.
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక
ఒక రాధిక అందించెను నవరాగ మాలిక
.
అమెరికా అమ్మాయి చిత్రం.. పాటేమో వేణువు మీద… కథానాయకుడేమో వీణ పట్టుకుని కూర్చున్నాడు…
ఏమిటీ వింత పిక్చరైజేషన్ అనిపించింది చూస్తుంటే… కానీ చూడగా చూడగా మత్తెక్కిపోతాము..
కథానాయక వేణువైతే పిల్లనగ్రోవిని ఊదేవాడు కృష్ణుడు కదా…
Ads
కానీ ఈపాటలో ఇల్లాలిని చూస్తూ.. రాధికను వర్ణిస్తూ కథానాయకుడు తన శృంగార ప్రకటన చేస్తాడు.. కృష్ణుడు వేణువులో అనురాగ గీతికలను పలికిస్తే ఆ పాట విన్న రాధిక నవరాగమాలికలను అందిస్తుంది… ఎంత బాగుంది కదా ఈ భావన..
ఈపాట వేల సార్లు విన్నాను మొదటిసారి చూస్తున్నాను..
వింటున్నప్పుటి మైమరపు.. చూస్తున్నప్పుడు కూడా కలిగింది…
పాట మొత్తానికి ఆలంబన శ్రీధర్ గారి భావ ప్రకటన..
ఆ అలంబన చుట్టూ లతలాగా అల్లుకున్న.. కథానాయక అభినయ హేల.. పాత్రధారి ఫ్రెంచ్ డాన్సర్ దేవయాని (Annick Chaymotty వెంపటి చినసత్యం గారి దగ్గర కూచిపూడి నృత్యం అభ్యసించారు)
పాట దర్శకత్వం అద్భుతంగా సాగింది..
ఒక గృహిణి జడనల్లుకుంటూ మేడ దిగివస్తుంది..
గదిలోకి వెళ్లి పూలసజ్జ తీసుకుని వచ్చి.. కథానాయకుడి ముందు బాపు బొమ్మ లాగా కూర్చుని జడలో పూలను తురుముకుంటుంది ..
ఆ తర్వాత శయ్యను సర్దుతుంది..
అటు పిమ్మట పాలు తీసుకుని వచ్చి కథానాయకుడు దగ్గర కూర్చుంటుంది..
పాటలోని భావాన్ని వింటూ..
అతని మెడలో కైదండ వేస్తుంది..
ఇంకా ఇంకా దగ్గరకు వచ్చి.. మోమును ముద్దాడుతుంది.. అరచేతుల మేఘాల వెనుక రాధాకృష్ణుల కేళీవిలాసం మొదలవుతుంది..
ఇంతే కేవలం ఇంతే.. ఈ పాటలోని దృశ్యాలు..
కానీ అందులో పలికించిన అద్భుతమైన సున్నిత శృంగారం గుండెలోని వీణను వేణుగానంతో మీటుతుంది.
బాలు మహేంద్ర గారి సినిమాటోగ్రఫీ.. క్లోజప్ షాట్స్.. సన్నివేశ చిత్రణ ప్రతి ఒక్క ఫ్రేము ఒక మెచ్చుతునక.
పాటలోని భావాన్ని దృశ్యీకరించిన దర్శకుడి ప్రతిభ అమోఘం.
అద్భుతం గురువర్య సింగీతం శ్రీనివాస.. నమోన్నమః
మైలవరపు గోపి గారి రచన.. జి ఆనంద్ గారి గానం..
జీకే వెంకటేష్ గారి స్వర రచన..
ఏ నింగికో ప్రభావించాయి … – డాక్టర్ మనోహర్ కోటకొండ, కడప
పాట ఇదుగో...
ఒక వేణువు వినిపించెను.. అనురాగ గీతికా..
ఒక రాధిక అందించెను.. నవరాగ మాలికా..
.
చరణం 1
సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో..
సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో..
నవమల్లిక చినవోయెను.. నవమల్లిక చినవోయెను..
చిరునవ్వు సొగసులో..
ఒక వేణువు వినిపించెను.. అనురాగ గీతికా..
చరణం 2
వనరాణియే అలివేణికి సిగపూలు తురిమెనో..
వనరాణియే అలివేణికి సిగపూలు తురిమెనో..
రేరాణియే నా రాణికి.. రేరాణియే నా రాణికి.
పారాణి పూసెనో..
ఒక వేణువు వినిపించెను.. అనురాగ గీతికా..
చరణం 3
ఏ నింగికి ప్రభవించెనో నీలాల తారకా..
ఏ నింగికి ప్రభవించెనో నీలాల తారకా..
నా గుండెలో వెలిగించెనూ.. నా గుండెలో వెలిగించెను..
సింగార దీపికా..
ఒక వేణువు వినిపించెను.. అనురాగ గీతికా..
Share this Article