Sankar G ………. తెలుగుసినిమా ఇండస్ట్రీలో రచయిత అనేవాడు అంతరించినట్టేనా… సీనియర్ సముద్రాల, గోపీచంద్, తాపీ ధర్మారావు, పింగళి నాగేంద్ర, డీవీ నరసరాజు, మల్లాది రామకృష్ణ, అనిశెట్టి, ఆరుద్ర, ఆత్రేయ, ముళ్ళపూడి రమణ, శ్రీశ్రీ, దాశరధి, సినారె, సత్యానంద్, జంధ్యాల, పరుచూరి బ్రదర్స్, ఎంవీస్ హరినాధ్ రావు, గణేష్ పాత్రో, ఆదివిష్ణు… చెప్పాలంటే ఇంకా చాలామంది రచయితలు వీరి మాటల కోసం, పాటల కోసం వేచివుండే రోజులవి.
దానవీర శూర, కర్ణ, ముత్యాలముగ్గు, ప్రతిఘటన లాంటి చిత్రాల పాటలకన్నా డైలాగుల రికార్డులు, క్యాసెట్లు ఎక్కువగా అమ్ముడయ్యేవంటే ఇప్పటి జనాలు నమ్మలేకపోవచ్చు. అందుకే అవి చిత్రసీమకు స్వర్ణయుగపు రోజులు అనేవారు. శతదినోత్సవాలే కాదు సిల్వర్ జూబిలి, గోల్డెన్ జూబిలి, డైమండ్ జూబిలిలు కూడా జరిపేవారు. ఇప్పటికీ వారి మాటలు, పాటలు చెవుల్లో మారుమ్రోగుతుంటాయి. అప్పటి వారు పండితులు, కవులు, గాయకులు కూడా…
మరి ఇప్పుడు రచయిత అంటే ఎవ్వడు… ఏ ఇంటర్ చదివిన, లేదా ఇంగ్లీష్ మీడియం చదివినవారు డైరెక్టర్స్. వీరికి తెలుగు సాహిత్యం పట్ల పరిచయం ఉండదు, కనీసం తెలుగు నవలలు అయినా చదివి ఉండరు. పొట్ట కొస్తే అక్షరం తెలుగు భాషాజ్ఞానం ఉండదు. ట్యాగ్ మాత్రం కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ వీరే వేసుకుంటారు. డైలాగులంటే వీరి దృష్టిలో పంచ్ డైలాగ్స్ అది హీరో మాత్రమే వేయాలి.
Ads
కమెడీయన్లు పంచ్ దెబ్బలో చెంప దెబ్బలో తింటూ ఉండాలి, విలన్లయితే మొదట భారీ బిల్డప్ డైలాగులు, హీరో రాగానే మిడిగుడ్లేసుకుని గుటకలు మింగటం. ఇక హీరోలయితే మొత్తం డైలాగులు, ప్రవచనాలు, తొడకొట్టే డైలాగులు, మీసం తిప్పే డైలాగులు, కామెడీ డైలాగులు, పంచ్ డైలాగులు, తెలివైన డైలాగులు అన్నీ వీరికే.
ప్రవచనాలను మెసేజ్ లుగా చెప్పించి, పాతకాలపు జోకులను సీన్లు గా మలిచి, హాలీవుడ్ కామెడీ సీన్లు కాపీ కొట్టేవాడు మాటల మాంత్రికుడు. సోషల్ మీడియా తిరిగే మెసేజ్ లను డైలాగులుగా మలిచే బుర్ర లేని రచయిత ఇంకొకరు, హీరో విలన్ల కొంపలో చేరి అడ్డమైన కామెడీ రచ్చ చేసే డైలాగులు రాసే కోనలు కొందరు. వీళ్ళా రచయితలు. ఇదివరకు సందర్భానికి సంభాషణలు రాసేవాళ్ళు ఇప్పుడు సంభాషణలకు సందర్భాలు క్రియేట్ చేస్తున్నారు. పైగా వీళ్ళకి కోట్ల సంతర్పణ.
మరి కాస్తో కూస్తో అక్షరజ్ఞానం ఉండి కొత్తగా వచ్చే రచయితల పరిస్థితి ఏమిటి… కొత్తగా వచ్చే రచయిత అన్నవాడికి కనీస మర్యాద ఉండదు. దర్శకుడి టీంలో చేరి మాటలు వండుతూనే ఉండాలి. మంచి డైలాగులు పడితే అవి దర్శకుడి అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. ఆఫీస్ బాయ్ కి ఎక్కువ అసిస్టెంట్ డైరెక్టర్ కి తక్కువ అన్నట్టు ఉంటుంది వీరి పరిస్థితి. అందుకే ఎవరైనా నిర్మాతతో పరిచయం ఏర్పడితే డైరెక్టర్ గా అవతారం ఎత్తటానికి సిద్ధంగా ఉంటారు. ఏళ్ల తరబడి వేచిచూసి అవకాశల్లేక ఇంటికెళ్లిపోయేవారు ఇంకొందరు. ఒక పింగళి, ఒక ఆత్రేయ, ఒక డీవీ నరసరాజు, ఒక జంధ్యాల, ఒక mvs హరినాధరావు, ఒక గణేష్ పాత్రో లాంటి రచయితల డైలాగులు మళ్ళీ మనం వినలేము, ఆ టాలెంట్ ఉన్నవాళ్లు కూడా లేరు…
Share this Article