.
ఎ. రజాహుస్సేన్ ఒక మంచి చిత్రం…”ఒక మంచి ప్రేమ కథ”..!
ఇది అలాంటిలాంటి ప్రేమకథ కాదండోయ్..!
హృదయాలను మెలిపెట్టి, కలిపి కుట్టే కథ..!!
ఎన్నాళ్ళకెన్నాళ్ళకు, ఎన్నేళ్ళకు… రణగొణ ధ్వనులు, పిచ్చిపాటలు, వెకిలి డ్యాన్సులు, సుమోలులేచిపోయే
ఫైట్లు, డబుల్ మీనింగ్ బూతు డైలాగులు, హీరో బిల్డప్పులు లేని… ఓ మంచి చిత్రం ఈరోజు ‘ఈటివి విన్’ లో చూశాను. దానిపేరు.. “ఒక మంచి ప్రేమ కథ”..!
Ads
ఇంటిల్లిపాదీ కూర్చొని, సినిమాలు చూసే రోజులు పోయాయి అనేవారికి ఈ సినిమా ఓ చక్కని, దీటైన
సమాధానం. అన్నట్టు ఈ సినిమా కు కథ, మాటలు ఓల్గా గారు.. కాగా కథనం, దర్శకత్వం ఓల్గా కుటుంబ
రావు గారు… కమర్షియల్ హంగులు లేకుండా రెండు గంటలకు పైన కదలకుండా కూర్చోబెట్టడం Not a Joke…
కానీ,అరుదైన ఈ ఫీట్ సాధించారు ఓల్గా, కుటుంబరావులు… కథ వర్తమానంలో మన కళ్ళముందు జరిగేదే… సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల మోజులో, మాయలో పడి జీవితాలను పొగొట్టుకొని ఒంటరిగా బతుకుతున్న ఓ జంటకు
సంబంధించింది… నిజానికిది అందరికీ సంబంధించినదే. ఉద్యోగాలకోసం కన్నతల్లిదండ్రులను ఊర్లలో వదిలేసి.. నగరాలకు చేరుకుంటున్నారు..
ఉద్యోగం,కెరీర్ మోజులో… ఒకే రూఫ్ కింద వుంటున్నా ఒంటరిగా బతుకుతున్నారు ఎందరో జంటలు. ప్రమోషన్లు రాకపోతే.. టెన్షన్ ఫీలవడం, జీవితమే లేదనుకొని చివరకు డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం మనం చూస్తూనే వున్నాం. వర్తమాన సంఘటనలు, సాఫ్ట్ వేర్ జీవితాలను తీసుకొని ఓల్గా గారు అల్లిన ఈ కథ వాస్తవానికి చాలా దగ్గరగా వుంది.
ఇక ఆయా సన్నివేశాలకు ఆమె రాసిన మాటలు మొక్కకు ఎంచక్కా అంటుకట్టినట్టున్నాయి.. ఈ సినిమాలో పేరుమోసిన పెద్ద నటీనటులెవరూ లేరు. తల్లి రంగమణిగా రోహిణీ హట్టంగడి, కూతురు సుజాతగా రోహిణీ మధ్య జరిగే డ్రామా ఈ సినిమాకు బలం. వీరిద్దరి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాల్లో కళ్ళు తడుస్తాయి. హృదయం బరువెక్కుతుంది…
ప్రేమ వుందంటే సరిపోదు. ప్రేమకు పోషణ కావాలి. రోజూ నీరు పోయాలి. అప్పుడప్పుడు ఎరువువేయాలి. అప్పుడే ప్రేమ మొక్క ఆరోగ్యంగా, ఏపుగా ఎదుగుతుందన్న ఒక్క డైలాగ్ చాలు ఓల్గా కలం బలం తెలియటానికి.. అలాగే తల్లిగా నిన్ను కని, పెంచి పెద్దజేశాను కదా.. ఈ ముసలి వయసులో నన్ను పెంచుకుంటావా? అని తల్లి తన కూతురును అడిగే సన్నివేశం గొప్పగావుంది..
అలాగే “అమ్మను పెంచుకునే అవకాశం, అదృష్టం ఎంతమందికొస్తుంది. నాకూతురుకొచ్చింది. అలా నా కూతురు ఎంతో అదృష్టవంతురాలైంద”న్న మాట తీయతేనియ ఊటలా పదికాలాలు గుర్తుండిపోతుంది.. ఇది నిజంగా ఒక మంచి ప్రేమ కథే…
తల్లీ కూతుళ్ళ మధ్య సాగే ప్రేమను కళ్ళకు కట్టినట్టు, హృదయానికి తాకేట్టు చూపించారు. అమ్మకేఅమ్మ’యి పెంచుకోవడం అనే కాన్సెప్ట్ కొత్తగా వుంది. అలాగే వృధ్ధ తల్లిదండ్రుల్ని చూసుకోటానికి, చివరి రోజుల్లో వారితో గడపటానికి ఓ నెల రోజులు ప్రత్యేక సెలవు ఇస్తాననడం బాగుంది…
ఇక ‘మనిషి స్పర్శ’ (Human Touch) గురించి చెప్పిన ప్రతిసారీ… గొప్ప అనుభూతి కలుగుతుంది… ఉన్నంతలో సముద్రఖని బాగా నటించాడు.. మన బల్దేర్ బండి రమేష్ నాయక్ మెరుపులా మెరుస్తాడు. ఇక ఓల్లా, నెల్లుట్ల రమాదేవి, మరికొందరు కవులు, రచయిత్రులు కాస్సేపు కనిపిస్తారు. వారందరిపై ఓ
పాటను కూడా చిత్రీకరించారు..
క్లీన్ చిత్రం… చూస్తున్నంతసేపు సినిమాలో విలీనమై పోతాం. నామటుకు నాకు బాగా నచ్చింది.. మీరూ
చూడండి.. మీకూ తప్పక నచ్చుతుంది.. హ్యూమన్ ఎమోషన్స్ బాగా పండాయి….!
Share this Article