జయంతి అనగానే మనకు బోల్డు మంది ముసలి హీరోలకు తల్లి పాత్రలు వరుసగా కనిపిస్తాయి కానీ… అసలు అరవై, డెబ్బయ్ దశకాల్లో కన్నడ, తెలుగు, తమిళ, మళయాళ, మరాఠీ, హిందీ సినిమాల్లో చాలామంది సీనియర్ నటుల పక్కన రెగ్యులర్ హీరోయిన్ వేషాలు వేసింది ఆమె… అసలు ఆమె నటించిన మిస్ లీలావతి అప్పట్లో ఓ సెన్సేషన్… అందులో ఆమె పోషించిన పాత్ర… కాస్త రెబల్ టైప్… ప్రిమారిటల్ శృంగారం, పెళ్లి అనేది ట్రాప్ వంటి భావాల్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించే పాత్ర… అంతేకాదు, అప్పట్లోనే హాఫ్ స్కర్టులు, జీన్స్, టీషర్టులతో నటించి అప్పటి యువతను ఉర్రూతలూపేసింది… పైగా స్విమ్ సూట్ కూడా… అసలు ఓ దక్షిణ నటి స్విమ్ సూట్లో నటించడం, అదీ 1965 ప్రాంతంలో అంటే ఊహించుకొండి… మనం పదే పదే కన్నడనటి అని ప్రస్తావిస్తాం గానీ… తమిళం, తెలుగు సినిమాల్లోనూ ఆమె పోషించిన పాత్రలు ఎక్కువే…
కాకపోతే తెలుగులో సాత్విక పాత్రలే ఎక్కువ… మాయదారి మల్లిగాడు సినిమాలో మాత్రం ఆమె పాత్ర చాన్నాళ్లు గుర్తుంది… ప్రత్యేకించి మల్లెపందిరి నీడలోన జాబిల్లీ పాట… ఆమెను భిన్నంగా చూస్తాం… హీరోహీరోయిన్ల శృంగారాన్ని ఇంకెవరో ఊహించుకుంటూ పాడటం అప్పట్లో ఓ ప్రయోగమే… పైగా మంచి ట్యూన్, మంజుల సరేసరి… ఆమె జన్మస్థలం శ్రీకాళహస్తి అంటారు కొందరు, కానీ ఆమె బళ్లారి అనే చెప్పుకునేది, అసలు పేరు కమలకుమారి… చిన్నప్పుడే చెన్నై చేరింది ఆ కుటుంబం, జయంతి తల్లికి ఈమెను సినిమా తెర మీద చూడాలని కోరిక… అప్పట్లో ఎన్టీయార్ చిన్నపిల్లగా ఉన్న ఈమెను ఒడిలో కూర్చోబెట్టుకుని ముచ్చట్లు చెప్పేవాడనీ, చాలామందికి పరిచయం చేసి, సినిమాల్లో అవకాశాలు ఇప్పించాడనీ అంటారు… ఏ భాషలో నటించినా ఆమే సొంతంగా డబ్బింగ్ చెప్పుకునేది… బోలెడు జాతీయ అవార్డులతో సెవెంటీస్లో హవా చెలాయించింది… ప్రత్యేకించి కన్నడ రాజకుమార్, ఆమె పెద్ద హిట్ పెయిర్… పేరుకు తెలుగు, తమిళంలో బోలెడు సినిమాలు చేసినా ఆమెకు మంచి అవార్డులు తెచ్చిపెట్టినవీ, అభినయ శారదె బిరుదునూ ఇచ్చి గౌరవించుకున్నదీ కన్నడ సినిమాయే…
Ads
సంపాదించుకునే వయస్సులో బోలెడు కీర్తిని, డబ్బును సంపాదించుకుంది… కానీ జీవితం పట్ల, కెరీర్ పట్ల సరైన ప్లానింగు లోపించింది… పైగా దాదాపు మూడు దశాబ్దాలు పీడించిన ఆస్తమా… నటుడు, దర్శకుడు పేకేటి శివరాంను పెళ్లి చేసుకుంది… ఎక్కువకాలం నిలవలేదు… తరువాత బండారు గిరిబాబు అనే ప్రొడక్షన్ మేనేజర్ తనను పెళ్లిచేసుకుంటానని నమ్మించి, తిప్పుకుని, రెండు సినిమాలు కూడా ఆమెతో తీయించాడు… పెళ్లి చేసుకున్నా సరే, ఆమె దగ్గర డబ్బు హారతి కర్పూరమయ్యాక, ఇక ఈమె వేస్ట్ అనుకుని వదిలేశాడు… పేకేటి శివరాం ద్వారా కలిగిన కొడుకు పెద్దగా ప్రయోజకుడు కాలేదు… తన కోసం ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ కూడా పెట్టింది… ఎవరో అనుపమ అనే నటి మాయలో పడి, ఒకటీరెండు సినిమాలు కూడా తీసి, అమ్మ డబ్బును ఖర్చుపెట్టేశాడు, ఆమెనే పెళ్లిచేసుకున్నాడు అంటారు సీనియర్ జర్నలిస్టులు… తరువాత తనకన్నా చాలా చిన్నవాడైన రాజశేఖర్ అనే నటుడిని నమ్మింది… రెండు సినిమాల్ని ఈమెతో తీయించి, తరువాత తనూ మోసం చేశాడు… పాపులర్ లీడర్ రామకృష్ణ హెగ్డే ఆమె అభిమాని, రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు ఆమెను… ఒకసారి ఏదో స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయింది కూడా… పెద్ద తెరపై అనేక తల్లి పాత్రలు పోషించిన ఆమెది నిజానికి చిన్నపిల్లల తత్వం… అందుకే చాలామంది ఆమెను మోసగించగలిగారు…!!
Share this Article