Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓహ్… నాటి పాపులర్ టీడీపీ ప్రముఖులు ఇప్పుడు బీజేపీలో ఉన్నారా..?

November 3, 2023 by M S R

ఓ రాజకీయ పార్టీ ప్రకటించిన మూడవ జాబితా అని కనిపించగానే యధాలాపంగా చదువుతూ పోతుంటే కొన్ని పేర్లు కనిపించగానే ముఖం సంతోషంగా వికసించింది . హైదరాబాద్ లో మాములు ప్రభుత్వ పాఠశాలల్లో నా చదువు . పూర్వ విద్యార్థుల సమావేశాలు జరుపుకొంటారు అని తెలియని కాలంలో నా చదువు . పత్రికల్లో పూర్వ విద్యార్థుల సమావేశాల గురించి చూసినప్పుడు మనకు అలాంటి అవకాశం లేదే అని కొంత నిరాశ .

కానీ ఆ పార్టీ అభ్యర్థుల మూడవ జాబితాలోని కొన్ని పేర్లు చూడగానే పూర్వ విద్యార్థుల సమావేశమంత ముచ్చటేసింది . డిగ్రీ చదువుకొనే రోజుల నుంచే జర్నలిజంతో సహవాసం కావడం వల్ల అప్పుడు విన్న , పరిచయం ఉన్న ఆ పేర్లు కొన్ని పాత జ్ఞాపకాలు తట్టి లేపాయి . పూర్వ విద్యార్థులు సమ్మేళనంలో చదువుకున్న రోజులు గుర్తుకు వచ్చినట్టు పాత జ్ఞాపకాలు కళ్ళ ముందు చకచకా కదిలాయి .

కరోనా తరువాత ఎవరు ఉన్నారో , ఎవరు ఏమయ్యారో తెలియదు .. అలాంటప్పుడు మనం మరిచిపోయిన కొందరు ఇంకా క్రియాశీలంగా ఉన్నారు అని తెలియడమే కాకుండా , వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అని తెలిస్తే ముచ్చటేయడం సహజమే కదా ? సాధారణ నాయకులే కాదు ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నాయకులు సైతం ఇంటికే పరిమితం అయిన తరువాత వారిని ప్రజలు మరిచిపోతారు . ఓడినా గెలిచినా నాయకులు జనాల్లో ఉంటేనే రాజకీయంగా సజీవంగా ఉన్నట్టు .

Ads

జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా , కేంద్రమంత్రిగా ఓ వెలుగు వెలిగారు . ఓడిపోయాక రాజకీయాలకు దూరంగా ఇంటికే పరిమితం అయ్యారు . అయన మరణించినప్పుడు రిపోర్టర్ గా సమాచారం కోసం ఇంటికి వెళ్ళాను . చడీచప్పుడు లేదు . అయన గురించి అడిగితే చెప్పేవారు దొరకలేదు . ఇంట్లో జలగం ఆత్మకథ గ్రంధం ఉంది . తీసుకువెళ్ళండి అని ఒకరు సలహా ఇస్తే … వార్త సాయిబాబా అప్పటికే బుక్ వెతుకుతుంటే నేనూ ఒకటి తీసుకున్నా .. అయన పోయారు అనే వార్త విని ఆయన ఉన్నారా ? ఎక్కడా వార్తల్లో కనిపించలేదేమబ్బా అనిపించింది .

*****

జర్నలిస్ట్ గ్రూప్ లో బిజెపి మూడవ జాబితా కనిపించగానే చదువుతుంటే కొన్ని పేర్లు చూసి మొదట అనుమానం వచ్చింది . తరువాత బిజెపి జాబితానే అని నిర్ధారణ చేసుకొని పేర్లు చదివి సంతోషించాను . చేవెళ్ల నుంచి రత్నం , అంబర్ పేట కృష్ణ యాదవ్ , జూబ్లీ హిల్స్ లంకల దీపక్ రెడ్డి , సికిందరాబాద్ మేకల సారంగపాణి ఇలా ఇంకా చాలా మంది పేర్లు ఉన్నా టీడీపీ కార్యకలాపాల్లో నగరంలో వీరి హడావుడి చాలా ఉండేది అప్పట్లో . దాదాపు రెండు దశాబ్దాల క్రితం వీరి హడావుడి కనిపించేది . తరువాత వీరు ఏమయ్యారో తెలియదు . హఠాత్తుగా వీరి పేర్లు చూసే సరికి ఎన్నికల్లో జయాపజయాలు ఎలా ఉన్నా .. క్రియాశీలంగా ఉన్నారు కదాని సంతోషం .

మేకల సారంగపాణి ఒకప్పుడు టీడీపీ నగరనాయకుల్లో ఒకరు . కార్పొరేటర్ స్థాయికి పరిమితం కాకూడదు శాసనసభ్యున్ని కావాలి అని ఆశ.. ప్రజారాజ్యం పెట్టగానే పోటీ చేసి ఓడిపోయారు . తరువాత ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నారో బీజేపీలో ఎప్పుడు చేరారో కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు బీజేపీ సికిందరాబాద్ అభ్యర్థి అయ్యారు .

చేవెళ్ల రత్నం ఎన్టీఆర్ వెన్నుపోటు సమయంలో జిల్లా పరిషత్ చైర్మన్… చివరి వరకు ఎన్టీఆర్ వర్గంలో ఉన్నారు . తరువాత కనిపించలేదు . లంకల దీపక్ రెడ్డి చివరి దశలో చేరినా హడావుడి ఎక్కువగానే ఉండేది .  తెలుగుదేశంలో కృష్ణ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగారు . హఠాత్తుగా మంత్రి వర్గం నుంచి బాబు తొలగించారు . ఎందుకో ఏ మీడియా రాయలేదు . ఎవరికీ తెలియదు . కొన్ని రోజుల తరువాత వేల కోట్ల రూపాయల తెల్గీ స్టాంప్ కుంభకోణంలో కృష్ణ యాదవ్ పాత్ర ఉందని అరెస్ట్ చేశారు .

ఓహో బాబుగారు మంత్రివర్గం నుంచి తొలగించింది ఇందుకా అని అప్పుడు తెలిసింది . జైలు నుంచి బయటకు వచ్చాక తిరిగి టీడీపీ కోసం కృష్ణ యాదవ్ బాగా ప్రయత్నించారు . చేరలేదు . తెలంగాణ ఏర్పడింది . టీడీపీ తన ప్రాభవాన్ని కోల్పోయింది . తరువాత తెరాసలో చేరారు . తెరాసలో ఉన్నారో లేరో అన్నట్టు ఉండేది . బీజేపీ మూడవ జాబితాతో మళ్ళీ తెరపైకి వచ్చారు . మాంసం తిన్నామని ఎముకలు మేడలో వేసుకొని తిరిగినట్టు అనే సామెతలా .. తెల్గీ నుంచి కృష్ణ యాదవ్ తిన్నది కొద్దిగానే ఐనా శిక్ష చాలా ఎక్కువగా అనుభవించారు అని ప్రచారం .

తెల్గీ కుంభకోణం బయటపడి , కృష్ణ యాదవ్ అరెస్ట్ అయ్యాక ఆయన వార్తలు పత్రికల్లో చందమామ కథల్లా కనిపించేవి . కృష్ణ యాదవ్ అంతకు ముందు ఏ జిల్లాలో తిరిగాడో ఆ జిల్లా నుంచి కథలు వచ్చేవి.. ఆ జిల్లాలో ఎవరెవరిని కలిశాడు , ఏం జరిగింది అని వార్తలు వచ్చేవి . తెల్గీ కన్నా ఎక్కువ శిక్ష పడింది యాదవ్ కే… మంత్రి పదవి పోయింది , జైలు జీవితం తప్పలేదు . రాజకీయ జీవితం ముగిసింది .

*******

మీడియాలో జోనల్ పేజీలు వచ్చాక ఏ జోనల్ నాయకులు ఆ జోనల్ పేజీలోనే కనిపిస్తున్నారు . ఇతర జోన్ లలో ఉండే పాఠకులకు వీరు ఉన్నారని తెలియదు . ఏ పార్టీలో ఎప్పుడు చేరారో తెలియదు . జోనల్ జీవితం వల్ల ఒక జోనల్ నాయకుల రాజకీయం ఇంకో జోన్ వారికి తెలియకుండా పోయింది . కనీసం ఎన్నికలవల్ల నైనా ఇప్పుడు  తెలుస్తోంది .

ఎన్నికల జాతర వచ్చినప్పుడు టికెట్ కోసం ప్రయత్నించేవారి పేర్లు పత్రికల్లో చదువుతుంటే వీళ్ళు ఇంకా రాజకీయాల్లో ఉన్నారా ? మరిచేపోయాం అనిపిస్తుంది . నాయకుల గురించి మీడియా ఇలా అనుకుంటే మీడియా వాళ్ళ గురించి నాయకులు కూడా ఇంకా ఉన్నారా ? అనే అనుకుంటారు . రాస్తూంటేనే జర్నలిస్ట్ జీవించి ఉన్నట్టు .. పోటీ చేస్తుంటే, .. రాజకీయాలు చేస్తుంటేనే రాజకీయ నాయకులు రాజకీయంగా జీవించి ఉన్నట్టు .. రచయితలు , సినిమా నటులు సైతం అంతే కలం వదిలేసి, నటన మానేసి అస్త్రసన్యాసం చేస్తే అంతే … – బుద్దా మురళి 

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions