.
భర్త మహాశయులకు విజ్ఞప్తి… ఇది ఓ సినిమా పేరు… హీరో రవితేజ… నిన్న ఓ ప్రమోషనల్ పాట వదిలారు… ఆశిక, డింపుల్‌లతో ఎప్పటిలాగే ఎగురుతున్నాడు… తనకు అలవాటైన స్టెప్పులేవో… వామ్మో వాయ్యో ఒల్లింకలో అనే పాట అది…
కానీ ఆ పాట ఎప్పుడో వింటున్నట్టే ఉంది, ఎక్కడబ్బా అని ఆలోచిస్తుంటే హఠాత్తుగా తట్టింది… అప్పుడెప్పుడో ఐదారేళ్ల క్రితం యూట్యూబ్‌లో రిలీజ్ చేయబడింది… సింగర్ స్వాతి రెడ్డి సాంగ్… ఐదేళ్లలో జస్ట్ 17 వేల వ్యూస్…
Ads

ఆమె తెలుసు కదా… ఆస్కార్ రేంజ్ సాహిత్యంతో ‘జామ చెట్టుకు కాస్తాయి జామకాయలు, మామిడి చెట్టుకు మామిడి కాయలు’ అనే పాటతో శ్రోతలు, ప్రేక్షకులను విభ్రమలోకి, అదోరకం హాహాశ్చర్యంలోకి పడేసిన సింగర్… ఆ పాట కూడా ఏదో తెలుగు సినిమాలోకి వచ్చేసి, తెలుగు సినిమా స్థాయిని పదీపదిహేను మెట్లు ఎక్కించింది, అది వేరే కథ…
సేమ్, ఒల్లెంకలో పాటనూ కొనేసి, రవితేజ సినిమాలోకి తెచ్చేసినట్టున్నారు… సింగర్ ఇప్పుడూ స్వాతి రెడ్డే… మహాతల్లి కొన్ని పదాల ఉచ్ఛారణ వింటుంటే ‘శివాజీ భాష’ గుర్తొచ్చేస్తుంది.,. ఇంతకీ పాట మకుటపదాలు వాయ్యో వాయ్యో ఒల్లెంకలో, సొల్లెంకలో అంటే ఏమిటీ అంటారా..? భలేవారే, తెలుగు పాటలో పదాలకు అర్థాలేముంటాయి..? జస్ట్, వినాలి, అంతే… ఫీల్, ట్యూన్, టోన్, ఎగురుడే… పైగా శేఖర్ మాస్టర్ ష్టెప్పులు…
అసలు ఈ ఒల్లెంకలో సొల్లెంకలో మాత్రమే ఈమధ్య బీభత్సంగా హిట్టయిన ‘బాయిలోనా బల్లి పలికె’ పాట మకుటమూ అంతే కదా… బాయిలోన బల్లి ఎందుకు పలికిందో, ఆ వాక్యానికి అర్థమేమిటో అంతుపట్టదు… పైగా అది ఏదో సూపర్ హిట్ సాంగ్‌కు కాపీ ట్యూన్ అట… సోషల్ మీడియాలో ఆ వీడియోలు కూడా పెట్టేస్తున్నారు తెలుగు సాంగ్స్ ఫ్యాక్ట్ ఫైండర్స్…

ఇవన్నీ మననంలోకి వస్తుండగానే రీసెంటుగా రవితేజ తెలుగు సినిమా సాహిత్యానికి చేస్తున్న సేవ గుర్తొచ్చింది చకచకా… వరుసగా ఫ్లాపులతో ఏదో ఫ్రస్ట్రేషన్, ఏదో కసితో రెచ్చిపోతున్నాడు… ఆమధ్య శ్రీలీలతో నీయమ్మని, నీయక్కని, నీ చెల్లిని అని ఓ వెగటు గీతాన్ని పాడుతూ, స్టెప్పులేస్తూ చెమట చిందించాడు కదా…
నీయమ్మని, నీయక్కని, నీతల్లిని… ఈ డర్టీ సాంగ్‌కు సిగ్గూశరం లేని సమర్థన..!!
పైగా సిగ్గూశరం లేకుండా సుమ ఇంటర్వ్యూలో సమర్థించుకున్నాడు… ఆ డర్టీ పదాల్లో అశ్లీలత లేమీ లేదట, మన సహజభాషలో భాగమేనట, ఇంగ్లిషులో కూడా ఈ ధోరణి సహజమేనట… పిచ్చిది శ్రీలీల కూడా ఈ సాంగ్ ఆప్ట్ అని ఏదో సమర్థించుకుంది… ఆమె ఏం తక్కువ తిందా…? కట్టు లేని పిట్టను నేను… జీడిపప్పు జాడీని నేను… అంటూ తను కూడా నీ అయ్యని, నీ అబ్బని పట్టుకునీ అని రాగం తీస్తుంది అందులో…

అన్నట్టు… ఇదే హీరో గారు ఈ పాటలో ఓచోట పాడతాడు… బుద్ది లేదు, జ్ఞానం లేదు, సిగ్గు లేదు, శరం లేదు, మంచి లేదు, మర్యాద లేదు… నిజం… ఏవీ లేవు ఈ పాటలో… పాటకు బాధ్యుల్లో… రవితేజ పాటలే కాదు, తెలుగు సినిమా సినిమా సాహిత్యమే అలా ‘‘ఒల్లెంకలో సొల్లెంకలో’’ అని పాడుతూ… పంకిల ప్రస్థానంలో రోత బురదలో పడి జారిపోతూనే ఉంది..!!
Share this Article