తొమ్మిదేళ్ల క్రితం సినిమా… కందిరీగ… ఇప్పుడు సినిమా అల్లుడు అదుర్స్… ఇదే బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి సురేష్ దానికి నిర్మాత… అందులో కూడా సోనూసూద్ ఉన్నాడు… ఇదే దర్శకుడు అప్పుడూ ఇప్పుడూ… సంతోష్ శ్రీనివాస్… సేమ్, గిట్లనే ఒక్కతే పోరిని హీరో లవ్ చేస్తుంటడు, విలన్ ట్రై చేస్తుంటడు… కాకపోతే కందరీగలో హన్సిక -పోతినేని హీరోహీరోయిన్లు… గీ అల్లుడు అదుర్స్ సినిమాల అల్లుడు సీను, నభా నటేష్ హీరోహీరోయిన్లు… ఈ సినిమా చూస్తుంటే మల్ల గా సినిమానే చూస్తున్నట్టు కొడతది… అరె, ఏం సినిమా తీసినవ్ర భయ్… మమ్మల్ని హౌలాగాళ్లను చేస్తున్నరులే…
మరీ ఎక్కువైపోయింది ఈ టీవీలు, సినిమా పిచ్చోళ్లకు… ఇంతకుముందు కనీసం డిగ్రీ, ఇంటర్ ప్రేమల్ని చూపించి, రెండుమూడు తరాలను నాశనం చేశారు… ఇప్పుడు దీన్ని ఇక స్కూల్ దాకా తీసుకొచ్చారు… రాబోయే రోజుల్లో నర్సరీ, ప్రిప్రైమరీ ప్రేమల్ని కూడా చూపించి, మరికొన్ని తరాలను కూడా భ్రష్టుపట్టిస్తారేమో… ఈ సినిమాలో హీరో ఓ లవ్ ఫెయిల్యూర్, అదీ స్కూల్ లెవల్లోనే… దాంతో ఆడోళ్ల మీద ద్వేషం… థూమీబచె… ఈ కథల్రా మీరు తీసేది..? తరువాత ఓ రౌడీ బిడ్డ తగుల్తది… మరి స్కూల్ రోజుల నుంచి పోరీలను అవాయిడ్ చేసే ఈ పోటుగాడు ఆమెను చూడగానే లటుక్కున అతుక్కుపోతడు…
Ads
పోతే పోయిండు… కానీ సోనూసూద్ అనేటోడు కూడా గా పోరినే లవ్ చేస్తుంటడు… అరె, ఎన్నేళ్లు తీస్తర్రా గిసుంటి దిమాక్ లేని సినిమాలను… ఇజ్జత్ పోతది అని కూడా సోయి ఉండదా..? అసలే ఈ హీరోను నటనలో బేసిక్స్ తెలియవు… ఏదో, అయ్య దగ్గర పైసలున్నయ్… ఫైనాన్స్ చేస్తుంటడు, వాళ్లు ఈయన కొడుకును పెట్టి సినిమాలు తీస్తుంటరు… తను ఇక్కడ ఉద్దరించి, ఇక హిందీ సినిమాలకు పోతడట, తమ్ముడు తన ప్లేసులో తెలుగు సినిమాలను ఉద్దరించేటందుకు వస్తుండట… ఆఁ ఏం పోయిందిలే… అయ్య దగ్గర మస్తు పైసలున్నయ్ ఇంకా…
కానీ ఒక్కటి మాత్రం కనిపిస్తోంది… తెలుగు సినిమా తెలంగాణతనాన్ని గుర్తిస్తోంది… పాటల్లో, పాత్రల్లో, కథల్లో, మాటల్లో… వాట్ నాట్..? చివరకు కథాస్థలాలు కూడా తెలంగాణ నగరాలే… ఫిదాలు, ఎంసీఏల దాకా ఎందుకు..? మొన్నటి క్రాక్, ఈరోజు అల్లుడు అదుర్స్ సినిమాల్లోనూ కథాస్థలాలు వరంగల్, నిజామాబాద్… సరే, దాన్నలా పెట్టేస్తే ఇటు శ్రీనివాసుడు, అటు సోనూ సూద్ ఆ హీరోయిన్ అనబడే మరో ఉద్వేగరహిత మొహాన్ని పడేయటానికి నానా తిప్పలూ పడతారు… ఫాఫం, ఎంతటి సోనూ సూద్… ఇలాంటి పిచ్చి పాత్ర..? హతవిధీ…
పాపం, దర్శకుడు ఈ భోజనంలో మస్తు రకాల వంటకాలు పెట్టాలని ట్రై చేశాడు… కాస్త కామెడీ, ఓ హారర్ సీన్, ఓ ఫ్లాస్ బ్యాక్… తలతిక్క స్కూల్ లవ్… ఎన్ని వేషాలు వేసినా సరే, భోజనం మరీ మలక్‌పేట సుబ్బయ్య హోటల్ భోజనంలా రుచీపచీ లేకుండా మారిపోయింది… అన్నింటికీ మించి చెప్పుకోవాల్సింది దేవిశ్రీప్రసాద్… ఒకప్పటి స్టార్ మ్యూజిషియన్…
చాలారోజులుగా ఒక్కటంటే ఒక్క మంచి పాట రాలేదు డీఎస్పీ నుంచి… ఎంత కాపీ మాస్టర్ అని ఎందరు ఎలా నిందిస్తున్నా సరే థమన్ హిట్స్ కొడుతున్నాడు… శ్రీనివాస్ జస్ట్, ఓ హీరో… తను నటుడు కాదు… కావాలంటే ఇంకా షాళా షాళా కష్టపడాలి… మొన్న ఏదో మీటింగులో మా కష్టాన్ని గుర్తించండి, బ్యాక్ గ్రౌండ్ మాత్రమే కాదు అని చెప్పినట్టు గుర్తు… సీనయ్యా… చివరకు మాటీవీ సంక్రాంతి స్పెషల్ షోలో ఓ గెస్టుగా కూడా ఆకట్టుకోలేకపోతివి… మాస్ హీరోగా అప్పుడే నీకు మార్కులు ఏం వేయగలం చెప్పు..? అన్నట్టు ఈ సినిమాలో బిగ్‌బాస్ ఫేమ్ మోనాల్ గజ్జర్ కూడా ఉంది… ఫాఫం, ఒకప్పటి హీరోయిన్… ఇప్పుడు ఐటమ్ రాణి అయిపోయింది… రంభాఊర్వశిమేనకా అంటూ హొయలు పోయింది… పాట పర్లేదు, ఆమె పర్లేదు కానీ ఇక ఇంతే సంగతులా..? మాటీవీ డాన్స్ ప్లస్‌లో జడ్జి, కాదంటే ఐటమ్ సాంగ్స్… అంతేనా..? చివరగా :: విదేశీ సినిమాల్ని, స్వదేశీ సినిమాల్ని త్రివిక్రమ్, రాజమౌళి వంటి ఘనదర్శకులు కూడా కాపీలు కొట్టగలరు… కానీ మన పాత సినిమాల్ని మనమే రీమేక్ చేయడం జస్ట్, ఈ సంతోష్ శ్రీనివాస్‌కే సాధ్యం..!!
Share this Article