సపోజ్… పర్ సపోజ్… మనం ఏ టైమ్ మెషినో ఎక్కేసి, మన గత కాలంలోకి వెళ్తే..? వెళ్లగలిగితే..? అరెరె, అప్పట్లో ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది, ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది అని ఇప్పుడు బాధపడేవన్నీ సరిదిద్దుకోగలమా..? ఇలా చాలాసార్లు అనుకుంటాం కదా… నిజంగానే ఆ చాన్స్ వస్తే, గతంలోకి వెళ్తే భౌతికంగా వెళ్తామేమో తప్ప, గడియారాన్ని వెనక్కి తిప్పగలమా..? ఆ తప్పులు దిద్దుకోవడం, మార్పులు సాధ్యమేనా..? పాత నిర్ణయాల్ని గనుక మారిస్తే, మరి వాటి ఫాలోఅప్ సీక్వెన్సుల మాటేమిటి..? అవన్నీ ఆల్‌రెడీ కాలగతిలో జరిగిపోయి ఉంటాయి కదా…
పోనీ, మనం గతంలోకి వెళ్తాం… అప్పటి కాలానికి తగినట్టు మన వయస్సు తగ్గిపోతుందా..? భౌతికమైన మార్పులు వస్తాయా..? లేక యధాతథంగా ఉంటామా..? మనమే సజీవంగా వెళ్తున్నాం కదా, మరి అప్పటి మన పాత్రలు అలాగే ఉంటాయా..? వర్తమానంలోని మనం, గతంలోని మనతోని మాట్లాడగలమా..? ఆ గతంలోని పాత్రలు హఠాత్తుగా మనతోపాటు భవిష్యత్తులోకి జంప్ చేస్తే..? టైమ్ మెషిన్ బేస్డ్ కథలు చూస్తుంటే ఇలాంటి సందేహాలే బోలెడు వస్తుంటాయి…
శర్వానంద్ నటించిన ‘ఒకే ఒక జీవితం’ సినిమా చూస్తున్నా ఈ సందేహాలే వస్తాయి… సో, ఇదొక సినిమా కథ… జస్ట్, ఓ కల్పన… లాజిక్కుల కోసం వెతికితే ఒక్క సీన్ కూడా ఎంజాయ్ చేయలేం… లాజిక్కులను, ధర్మసూక్ష్మాల్ని గాలికి వదిలేసి, జస్ట్, ఇదొక సినిమా అనుకుని చూడగలిగితే సినిమాను కాస్త ఎంజాయ్ చేయగలం… ప్రపంచంలోని పలు భాషల్లో టైమ్ మెషిన్‌లో గతంలోకి, భవిష్యత్తులోకి వెళ్లివచ్చే కథలెన్నో సినిమాలుగా వచ్చాయి… మనకూ ఆదిత్య 369 ఉదాహరణ ఉంది… కొన్నిసార్లు మనకు చిత్రమైన కలలు వస్తుంటాయి, సరైన సీక్వెన్స్ ఉండదు, తెల్లారిలేచాక చాలావరకూ గుర్తుండవు… ఒకే ఒక జీవితం కథ కూడా అంతే…
Ads
సినిమా నీట్‌గా ఉంది… అశ్లీలం, అసభ్యత, ఇతర ఏ వికారాల జోలికి పోలేదు దర్శకుడు… అలవిమాలిన తెలుగు సినిమాల అవలక్షణాలన్నీ గుప్పించలేదు… తరుణ్ భాస్కర్ రాసిన మాటలు బాగున్నయ్… కాకపోతే పాటలే మదిని పట్టేసే స్థాయిలో లేవు… అదొక్కటీ ఈ సినిమాకు కాస్త మైనస్… ఇక శర్వానంద్ పర్‌ఫామెన్స్ గురించి చెప్పనక్కర్లేదు, సరైన పాత్రలు పడక కొన్నాళ్లుగా ఫామ్‌లో లేడు… నిజానికి తనలోని నటుడిని పూర్తి స్థాయిలో ఎక్స్‌ప్లోర్ చేయదగిన పాత్ర ఇప్పటికీ తనకు బాకీయే… ఒకప్పటి హీరోయిన్ అమల అక్కినేని అమ్మ పాత్రలో పర్లేదు… ఆమె తమిళ సినిమాలో చివరిసారిగా కనిపించి 31 ఏళ్లు… మళ్లీ ఇప్పుడే కనిపిస్తోంది…
హీరోయిన్ రీతూ వర్మ పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు, కాకపోతే ఉన్నంతసేపూ ప్లజెంటుగా కనిపిస్తుంది ఆమె… ప్రతి తెలుగు సినిమాలో వెన్నెల కిషోర్ ఉండాలనే సెంటిమెంట్ ఒకటి నడుస్తోంది కదా… దాంతో దిక్కుమాలిన పాత్రల్ని చాలా చేశాడు… కొన్నాళ్లుగా తనకు మొనాటనీ వచ్చింది నిజానికి… కానీ ఈ సినిమాతో దాన్ని బ్రేక్ చేసుకోగలిగాడు… తను ఉన్నంతసేపూ బాగానే నవ్వించాడు… తోడుగా ప్రియదర్శి పర్లేదు…
తెలుగు షూటింగు సమయంలోనే తమిళంలోనూ సమాంతరంగా తీశారు కొన్ని సీన్లను… కొన్ని పాత్రలకు వేరే నటులను తీసుకున్నారు… జస్ట్, ఇలా డబ్ చేసి, అలా రిలీజ్ చేయకుండా, నేటివిటీని అద్దడం మంచి ప్రయత్నం… మరో విశేషం కూడా చెప్పుకోవాలి… గతం తాలూకు ఎపిసోడ్లలో నటించిన పిల్లలు మాత్రం నటనలో అదరగొట్టేశారు…
20 ఏళ్లయినా అమ్మ మరణించిన ప్రమాదం తాలూకు జ్ఞాపకాలు… ఇప్పటికీ తన మాటతీరు, బెరుకుతనంపై ఆ ప్రభావం… శర్వానంద్ పాత్ర కొత్తగా ఉంది… కొన్ని సీన్లలో శర్వాను అలా చూస్తుండిపోవాలి, అంతే… మన స్టార్ హీరోల్లో చాలామందికి అసలు రకరకాల భావోద్వేగాలు పలికించడమే తెలియదు… ఈ కథకు సైన్స్ ఫిక్షన్ నేపథ్యాన్ని తీసుకున్నా సరే, అంతర్లీనంగా ‘అమ్మతో అనుబంధం’ అనే అంశమే ప్రధానంగా కథను నడిపిస్తూ ఉంటుంది… సో, ఆ కోణంలో దర్శకుడి అటెంప్ట్, ఆలోచన బాగుంది… ఎమోషన్ లేని ఫిక్షన్ రక్తికట్టదు కదా… మరి లాజిక్కులు లేని సీన్ల మాటేమిటి అంటారా..? అసలు తీసిందే ఓ సైన్స్ ఫాంటసీ, ఇంకా లాజిక్కులతో పనేముంది..? చల్నేదో బాల్‌కిషన్…!!
Share this Article