Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పంటలకు పాత చీరెల రక్ష… అడవి పందుల బెడద నుంచి శ్రీరామరక్ష…

October 29, 2023 by M S R

Kandukuri Ramesh Babu ……. విను తెలంగాణ -4 ……. రెహమాన్ విజిటింగ్ కార్డు: చేనుకు కట్టే చీరలు అమ్మబడును…

నీళ్లు, నిధులు, నియామకాలు మాత్రమే కాదు, దశాబ్దాలుగా మనం అవలంబించిన అభివృద్ధి నమూనా కారణంగా కోతులు కూడా గ్రామాల్లోకి వచ్చి మనం పరిపరి విధాల ఇబ్బందులు పడుతున్నామని, ఆ బాధలు ఇంకా పెరుగుతాయని 2016లో రాసిన వ్యాసం “అభివృద్ధికి పుట్టిన కోతి”. అది గతంలో నమస్తే తెలంగాణలో అచ్చయింది. ఇప్పుడు చెబుతున్న అంశం అడవి పందుల గురించి. చీరల చాటున పొలాలను కాపాడుకుంటున్న రైతుల నిస్సహాయత గురించి, తద్వారా ఉపాధి పొందుతున్న రెహమాన్ ల గురించి. అలా పుట్టిన సరికొత్త విజిటింగ్ కార్డుల గురించి.

వనపర్తి జిల్లా పెబ్బేరులో జరిగే సంతలో ఈ ఉదయం రెహమాన్ ని కలిశాను. పశువులకు వాడే పగ్గాలు, తాళ్లు అతడు పదేళ్ల క్రితం అమ్మేవాడు. ఆ తర్వాత అడవి పందుల భారీ నుంచి తప్పించుకోవడానికి, పంటను కాపాడుకునేందుకు పొలం చుట్టూ రైతులు చీరల కంచెను ఏర్పాటు చేసుకోవడం అలవాటు పడ్డారు. కరెంట్ షాక్ ఇవ్వడం కూడా ఒక ఉపాయంగా వాడినప్పటికీ అది ఒక్కోసారి తమ ప్రాణాలని హరించి వేస్తున్నందున, చీరలను చుట్టూ కంచెగా వాడుకోవడం రైతాంగం మొదలెట్టారు.వారికి ఉపకారిగా మారిన రెహమాన్ న్ని కలిసాను ఈరోజు. పగ్గాల కన్నా రైతులకు ఇవే అత్యవసరమని గమనించడంతో ఆయన వృత్తి మరో మలుపు తిరిగింది.

Ads

చీరల రంగులు కాదు, వాటి వాసనే అడవి పందులకు పడదని, అంతకన్నా ముఖ్యం- ఎప్పుడైతే ఈ చీర సున్నితమైన పంది మూతిని తాకుతుందో ఇక ఆ పశువులు కనీసం 15 రోజులు పంటను ముట్టడానికి బెదురుతాయని, అందుకే రైతులు ఎకరాకు 50 నుంచి 60 చీరలు కట్టుతారని ఆయన వివరించారు. ఐదు మీటర్ల ఒక్క చీర 15 రూపాయలకు అమ్ముతామని, ఐదు ఎకరాల భూమి ఉన్నవారు నాలుగైదు వందల చీరలు కొనుగోలు చేస్తారని చెప్పారు. మొక్కజొన్న, వేరుశనగ పంటలు వేసేవారు అలాగే పత్తి కాయల సీజన్లో ఇలా చీరలు కొనుగోలు చేసి కడతారని, ఇదే తన ప్రధాన వ్యాపారమని, ఆయనకు అశోక్ లేలాండ్ గూడ్స్ వెహికల్ కూడా ఉందని రెహమాన్ వివరించారు. చూస్తుండగానే ఈ వ్యాపారంలో పదేళ్లు గడిచిపోయాయని నవ్వుతూ చెప్పారాయన.

old sarees

అడవి పందుల బెడద ఇప్పట్లో తీరేది కాదని, ఆ లెక్కన తమ వ్యాపారం కూడా ఇప్పుడప్పుడే ఆగిపోదని కూడా అన్నారాయన.  వివిధ గ్రామాలు పట్టణాల్లో పాత చీరలకు ప్లాస్టిక్ టబ్బులు ఇస్తామని, ఊరురా తిరిగి ఇలా సేకరిస్తామని, అలాగే అనాధ శరణాయలకు చీరలు ఇచ్చేవారు ఉంటారని, అక్కడి నుంచి కూడా తమకు చీరలు వస్తాయని, ఆ చీరలనే రైతులకు తాము విక్రయిస్తామని ఆయన తెలిపారు. తన మాదిరే ఇంకా చాలామంది వారానికి ఆరు రోజులు సంతలో ఇలా చీరలు విక్రయిస్తారని; బుధవారం దేవరకద్రలో, మంగళవారం ఎరిగిర, సోమవారం రాయచూరులో, గురువారం చిన్నంబావిలో, శుక్రవారం సెలవు తీసుకుని శనివారం పెబ్బేరులో, ఆదివారాలు వివిధ పల్లెల్లో తిరుగుతూ చీరలు అమ్ముతామని, ఇలా తాము జీవిక పొందుతామని రెహమాన్ వివరించి చెప్పారు.

పాత చీరెలు

నిజానికి పశువుల పగ్గాలను వదిలి చీరల బేరం చేస్తామని కలలో కూడా ఊహించలేదని ఆయన విచారంగానే అన్నారు. ఈ పని పై ఆధారపడి వారానికి నాలుగు వేల రూపాయల ఆదాయంతో కుటుంబాలను నెట్టుకొస్తున్నామని రెహమాన్ తెలిపారు. కాగా, రైతుల కడగండ్లు తెలిసినవారికి ఈ కథనం మానవసక్తికరమైనది (Human interesting story ) మాత్రమే కాదని, సీరియస్ అంశం గురించి అని అర్థమవుతుంది. గ్రామ జీవితానికి దూరంగా వెళ్లిపోయిన వారికి, అసలు గ్రామాలు అన్నా, రైతులు అన్నా ఏమిటో తెలియని కొత్త తరానికి ఈ స్టోరీ ఫన్నీగా కూడా అనిపించవచ్చు.

ఏమైనా, ఇలా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లోని రైతాంగం అడవి పందుల బారిన పడి, పొలాలని కాపాడుకునే ప్రయత్నంలో పాత చీరలపై ఆధారపడుతున్నారు. ఆ బేరంపై ఆధారపడి రెహమాన్ కూడా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అన్నట్టు, ఆయన ఇచ్చే ఈ విజిటింగ్ కార్డు తీసుకున్న రైతులు అవసరమైనప్పుడు ఫోన్ చేసి అతని కాంటాక్ట్ చేస్తారు. ఈయన నేరుగా వెళ్లి చీరలు డెలివరీ చేస్తాడు. కాకపోతే 15 రూపాయలకు ఇచ్చే చీర 17 రూపాయలు అవుతుంది. అంటే, రెండు రూపాయలు ఎక్కువ…. కందుకూరి రమేష్ బాబు… Samanyashastram Gallery

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions