది..!
.
Ads
మరీ ఒక్క ముక్కలో చెప్పాలంటారా…? పవన్ కల్యాణ్ కోసం, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కోసం, పవన్ కల్యాణ్ ఫ్యాన్ తీసిన పవన్ కల్యాణ్ సినిమా…
ఎలివేషన్… ఎలివేషన్… ఎలివేషన్… పలు హై సీన్లు… థమన్ మోత, ఫ్యాన్స్ కేకలు… రెండున్నర గంటల సినిమాలో యాభై నిమిషాల దాకా ఫైట్లు, హింస… మరి సగటు తెలుగు పాపులర్ హీరో అన్నాక ఆమాత్రం ఉండాలనేదే కదా ఫార్ములా…
మనం తరచూ చెప్పుకుంటాం కదా… స్మగ్లర్లు, గ్యాంగ్‌స్టర్లు, కాల్పులు, పోరాటాలు, ఇమేజ్ బిల్డప్పులు, రొటీన్ ఫార్ములా పోకడలు అని… సేమ్… అసలు రెండున్నర గంటల సినిమాలో హీరో గంటంబావు కనిపిస్తే అందులో ముప్పావుగంట ఫైట్లే…
నిజానికి చాలా డేట్స్ కావాలి ఈ సినిమాకు… కానీ సార్ డిప్యూటీ సీఎం, చాలా బిజీ… ఐనా కళామతల్లి సేవను మరిచిపోకుండా, పాత అడ్వాన్సుల సినిమాలు ఔదార్యంతో ఫినిష్ చేస్తున్నాడు… 37 రోజుల దాకా డేట్స్ అడ్జస్ట్ చేశాడట…
అవసరమున్నచోట్ల బాడీ సెకండ్స్, ఎఐ ఉంటాయి, ఉంటారు కదా..! అసలు ఫస్టాఫ్‌లో 20 నిమిషాలపాటు హీరో కనిపించడు, రాడు… 50 నిమిషాల తరువాత తన మొదటి డైలాగ్… ఐతేనేం… సినిమాలో పవన్ కల్యాణ్ తాలూకు పూనకాలు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు భలే ప్రజెంట్ చేశాడు…
కథేమిటంటే..? ఓజాస్ గంభీర్, OG (పవన్ కళ్యాణ్) జపాన్‌లోని లెజెండరీ సమురాయ్ క్లాన్‌కు చివరి వారసుడు… అతన్ని సత్యదేవ్ (ప్రకాశ్ రాజ్) దత్తత తీసుకుంటాడు… 70వ దశకంలో తన కుటుంబంతో పాటు వ్యాపారాన్ని కూడా బాంబేకు మార్చుకున్న సత్యదేవ్, గంభీరాను రక్షకుడిగా పెట్టుకుంటాడు… బాంబే పోర్ట్ ద్వారా వారి వ్యాపారం సాగుతుంది… అయితే ఒక రోజు అక్కడ RDXతో కూడిన కంటైనర్ దిగుతుంది… దానికి వెనుక ఎవరు ఉన్నారు? ఆ సమయంలో గంభీరా ఎందుకు లేడు? మళ్లీ ఎందుకొచ్చాడు..? ఇవన్నీ కథను ముందుకు నడిపిస్తాయి…
కథ వరకూ పెద్ద కొత్తదనమేమీ లేదు… కాకపోతే దర్శకుడు, పవన్ కల్యాణ్ ఫ్యాన్ సుజీత్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కోసమే తీసినట్టు ఫుల్ ఎలివేషన్లకు, యాక్షన్ డ్రామాకు ప్రాధాన్యం ఇచ్చాడు… అక్కడక్కడా పవన్ కల్యాణ్ పాత సినిమాల ప్రస్తావనలు సహా..!
కథలోకి స్ట్రెయిట్‌గా తీసుకుపోవడం బాగుంది… కాకపోతే ఫ్లాష్ బ్యాక్, ఎమోషనల్ బిట్స్, సబ్ ప్లాట్స్ పైపైన సాగుతూ కొంత నిరాశపరిచినా… చివరకు క్లైమాక్స్‌లో హీరో దుమ్మురేపుతాడు…
ఈ సినిమా ప్రధాన బలం ఏమిటంటే… పవన్ కల్యాణ్… చాన్నాళ్ల తరువాత పాత పవన్ కల్యాణ్ కనిపించాడు… అందుకే థియేటర్లలో ఫ్యాన్స్ పూనకాలు… తనకు సరిపోయే కథ, సరిపోయే యాక్షన్ సీన్లు, ఫుల్ ఎలివేషన్లు… ఇంకేం కావాలి..? పవన్ కల్యాణ్ అంటే తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు.,. దాన్ని నిలబెట్టుకునే మరో పాత్ర ఇది…
యాక్షన్ సీన్లలో పవన్ కల్యాణ్ అంటే పవన్ కల్యాణే ఇక… పోలీస్ స్టేషన్ సీన్ వంటి చోట్ల నటుడిగా తన సీనియారిటీ, అనుభవం కనిపిస్తాయి… ప్రియాంక అరుల్ మోహన్ చిన్న పాత్రే అయినా ఆ పాత్రకు తగినట్టు సరిపోయింది… బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ నెగటివ్ రోల్‌తో కొంత కొత్తదనం తీసుకొచ్చాడు, కాకపోతే తన వీక్ కేరక్టరైజేషన్, పవన్ ఓవరాల్ డామినేషన్ కారణంగా ఆ పాత్ర ఇంప్రెసివ్‌గా లేకుండా పోయింది…
శ్రియారెడ్డి డీసెంట్ రోల్… ప్రకాశ్ రాజ్ సోసో… అర్జున్ దాస్‌ను వాడుకోలేకపోయారు… నిజమే, పవన్ కల్యాణ్ ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో చెప్పినట్టు థమన్ బీజీఎం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్… సీన్లను భలే ఎలివేట్ చేశాడు… కాకపోతే కొన్నిచోట్ల… అంటే చావుకి పెళ్ళికి, హీరో కి విలన్ కి, సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఒకటే తరహా మోత… ఓ మైకం కమ్మినట్టుగా వాయిస్తూ పోయాడు…
మొత్తంగా చూస్తే… పవన్ కల్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్, థమన్ బీజీఎం, యాక్షన్ కొరియోగ్రఫీ ప్లస్ పాయింట్లు… బలహీనమైన కథనం, పెద్దగా ఎమోషనల్ కంటెంట్ లేకపోవడం, సెకండాఫ్‌లో సబ్ ప్లాట్ల ల్యాగ్ మైనస్ పాయింట్లు… ఈ విషయాల్లో దర్శకుడు జాగ్రత్త తీసుకుని ఉంటే… సినిమా మరో రేంజులో ఉండేదేమో…
చివరగా… మీరు పవన్ కల్యాణ్ అభిమానా..? నో డౌట్… మీకు ఈ సినిమా పండుగే..!! అకీరా నందన్‌ను కూడా వెనుక నుంచి చూపించి… సినిమా బాగా ఆడితే, ఇదే ఫ్లాష్ బ్యాక్‌గా ఓ సినిమా గ్యారంటీ..!!
Share this Article