నో పొయ్యి, నో పోపు, నో నూనె, నో కాయగూర, నో మసాలా, నో టైమ్ టేకింగ్… ఫాస్ట్‌గా ఉండాలి, నాలుకకు రుచి తగలాలి… ఇవి చెప్పేవాడే చెఫ్ అంటే… దిక్కుమాలిన వంటలు ఎన్ని ఉంటేనేం యూట్యూబులో..?! 20, 30 దినుసులు, బోలెడంత టైమ్, ప్రయాస అవసరమయ్యే వంటలు ఎవడైనా చెబుతాడు… ఎన్నో ఏళ్లుగా మన పెద్దల కడుపులు నింపిన పాత వంటల్ని పరిచయం చేసి, చిట్కాలు చెప్పి, చేసి చూపించేవాడే నిజమైన యూట్యూబ్ చెఫ్…
హలో ఫ్రెండ్స్… అని మొదలుపెట్టి, నానా కంగాళీ వంటలు చెబుతుంటారు… చేతికి అందిన ప్రతి చెత్తను వేసేస్తుంటారు… మొన్న చెప్పుకున్నాం కదా, పెండా బెల్లం కలిపేసి, ఒరిజినల్ టేస్ట్ ఏమిటో తెలియకుండా, కలగూరకంపు చేసి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి, కామెంట్ పెట్టండి అంటూ రిక్వెస్టులు… ఆమధ్య మనం ఓ పచ్చడి గురించి చెప్పుకున్నాం… గుర్తుందా..? స్టవ్వు వెలిగించే పనిలేదు, కూరగాయల్లేవ్, నూనె లేదు, మసాలాల్లేవ్, పోపు అసలే లేదు… ఫాస్ట్ అండ్ టేస్టీ…
అలాంటి డిషుల్లో ప్రధానంగా చెప్పుకునేది పచ్చిపులుసు… నిజానికి దీన్ని తెలంగాణ వంటకం అంటారు గానీ, ఆంధ్రాలో, తమిళనాడులో కూడా చేస్తారు… కాకపోతే కాస్త వేర్వేరుగా… చెన్నై యూట్యూబర్ ఒకావిడ మరీ అరటిపండు పచ్చిపులుసు చూపిస్తోంది… వంకాయ పచ్చిపులుసు అని ఒకరు, ఇరవై దినుసులతో పచ్చిపులుసు మరొకరు, టమాటా పచ్చిపులుసు అని ఇంకొకరు… ఎవరి ఇష్టం వాళ్లు… నిజానికి ఇది అత్యంత వేగంగా, సమయానికి ఇంట్లో ఏమీ లేకపోయినా చేసుకునే వంటకం…
Ads
ఇంట్లో సమయానికి ఏ కూరగాయ లేదు, పొయ్యి వెలిగించి కూరలు, సాంబార్లు చేసే ఓపిక లేదు, ఆకలవుతోంది… ఎంతసేపూ అవే ఊరగాయలు, అవే పొడులా..? ఎలా..? అన్నం కుక్కర్‌లో పడేస్తే అదే ఉడికించి పెడుతుంది… వెతికితే కాస్త పెరుగు ఫ్రిజ్జులో దొరక్కపోదు… మరొకటి కావాలి ఎలా..? అదే పచ్చిపులుసు… కడుపు సాఫ్ చేస్తుంది, నాలుకకు భలే తగుల్తుంది…
ఏ రాత్రో ఇల్లు చేరారు, లేదా ఒంట్లో నలతగా ఉంది, మీరొక్కరే ఉన్నారు… ఫోన్ తీసుకుని స్విగ్తీ, జొమాటో వెతక్కండి, ఆ మసాలా వంటలు తినీ తినీ బోర్ రావడం లేదా..? సో… పర్లేదు, ఫ్రిజ్జు ఓపెన్ చేయండి, రెండోమూడో మిరపకాయలు దొరుకుతయ్… చాలు… బయట ఏదో స్టోర్ స్పేస్‌లో రెండు ఉల్లిగడ్డలు, ఓ చిన్న వెల్లుల్లి గడ్డ ఉన్నాయా..? వోకే… కాస్త చింతపండు తీసుకొండి, నానేయండి… ఉల్లిగడ్డల్ని చకచకా నరకండి, సారీ, కట్ చేయండి… వెల్లుల్లి రెబ్బల్ని కాస్త చేతితో చిదమండి, మిరపకాయల్ని కాస్త చేతికి వచ్చేలా ముక్కలు చేయండి… సరిపడా ఉప్పు సరేసరి… అంతే…
ఆ యూట్యూబ్ వీడియోల్ని చూస్తే… మిరపకాయల్ని కాల్చండి అంటారు ఒకరు, ఎండుమిర్చిని కాల్చండి అని మరొకరు… అక్కర్లేదు… పోపు అంటారు, చాలామంది అసలు పోపు పెట్టుకోరు… చింతపండు రసంలో కాసిన్ని నీళ్లు పోసి, తరిగిన ఉల్లిగడ్డల్ని, చిదిమిన వెల్లుల్లి రెబ్బల్ని, మిర్చి ముక్కల్ని వేయండి… మంచిగా పిసకండి… అంటే ప్రతి ఉల్లి, వెల్లుల్లి, మిర్చి ముక్కలకు చింతపండు ఫ్లేవర్ పట్టాలి… పులుపు, కారం, ఘాటు… ఇంకేం కావాలి..? ఉప్పు కాస్త వెనకాముందు చూసుకుని వేసుకొండి… ఐనా ఏముందిలే, ఎక్కువైతే మరిన్ని నీళ్లు… అంతే…
కాస్త ఓపిక ఉంటే పోపు, అది కూడా ఏవేవో వేసేయకండి… చిటికెడు ఆవాలు, మరో చిటికెడు జిలకర, కాసింత నూనె… చాలు… వేడి అన్నంలోకి కలుపుకుని, కుమ్మేయండి… ఫ్రిజ్జులో కాస్త కొత్తిమీర కనిపిస్తుందేమో చూడండి, అది కూడా వేసేయండి… ఇక చాలు… అసలు పచ్చి పులుసు అంటేనే పచ్చిదనం… దాన్ని చెడగొట్టకండిరా యూట్యూబ్ వీర చెఫ్ఫులూ…!! మొన్న చెప్పానుగా… మంచి వంట అంటే మనం పాత రోజుల్లోకి పోవాలి..!
Share this Article