.
ఇప్పుడు కాంగ్రెస్ మన్మోహన్ సింగ్‌ను ఆహా ఓహో అని ఓన్ చేసుకుంటోంది… కీర్తిస్తోంది… అక్కడికి తననేదో స్వేచ్ఛగా పనిచేయనిచ్చినట్టు..!
తనను జస్ట్ ఓ హెడ్ గుమస్తాగా మాత్రమే కదా సోనియా కుటుంబం తనను ట్రీట్ చేసింది… తనకు పీవీ గురువే అయినా సరే, పీవీకి ఉన్న ఆత్మాభిమానం మన్మోహన్‌కు లేదు కాబట్టి, అవమానాల్ని తుడిచేసుకుంటూ కాలం గడిపాడు…
Ads
అప్పట్లో యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని అప్పటి మీడియా సలహాదారు సంజయ్ బారు ఓ పుస్తకం రాశాడు… అందులో సోనియా చేతిలో తను ఎలా రిమోట్ ప్రధానిగా వ్యవహరించాడో రాశాడు… మన్మోహన్ బాధపడ్డాడు, చరిత్ర తనను ఇలా గుర్తుంచుకుంటుంది అనుకోలేదు…
ఈమధ్య అనుపమ్ ఖేర్ ప్రధాని మన్మోహన్‌లా నటించిన యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమాలోనూ అంతే… నా మెంటార్, నా మార్గదర్శి అని ఇప్పుడు పొగుడుతున్న ఇదే రాహుల్ గాంధీ గతంలో తనను ఎంత అవమానించాడో ఓసారి చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది… సందర్భం కాబట్టి…
లాలూకు జైలు శిక్ష పడింది… తన పార్లమెంటు సభ్యత్వాన్ని అనర్హత నుంచి కాపాడటానికి యూపీఏ ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ తెచ్చింది… తమ భాగస్వామి కదా… ఏదైనా కేసులో దోషిగా నిరూపితుడై, రెండేళ్లకు పైగా శిక్షపడితే ఆటోమేటిక్‌గా పార్లమెంటు సభ్యత్వం రద్దయ్యే నిబంధనల నుంచి రక్షించే ఆర్డినెన్స్ అది… అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా వోకే అనేశాడు…
ఆ పదేళ్లు సోనియాయే కదా వర్కింగ్ ప్రధాని, బినామీ ప్రధాని… సర్వం… ఆమె చెప్పింది, మన్మోహన్ చేశాడు… అంతే… దానిమీద బోలెడు విమర్శలు… దాన్ని సమర్థించడానికి అప్పటి కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు… అనుకోకుండా అక్కడికి రాహుల్ గాంధీ వచ్చాడు…
చింపి పడేయాల్సిన ఆర్డినెన్స్ అంటూ ఆ ఆర్డినెన్స్ కాపీలను తీసుకుని అక్కడే చింపేశాడు… భావి ప్రధానిగా కాంగ్రెస్ చూపించే ఓ అపరిణత యువరాజు బాల్యచాపల్యం అది… ఎక్కడో అమెరికా పర్యటనలో ఉన్న మన్మోహన్‌కు అది షాక్… అక్కడ మీడియా ప్రశ్నలకు బదులు ఇవ్వలేక సతమతం…
ఆర్డినెన్స్ కాలపరిమితి అయిపోయినా సరే, బిల్లు పెట్టవద్దనీ, అది కాంగ్రెస్‌కు మంచిది కాదని, నెగెటివ్ సంకేతాలు జనంలోకి వెళ్తాయని మన్మోహన్‌కు చెబితే సరిపోయేది… అదేమీ బిల్లుగా ప్రవేశపెట్టబడలేదు, చట్టం కాలేదు కదా… కానీ తన దుందుడుకు చర్యతో ఇజ్జత్ తీసేశాడు రాహుల్… ఇప్పటికీ తన తత్వం అలాగే ఉంది…
అప్పుడు ప్రధానిగా ఆత్మాభిమానం ఉన్న ఏ ప్రణబ్ ముఖర్జీయో, పీవీయో ఉన్నట్టయితే కథ వేరే ఉండేది… కానీ మన్మోహన్ కదా… రాజీనామా చేయలేదు, కిమ్మనలేదు… భరించాడు… దారితప్పిన మనమడిని క్షమించినట్టుగా రాహుల్‌ను క్షమించేశాడు… కానీ గుమస్తా ప్రధాని అనే ముద్ర మరింత బలంగా పడింది తన మీద…!!
Share this Article