అప్పుడప్పుడూ ఏవో వంటలు, రెసిపీల గురించి ఏదో గీకుతారుగా… మానేశారేం, పర్లేదు చదివేట్టే ఉంటయ్, కానీ ఏమైంది అన్నాడు ఓ మిత్రుడు వెక్కిరింపు, బెదిరింపు, వ్యంగ్యం గట్రా మొత్తం కలిపి డీప్ ఫ్రై చేసినట్టు…! పోనీ, ఓ మాంచి మంచింగ్ టిప్ పెట్టు, ఎప్పుడైనా కలిసినప్పుడు రుణం ఉంచుకోను అని కూడా ఓ నోరూరించే మంచి లంచమాఫర్ కూడా ఇచ్చాడు… ఈమధ్య ఓ రిటైర్డ్ డాక్టర్ గారికి ఒకటి ఇలాంటిదే చెప్పాను… రెండు ముక్కలు శాంపిల్ చూపించాను… తిన్నాడు… ఇంట్లో స్వయంగా చేశాడు… హబ్బ, మా పిల్లలు భలే ఎంజాయ్ చేశారు బ్రో అన్నాడు… హమ్మయ్య… పర్లేదు, తిట్టిపోస్తాడేమో అనుకున్నా… ఐనా తెల్లారిలేస్తే సవాలక్ష యూట్యూబ్ వంటల వీడియోల్లో మనల్నెవడు పట్టించుకున్నాడు అంటారా..? కాదు, సరదా టైంపాస్, మంచింగ్ స్నాక్స్ జోలికి ఏ యూట్యూబ్ వంటగాడు ఆర్ వంటగత్తె పోదు… అదేదో అపవిత్రమైన కార్యం అనుకుంటారు… వాళ్లు అలా అనుకోవడమే మంచిది, వాళ్లు ఈమధ్య మరీ తెలుగు టీవీ సీరియల్స్, సినిమాల్లాగా ఫార్ములా వంటల్లోకి వెళ్లిపోయారు…
ఇంతకీ ఈ సోది ఎందుకంటే… ఈ వంట ఏమిటంటే… నో, నో, వంట అనే పెద్ద పదం అసలు అక్కర్లేదు… అసలు ఇదీ వంటేనా అంటారు చదివాక… అసలు అవేకదా ఈరోజుల్లో అందరికీ కావల్సినవి… లక్షాతొంభయ్యారు ఇంగ్రెడియెంట్స్, బోలెడు ప్రయాసతో రుచీపచీ లేని చెత్తా వంటలే కదా ఈరోజుల్లో యూట్యూబ్ ట్రెండ్… సరే… ఓ పని చేయండి… ఈసారి మార్కెట్ వెళ్లినప్పుడు మాంచి లేత బెండకాయలు తీసుకొండి… ఛిఛీ, జిగట, వాటిని ఎలా వండినా అదే జిడ్డు అని అలా తేలికగా తీసిపారేయకండి… బెండ, ఓక్రా, లేడీస్ ఫింగర్… మధుమేహానికి మంచిది, బరువు తగ్గడానికి మంచిది, కొలెస్ట్రాల్ అంతుచూసేది కూడా అదే… అంతేకాదు, ముందే చెప్పుకున్నాం కదా… వేడి వేడి అన్నంలో సాంబారు కలుపుకుని తింటున్నా, గడ్డ పెరుగు వేసుకుని భోజనం ముగింపుకి వచ్చినా, అంచుకు… అదేనండీ ఆధరువు కోసం ఈ స్నాక్స్ మస్త్ మస్త్ ఆప్ట్…
Ads
ఆ లేత బెండకాయల్ని జస్ట్ కడగండి… మిరపకాయ బజ్జీల కోసం మిర్చిలను నిలువునా ఓ కోత పెట్టి, విత్తులన్నీ తీసేస్తాం కదా… అలాగే ఈ బెండ కాయల్ని కూడా ఆ కోత కోయండి… విత్తులున్నా పర్లేదు, ప్రకృతికి తెలియదా ఏం..? మనకు ఏం ఇవ్వాలో…! కాస్త ఆ చీలికను వెడల్పు చేసుకుని, ఇంట్లో ఉన్న ఊరగాయ…. అది కట్ మ్యాంగో కావచ్చు, ఇతర సోగి, అంటే ఏ ఆవకాయ ఐనా పర్లేదు… కాస్త చేతులతో ఆ చీలికలో కొంచెం పూయండి… మసాలా కూరినట్టు కూరకండి, అది అసలే ఊరగాయ, ఎక్కువైతే బీపీ పేషెంట్లకు ప్రాబ్లం… చేశారు కదా, ఓ ప్యాన్ తీసుకుని మీకు తోచిన నూనె కాస్త పోయండి… కాదు, చిలకరించండి… మనం ఇప్పుడు ఒబెసిటీ థింకింగులో ఉన్నాం కదా… ఈ బెండకాయల్ని పేర్చండి… జిగట, గిగట జాన్‌దేవ్ బాసూ… అన్నీ పోతయ్… No Onion, No Lemon Juice, No Oil, No Time Taking, No too many ingredients, No Work, No So many cooking material…. ఆమ్లెట్ వేయడానికైనా బోలెడంత తంతు… దీనికి అదేమీ లేదు కూడా…
ఒకేసారి పెద్ద మంట పెట్టేసి కాల్చేయకండి, స్టవ్ సిమ్‌లో పెట్టి కాస్త తాపీగా కాలనివ్వండి… అవసరమైతే అటూఇటూ కదల్చండి… మాడనివ్వకండి… మూతలు, తిరగమోతలు కూడా ఏమీ వద్దు, ఆ పొగ అలా పైకి వెళ్లిపోనివ్వండి… మసాలాలు అసలే వద్దు, ఇంకేమీ దానిపై చల్లొద్దు, చేతికి ఏదొస్తే అది కలపకండి… ఆ పిచ్చి యూట్యూబ్ వంటలు చూసి, దాని మీద టమాటా ఫ్యూరీ, సోయా సాస్, వెనిగర్ గట్రా ప్రయోగించకండి… మనం చాలా సింపుల్ రెసిపీ కదా చెప్పుకునేది… బెండ, సోగి… అంతే… ఇక కాసేపాగి స్టవ్వు కట్టేయండి… మంచింగ్ సరే… వేడి అన్నంలోకి చల్ల మిరపకాయలు, అప్పడాలు, వడియాలు గట్రా శుద్ధ వేస్ట్… ఈ బెండకాయలు అదిరిపోతయ్… బెండకాయలు అద్భుతంగా వండబడే వంటల్లో ఒకటి పులస చారులో వేగి, అవే చేపలుగా మారిపోవడం.., తరువాత ఇదే… మీకు అలవాటు గనుక ఉండి ఉంటే స్టవ్వు ఆపేసేముందు కాస్త… మరీ వేసీ వేయనట్టుగా ఇంగువ వేయండి… తరువాత కలుద్దాం… హెలో… నిలువునా చీల్చేసి, రెండు ముక్కలు చేసేసి, ఇంకాస్త కడక్ కడక్ కాల్చుకుంటాం, పంటి కిందకు ఆనుతుంది అంటారా…? గుడ్ ఐడియా… ట్రై చేయండి… మరీ మాడనివ్వకండి… ఆయిల్ వేయకండి… అంతే…
Share this Article