మీరు వినే కోవిడ్ వాణి రోజుకు 3 కోట్ల గంటలే!
———————–
గడచిన సంవత్సరం మార్చి నెల దేశవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ మొదలయినప్పటి నుండి సెల్ ఫోన్లలో ఏ నంబరుకు డయల్ చేసినా ముప్పయ్ సెకన్ల పాటు కరోనాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలే వినపడతాయి. హిందీ, ఇంగ్లీషుతో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా డయల్ టోన్ నిర్బంధంగా వినిపించేలా ఏర్పాటు చేశారు. మొదట్లో చైతన్యపరచడానికి ఇది బాగానే ఉన్నా- ఇప్పుడు కరోనాతో సహజీవనం చేయకతప్పదని జ్ఞానం కలిగిన తరువాత ఈ నిర్బంధ డయల్ టోన్ అవసరం లేదని వినియోగదారులు వాదిస్తున్నారు. కేంద్ర టెలికాం మంత్రికి, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ- ట్రాయ్ కి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. చావగొట్టి చెవులు మూసే కరోనా వాణి పెట్టే హింసను ఒక చైతన్యవంతమయిన వినియోగదారుల వేదిక సంఖ్యల్లో సాంకేతికంగా పట్టుకుంది.
————————
దేశంలో ఒక రోజు ఫోన్ కాల్స్- 300 కోట్లు
ఒక ఫోన్ రోజులో సగటున చేసే కాల్స్- 3
ఒకరోజులో 30 సెకన్ల చొప్పున జనం విధిగా కరోనా జాగ్రత్తల డయల్ టోన్ వింటున్న మొత్తం సమయం- 3 కోట్ల గంటలు
Ads
రోజుకు కరోనా వాణి వినడానికి వృథా అయ్యే పనిగంటలు- ఒక కోటి ముప్పయ్ లక్షల గంటలు
————————
మన శ్రీనివాస రామానుజన్ ప్రపంచ ప్రఖ్యాత గణిత మేధావి. ఆయన కనుక్కున్న ఇన్ఫినిటీ నంబర్ థియరీ ఆయనకు అంతు చిక్కినది. మనకు అంతు లేనిది. శ్రీనివాస రామానుజన్ మళ్లీ పుట్టినా లెక్కకట్టలేనన్ని కోట్ల కోట్ల గంటల సేపు మనం ఫోన్లలో కరోనా వాణి వింటున్నామట. ప్రాణం మీదికి వచ్చే ఎమర్జెన్సీ కాల్స్ విషయంలో ఈ నిర్బంధ వాణి వినడం కంటే ప్రాణం పోవడమే నయమనిపిస్తోందట. కరోనా గురించి కావాల్సిన ప్రచారం కంటే ఎక్కువే ప్రచారం జరిగింది కాబట్టి- ఇక ఈ కర్ణ విష రసాయనాన్ని ఆపండి మహాప్రభో! అని జనం కేంద్ర ప్రభుత్వాన్ని అర్థిస్తున్నారు.
———————–
ఇంతకు ముందు డయల్ చేయగానే హాయిగా-
“కెవ్వు కేక మా వీధంతా కెవ్వు కేక”
“రత్తాలు రత్తాలు బొత్తాలు బొత్తాలు”
“నీ కాళ్లుపట్టుకుని వదలనన్నవే నా కళ్లు”
లాంటి భావగర్భిత చైతన్య ప్రబోధ యుగళ గళాలు వినే వాళ్లం. ఉత్సాహంగా గాల్లో తేలినట్లు ఉండేవాళ్లం. అసలే ఒకవైపు కరోనా కోలుకోలేని దెబ్బ కొడుతుంటే- మరోవైపు ఫోన్లో చెవిలోకి దూరి కారోనా మాట్లాడినట్లు ఈ డయల్ టోన్ కొట్టే దెబ్బతో గోడ దెబ్బకు చెంప దెబ్బ తోడయినట్లు ఉందట. ముళ్ల విషబంతిగా కరోనాకు ఒక రూపం మాత్రమే ఉన్నట్లు లోకం ఇన్నాళ్లు అనుకుంది. ఈ డయల్ టోన్ శ్రుతి మించి ఇప్పుడు కారోనాకు నోరొచ్చి మాట్లాడుతున్నట్లు కూడా ఉంది. ఈ డయల్ టోన్ వినకుండా తప్పించుకోవడానికి కోట్ల మంది ఎన్నెన్నో ప్రయోగాలు చేసి విఫలమయ్యారు. ఆత్మకు చావు లేదు. కత్తి కోయలేదు. నీరు తడుపలేదు. అగ్ని కాల్చలేదు. అలాగే ఈ డయల్ టోన్ కట్ చేస్తే కట్ కాదు. కట్ చేసి మళ్లీ చేస్తే మళ్లీ మొదటినుండి వినాల్సి వస్తుంది. కరోనా! చరవాణిలో, కరవాణిలో నీ చైతన్య నిర్బంధవాణి వినలేక చస్తున్నాం. ఎప్పటికి నోరుమూసుకుంటావ్?…….. By…. పమిడికాల్వ మధుసూదన్
Share this Article