వార్ధక్యం ఎటాక్ రెండుసార్లా ? నలభైల్లో అరవై ?
ఆమె వయసు నలభై. ముసలిదాన్ని అయిపోతున్నానని ఎప్పుడూ బాధ పడుతూ ఉంటుంది. చూసేవారికి ఏ తేడా కనిపించక పోయినా సరే…డబల్ చిన్ ఉందనో…బీపీ వచ్చిందనో చెప్పి అంతా వయసు ప్రభావం అంటుంది . మళ్ళీ తనే “అప్పుడే వయసు మీద పడితే ఎలా!” అంటుంది. సరిగ్గా ఇదే సమస్య అరవయ్యేళ్ళ ఆమె తల్లిది కూడా. మెడ కింద ముడతలు, ముఖ చర్మం వదులు, కళ్ళ కింద వాపు వయసు లక్షణాలంటూనే అప్పుడేనా? అంటుంది. వినడానికి విచిత్రంగా ఉంది కదూ! ఇలాంటప్పుడే ఒక కవిత గుర్తుకొస్తుంది.
“కన్నెతనం వన్నె మాసి
ప్రౌఢత్వం పారిపోయి
మధ్య వయసు తొంగిచూసిన
ముసలిరూపు ముంచుకురాదా!” అని.
Ads
అయిదు పదుల ఐశ్వర్యారాయ్ అందం తగ్గిందని ఎవరైనా అనగలరా ? ఏడుపదుల హేమమాలిని ముసలిగా కనిపిస్తుందంటే అస్సలు అంగీకరించలేం. అంతెందుకు అమితాబ్ బచ్చన్, చిరంజీవి వంటి స్టార్స్ అభిమానుల దృష్టిలో ఎప్పుడూ చిరంజీవులే. నిజంగా వారు వయసును, వార్ధక్యాన్ని జయించారా?
ఈమధ్య అందరిలోనూ ఆరోగ్య స్పృహ పెరిగింది కదా! జిమ్ కి వెళ్లి వ్యాయామాలు, యోగాసనాలు చేస్తూ ఎంతోమంది వయసుకన్నా చిన్నగా కనిపిస్తున్నారని అనుకోడమూ నిజమే. సౌందర్య పోషణలో సైతం అధునాతన పద్ధతులు వచ్చి వయసును వెనక్కి ఈజీగా నెట్టేస్తున్నారు. ఒకాయనైతే కోట్లు ఖర్చుపెడుతూ యవ్వనాన్ని కాపాడుకుంటున్నాడు.
దేవానంద్ వంటి నటుడు మెడకు స్టోల్ ధరించి ముడతలు కనబడకుండా జాగ్రత్త పడేవాడు. అయినా సరే…రెండు సందర్భాల్లో వృద్ధాప్యం వచ్చి పడుతుందని అమెరికాలోని స్టాన్ ఫోర్డ్, సింగపూర్ లోని నాన్యంగ్ విద్యాలయం నిర్వహించిన అధ్యయనం తేల్చింది. ఇంకా వీళ్లేమంటున్నారంటే …
44 ఏళ్ళ వయసులో ఒకసారి, 60 ఏళ్ళ వయసులో మరోసారి ఒంట్లో వృద్ధాప్య ఛాయలు చోటు చేసుకున్నట్లు గమనించారు. ఈ మార్పులను స్త్రీ పురుషులిద్దరిలోనూ గమనించారు. ఈ పరిశోధన కోసం 25 నుంచి 75 ఏళ్ళ వయసుగల 108 మందిని కాలిఫోర్నియా నుంచి ఎంచుకున్నారు. ప్రతి మూడు, ఆరు నెలలకోసారి వారి రక్తం తదితర నమూనాలు సేకరించి ఏళ్ళ తరబడి పరిశీలించారు.
ఆడవాళ్ళలో మెనోపాజ్ తో సంబంధం లేకుండా అందరిలోనూ 44 వ ఏట, 60 వ ఏట కీలక జీవాణువులు భారీ మార్పులకు గురైనట్టు గుర్తించారు. ఫలితంగా 55 ఏళ్ళు దాటగానే ముసలితనపు ఛాయలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు గమనించారు.
40 ఏళ్ళు దాటాక కెఫీన్, మద్యం అరిగించుకునే సామర్థ్యం తగ్గిపోతూ, కొవ్వు పేరుకోవడం ఎక్కువవుతుంది. ఆ దశలో కండరాల గాయాలు సైతం ఓ పట్టాన మానవు. ఒంట్లోని కణజాలంలో జరిగే తీవ్రమైన మార్పులే ఇందుకు కారణమని శాస్త్రజ్ఞుల అంచనా. అరవైల తర్వాత కండరాలు వేగంగా క్షీణించడంతో అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ఈ పరిశోధన వెల్లడించింది. అయితే ఈ వివరాలతో భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కొనే దారులు వెతకొచ్చని శాస్త్రజ్ఞుల ఆశ.
అయినా “దంతంబుల్ పడనప్పుడే, కురుల్ వెల్వెల కానప్పుడే…” మేలుకోవాలని ధూర్జటి ఎప్పుడో చెప్పాడు. ఇప్పటికే ఆయుర్వేద, యోగ, వ్యాయామ మార్గాలద్వారా యవ్వనం సాధించామనుకునే వారు ఇది చదివాక ఏమంటారో! వీటన్నిటికీ అతీతులం మేం. మా హేమమాలిని, ఐశ్వర్యారాయ్ మాకాదర్శం అంటారా? అలాగే కానివ్వండి! – కె. శోభ
Share this Article