Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అప్పట్లోనే యండమూరితో సంభాషణలు… ఓ పాన్ ఇండియా సినిమా…

December 31, 2024 by M S R

.

.    (    రమణ కొంటికర్ల   ) ..          …. ఒక ఊరి కథ అంటూ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ పనోరమా విభాగంలో మన పల్లెటూరికి పట్టం కట్టినవాడు. మున్షీ ప్రేమ్ చంద్ రాసిన కఫాన్ కథను తెలుగులో సిల్వర్ స్క్రీన్ పైకెక్కించి… యండమూరితో సంభాషణలు రాయించి.. పాన్ ఇండియా సినిమాను తీసినవాడు మృణాళ్ సేన్.

హాంకాంగ్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం నుంచి మొదలుకుంటే.. ఎన్నో అంతర్జాతీయ వేదికలపైన విమర్శకుల ప్రశంసలందుకున్న చిత్రం ఒక ఊరి కథ. డిసెంబర్ 18, 2018న కన్నుమూసిన ఆ దిగ్దర్శకుడు మృణాల్ సేన్ ను ఓసారి యాజ్జేసుకోవాల్సిన తరుణం.

Ads

14 May 1923 – 30 December 2018

రెగ్యులర్ అండ్ రొటీన్ ప్యాటర్న్ సినిమాను ఆఫ్ బీట్ మోడ్ తో కొత్త జానర్ లో సజీవంగా నడిపించిన ఇండియన్ తొలితరం దర్శకుల్లో మృణాల్ సేన్… సత్యజిత్ రే తో పోటీ పడ్డ హైట్… రే, సేన్, రిత్విక్ ఘాటక్ ఈ ముగ్గురూ బెంగాలీ సినిమాను ప్రపంచ యవనికపై నిలబెట్టిన దర్శకులు. ముగ్గురూ మంచి మిత్రులే అయినప్పటికీ… సినిమా నిర్మాణపరంగా మాత్రం పోటీలో ఎవరి రీతి, ఎవరి శైలి వారిదే!

ఓ ఊళ్లో ఏ పనికీ పోకుండా… ఎలాగైతే అలాగ్గానీ.. కట్టెలు కొట్టుకోనో.. లేక ఓ రెండ్రోజులు పస్తులుండో బతకడమే తప్ప… ఎవ్వరివద్దా తలవంచని ఆత్మగౌరవం మెండైన… ఆకలిని జయించిన ఇద్దరు తండ్రీ, కొడుకుల కథ ఒక ఊరి కథ.

ఈ కథను మృణాల్ సేన్.. సెల్యూలాయిడ్ కు ఎక్కించిన తీరు చూస్తుంటే… నిజంగానే మనమూ ఆ ఊళ్లోనే ఉన్నామా అనిపిస్తుంటుంది. కొడుకు తండ్రికి నచ్చని అమ్మాయిని పెళ్లి చేసుకోవడం.. ఆ అమ్మాయి ఆ తర్వాత కుటుంబాన్నే నియంత్రించడానికి యత్నించడం.. ఇలా కుటుంబంలో నెలకొనే తగాదాలతో నడిపిస్తాడు. కోడలంటే గిట్టని మామ.. తీరా ఆమె గర్భవతైతే మంత్రసానిని పిలవడానికి కూడా నిరాకరిస్తాడు. వైద్యసాయమందని స్థితిలో కోడలు మరణిస్తుంది. ఆ తర్వాత ఆమె అంత్యక్రియల కోసం డబ్బు యాచించడం.. ఇదిగో ఇలా నడుస్తుంటుంది ఒక ఊరి కథ.

ఒక ఊరి కథ సినిమా చూస్తుంటే… ఈమధ్యే మరో మృణాళ్ సేన్, సత్యజిత్ రే వంటివాడు మళ్లీ పుట్టుకొచ్చాడా అన్నట్టుగా మళయాళంలో ఉర్రూతలూగిస్తున్న లిజో జోస్ పెల్లిస్సెరి వవాచన్ మేస్త్రీ మరణం చుట్టూ జరిగిన ఘటనలాధారంగా తీసిన ఈమాయు ఓసారి అలా ఓ లీలగా గుర్తొస్తుంది.

ఒక ఊరి కథలో పాత్రలను పాత్రధారులతో పండించిన తీరు.. సజీవంగా మనమే ఆ ఊళ్లో ఉండి అంతా చూస్తున్నామా అన్నట్టుగా నడిపించిన స్క్రీన్ ప్లే సేన్ పనితనానికి ప్రతీకైతే… దొరహంకారానికి వ్యతిరేకంగా కనిపించే కమ్యూనిస్ట్ భావజాలానికి ఆకర్షితుడైన ఆయన వ్యవహారశైలీ సినిమాలో ప్రస్ఫుటిస్తుంది.

తన తొమ్మిది, పదేళ్ల మధ్య వయస్సులో చార్లీచాప్లిన్ నటించిన ‘ది కిడ్’ సినిమా సేన్ పై ఎనలేని ప్రభావం చూపింది. కొంతకాలం సీపీఐ సాంస్కృతిక విభాగంలోనూ పనిచేసిన సేన్… బతుకు చిత్రం కోసం మెడికల్ రిప్రజంటేటివ్ గా పనిచేసినా… రంగురంగుల చలనచిత్రమే రారమ్మని ఊరించేసరికి తన ఠికాణా కాస్త కలకత్తాకు మార్చేశాడు.

రాత్ భోరే, నీల్ ఆకాషర్ నీచే వంటి బెంగాలీ చిత్రాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఆతర్వాత చేసిన బైషే శ్రావణ్, భువన్ షోమ్ వంటి చిత్రాలు ఆయనకు ఎనలేని గుర్తింపునిచ్చాయి. ఒక పేద జంట ఆహారం లేకుండా తమను తాము నిలబెట్టుకోవటానికి పడే కష్టాలు.. విపత్తును ఎదుర్కోవడంలో మానవ స్వభావంలో కనిపించే చీకటి కోణాలను ఆవిష్కరించడమే బైషే శ్రావణ్. విదేశీ చలన చిత్రోత్సవానికి లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు మొట్టమొదటగా పంపిన మృణాల్ సేన్ చిత్రం బైషే శ్రావణ్.

మృణాల్ సేన్ తన సినిమా క్యాన్వాస్ కు ఎంచుకునే ఇతివృత్తాలన్నీ చీకటి కథలో.. లేక, ఆవేదనాపూరితమైన అంశాలో ఉంటాయన్నది ఓ కంప్లైంట్. ఆయన సినిమాలన్నీ దుఖంతో కూడిన ముగింపులేనన్న విమర్శలతో పాటే… తన కమ్యూనిజం భావజాలం కూడా తన సినిమాలపై ఉంటుందన్న సునిశితమైన ఆరోపణలనూ ఎదుర్కొన్నారు.

అయినా సరే తన పంథా మాత్రం మానకుండానే… తన సినిమా ద్వారా ఏం చెప్పదల్చుకున్నారో సూటిగా, అంతే సజీవంగా చెప్పగల్గిన భావవ్యక్తీకరణ సేన్ సినిమా. 1997 నుంచి 2003 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా మృణాల్ సేన్ పార్లమెంట్ లో తన గళం వినిపించాడు.

సేన్ సినిమాలకు ప్రీ ప్రొడక్షన్ లోనైనా.. పోస్ట్ ప్రొడక్షన్ లో అయినా ఆయన భార్య, సేన్ సినిమాల్లో నటైన గీతా సేనే ప్రధాన విమర్శకురాలు. సేన్ కెమెరా అనే థర్డ్ ఐతో పనిచేస్తే… ఆమె తన భర్త మూడు కళ్లకు.. తన రెండు కళ్లూ జోడించిన మరో కళ్లజోడు. ఒక వ్యూయర్ గా ఆమె నిక్కచ్చిగా ప్రీప్రొడక్షన్ లోనే నచ్చలేదని చెప్పిన ఎన్నో సందర్భాలను సేన్ మార్చేశాకే.. ఆయా సినిమాల్లోని పలు సన్నివేశాలు పండడానికి ప్రధాన కారణమట.

కలకత్తా అంటే వల్లమాలిన అభిమానమున్న సేన్… కలకత్తా నగరంలోని విభిన్నకోణాలను స్పృశిస్తూ… సమాంతర సినిమాకు భిన్నంగా పేదరికం, నిరుద్యోగిత వంటి పలు అంశాలను జొప్పించి రూపొందించిన డాక్యుమెంటరీస్.. రంగురంగుల కలకత్తా వెనుకున్న ఈతిగాధలను ప్రస్తావిస్తాయి. ఆ డాక్యుమెంటరీస్ జిలుగు వెలుగుల వెనుకున్న బ్లాక్ అండై వైట్ కథలను సమాజం కళ్లకు కడతాయి.

96 ఏళ్లు బతికిన సేన్ 2002లో తన చివరి చిత్రం అమర్ భువన్ షూటింగ్ సందర్భంగా.. తన చిత్రనిర్మాణ ప్రక్రియ గురించి మాట్లాడినప్పుడు.. తన సినిమా పూర్తైందన్నప్పుడు.. తన పని ఇక ఐపోయింది ఇంకేం చేస్తామనుకునేవాడట.

కానీ, తాను తిరిగి మళ్ళీ మేల్కొంటానని చెప్పేవాడట. నిజంగానే సేన్ లేకపోయినా… రొటీన్ రొడ్డకొట్టుడు సినిమా ప్రపంచంలో ఆయన సినిమా ఎప్పటికీ ఆన్ స్క్రీన్ పై, ఆయన మాటల్లా అక్షరసత్యాలై బతికే ఉంటుంది. ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పి.. దాదాసాహెబ్ అందుకున్న ఆ పద్మభూషణుడు.. సినిమా ఉన్నంతకాలం చిరంజీవే……

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సాక్షిలో చైనా సరుకు..! ఈ కరణ్ థాపర్ ఘొప్ప వ్యాసం చెప్పేది ఇదే..!
  • ఒక ధర్మబద్ధ ఫ్యూడల్ నియంత..! ఒక బొబ్బిలి బ్రహ్మన్న పాత్ర…!
  • ఓ ధూర్త శతృవు… ఓ మూర్ఖ ప్రధాని… ఈ తరం చదవాల్సిన కథ…
  • ఎద్దులతో ఓ జంట అనుబంధం…! తమిళ సినిమాకు కాదేదీ కథకనర్హం..!
  • ఈ సైకో రేపిస్ట్ ఎన్ని హత్యాచారాలు చేస్తేనేం… ఇంకా బతికే ఉన్నాడు…
  • గ్రోక్ కూడా చేతులెత్తేసిన భాష… ఇక ఆక్స్‌ఫర్డ్ టీమ్‌కే సాధ్యమేమో…
  • ఏమైంది అసలు..? చేజేతులా ట్రోలర్లకు చిక్కుతున్న కొండా సురేఖ..!!
  • అడుగుకో పాక్ గూఢచారి… వీళ్ల ఏరివేతే యుద్ధంకన్నా ప్రధానం..,
  • అనవసరంగా వైసీపీ సోషల్ బ్యాచ్‌ను గోకిన భైరవం దర్శకుడు…
  • అత్యంత అసాధారణ కరెంటు బిల్లు… నమ్మడమే కష్టం సుమీ….

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions