చిన్నప్పటి నుండి సినిమాలంటే మహా పిచ్చిగా ఉండేది. సినిమా అంటే, మా నాన్న తన్నే వాడు. ఇప్పటిలాగా అప్పట్లో అడ్వాన్స్ బుకింగులు ఉండేవి కావు. ఏ సినిమాకైనా బుకింగ్ కౌంటరు ముందు యుద్ధం చేయాల్సిందే, చొక్కాలు చింపుకోవాల్సిందే, చొక్కా చింపుకున్నందుకు ఇంట్లో తన్నులు తినాల్సిందే. సాధారణంగా నెలకు ఒక ఇరవై రోజులైనా అమ్మతోనో, నాన్నతోనో తన్నులు తప్పేవి కాదు.
మా చెల్లెలు క్లాస్ మేట్ సుజాత అని ఒకామె ఉండేది. వాళ్ళన్నయ్య బాబురావు అని వరంగల్ సేల్స్ టాక్స్ డిపార్టుమెంటులో, ఎంటర్టైన్మెంట్ టాక్స్ సెక్షన్లో క్లర్కుగా పనిచేసే వాడు. మనిషి చాలా లావు. ఆయన సైకిల్ తొక్కలేడు. స్కూటర్లు కొనే స్థోమత అప్పట్లో మధ్య తరగతి కుటుంబాల వారికి ఉండేది కాదు. అందుకని ఒక రిక్షాలో రోజంతా తిరిగేవాడు.
యన్టీరామారావు ముఖ్యమంత్రి కాకముందు థియేటర్లలో అమ్మిన సినిమా టిక్కెట్ల మీద కొంత శాతం వినోదపు పన్ను అని ఉండేది. అందుకోసం, సేల్స్ టాక్స్ డిపార్టుమెంటులో ఒక ఏసీటీవో, అతని కింద కొంత మంది స్టాఫ్ ఉండేవారు. సినిమా థియేటర్ల వాళ్ళు ఒక వారానికి సరిపడా టిక్కెట్లను తీసుకువచ్చి, టికెట్ల వెనకాల, సేల్స్ టాక్స్ శాఖ సీల్ వేయించుకుని, వాటినే థియేటర్లలో అమ్మాలి. ముందు వారం ఎన్ని టికెట్లు అమ్మారో లెక్క చూపించి దాని మీద పన్ను చెల్లించిన తర్వాతనే, తరువాతి వారానికి టికెట్లపై సీల్ వేసి ఇచ్చేవారు.
Ads
ఇక్కడే అసలు మతలబు ఉంది. థియేటర్ వాళ్ళు ప్రభుత్వ సీల్ వేసిన టికెట్ల స్థానంలో దొంగ ముద్రలు తయారు చేయించి, కొన్ని టికెట్లు అవి అమ్మి, మరికొన్ని ప్రభుత్వ సీల్ ఉన్న టికెట్లు అమ్మి, ప్రభుత్వానికి రావలసిన వినోదపు పన్నును ఎగ్గొట్టేవారు. అందుకని, సేల్స్ టాక్స్ అధికారులు థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు చేస్తుండే వారు.
ఈ వ్యవహారమంతా బాబూరావే చూస్తుండేవాడు. అందుకని, మేం పిల్లలమంతా బాబూరావు రిక్షాను వెంబడించి, టిక్కెట్లు ఇప్పించమని ప్రాధేయపడుతుండే వాళ్ళం. కొత్త సినిమా రోజయితే బాబూరావు రిక్షాను యాభై మంది పిల్లల వరకు వెంటాడేవారు. యన్టీయార్, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు సినిమాలకయితే బాబూరావు రిక్షా వెంబడి మా పిల్లలకు తోడు పెద్దవాళ్ళు కూడా పరిగెత్తేవారు.
కానీ, యన్టీరామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత, వినోదపు పన్ను చట్టాన్ని మార్చేసి, టికెట్ల అమ్మకంపై వినోదపు పన్ను చెల్లింపు విధానాన్ని రద్దు చేసి, శ్లాబ్ సిస్టమ్ లో పన్నులు కట్టే విధానాన్ని తెచ్చాడు. అంటే ఒక థియేటరులో ఎన్ని టికెట్లు అమ్ముడు పోయినా, పోకపోయినా, వారానికి ఇంత పన్ను కట్టాలని ఒక ఆర్డర్ పాస్ చేసాడు. దానికి ఒక ఫార్ములా కూడా ఉంది. గ్రాస్ కలెక్షన్ కెపాసిటీ (GCC) పైన నగరాల్లో 28%, పల్లెటూరిలో అయితే 14% (ఉదాహరణకు చెబ్తున్నాను) కట్టాలని నిర్ణయించారు.
అంటే ఒక థియేటర్లో ఒక కొత్త సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ అయితే, వారానికి పదివేలు వినోదపు పన్ను చెల్లించాలి. మరొక సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా అదే పది వేలు చెల్లించాల్సి ఉంటుంది.
సినిమా రంగానికి చెందిన ముఖ్యమంత్రిగా యన్టీరామారావు, సినిమా రంగానికి అదనపు వసతులు కల్పిస్తాడనుకుంటే, శ్లాబ్ విధానం తెచ్చి, సినిమా రంగం నడ్డి విరగ్గొట్టాడని, థియేటర్ల యజమానులు గగ్గోలు పెట్టారు. యన్టీరామారావుకు సినిమా థియేటర్ల యజమానులు చేసే నేరాలు తెలుసు కాబట్టి, ఆ విధంగా కట్టుదిట్టం చేసాడు. కానీ, ఆ దెబ్బకు అనేక సినిమా హాళ్ళు మూత పడ్డాయి.
ఇక మనం మన కథలోకి వద్దాం. నేను 1989లో అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయిన తర్వాత వరంగల్ నగరంలోనే పోస్టింగ్ వచ్చింది. నా సర్కిల్లోనే ఐదారు టాప్ సినిమా థియేటర్లు ఉన్నాయి. నేనే వాటికి ఎంటర్టైన్మెంట్ టాక్స్ ఆఫీసరును. గమ్మత్తేమిటంటే, ఏ బాబురావు రిక్షా చుట్టైతే నేను బాల్యంలో టికెట్ల కోసం వెంబడి పడ్డానో, ఆ బాబురావే నా దగ్గర యూడీసీగా ఉన్నాడు. అదే ఎంటర్టైన్మెంట్ సెక్షన్లో పని చేసేవాడు.
నేనైతే ఆ విషయం తెలియగానే బాగా నవ్వుకున్నాను. నేను మొదటి రోజున పోస్టులో జాయినయినప్పుడు, ఆయన వచ్చి, “నమస్కారం సార్! నన్ను గుర్తు పట్టారా సార్?” అని వినయంగా అడిగాడు. ”అయ్యో మిమ్మల్ని మరిచిపోయిందెప్పుడు? బాగున్నారా బాబూరావు గారూ?” అనే సరికి చాలా సంతోషించాడు….. By డాక్టర్ ప్రభాకర్ జైనీ
Share this Article