కరోనాతో పెరిగిన మద్యం కిక్కు! కాపురాల్లో చిచ్చు!!
————————
“తాగితే మరిచిపోగలను- తాగనివ్వదు;
మరిచిపోతే తాగగలను- మరవనివ్వదు;
మనసు గతియింతే మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ సుఖము లేదంతే…
కరోనా వస్తే మరలిపోదు;
మందువేసుకున్నా మరిచిపోదు;
వైరస్ ఉంటే మాసిపోదు;
ఐసొలేషన్లో ఉన్నా కునుకుపడదు…
Ads
అంతా కోవిడనే తెలుసు;
అదీ ఒక మాయేనని తెలుసు;
తెలిసీ తిరిగీ విలపించుటలో
తీయదనం ఎవరికి తెలుసు?
మరుజన్మ వున్నదో లేదో?
ఈ వైరస్సులప్పుడేమవుతాయో?
మనిషికి వైరస్సే తీరని శిక్ష!
దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష!!”
అని పాడుకుంటూ కరోనా టైమ్ లో జనం తెగ తాగేస్తున్నారట. ఇప్పటికే తాగుడు అలవాటు ఉన్నవారు లాక్ డౌన్లో రెండు పెగ్గులు ఎక్కువ తాగుతున్నారట. లాక్ డౌన్లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నవారిలో ముప్పయ్ శాతం మంది కొత్తగా మందు తాగడం అలవాటు చేసుకున్నారట. మద్యం ఒక్కటే కాకుండా ఇతర మాదకద్రవ్యాల వాడకం కూడా బాగా పెరిగిందట. కరోనాకు మందు లేదు కానీ- మందుకు ఢోకా లేదు.
———————–
దేశవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ మొదట్లో బాగానే ఉన్నా- రానురాను రాజు గుర్రం గాడిదయినట్లు- ఇళ్లల్లోనే ఉంటూ పని ఒత్తిడి తట్టుకోలేక- డిప్రెషన్ పెరిగి, ఆ అసహనమంతా ఇంట్లో వాళ్ల మీద ప్రదర్శిస్తున్నారట. శ్రుతి మించి భౌతికదాడులు చేస్తున్నారట. జూమ్ వీడియో సమావేశాల్లో సహచర ఉద్యోగులను నానా బూతులు తిడుతున్నారట.
ఒక అధ్యయనం ప్రకారం కరోనా లాక్ డౌన్ మొదలయిన క్షణం నుండి-
1 . మద్యం అమ్మకాలు పెరిగాయి.
2 . మద్యం చాలక మాదకద్రవ్యాలు కూడా అలవాటయ్యాయి.
3 . గృహహింస పెరిగింది.
4 . మానసిక ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి.
5 . నిరాశ, నిస్పృహలు పెరిగాయి.
6 . ఉద్యోగ భద్రత గాల్లో దీపమయ్యింది.
7 . ఆర్థిక సమస్యలు పెరిగాయి.
8 . కాపురాల్లో కరోనా చిచ్చు పెట్టింది………. By…….. పమిడికాల్వ మధుసూదన్
Share this Article