ప్చ్… కొన్ని అంతే… కేసీయార్‌కు మంత్రి పదవి ఇచ్చి ఉంటే… టీఆర్ఎస్ పుట్టేదే కాదు, చంద్రబాబు ఆంధ్రాకు పారిపోయేవాడే కాదు… హిమంత విశ్వ శర్మతో రాహుల్ గాంధీ కాసేపు మాట్లాడి పంపించి ఉంటే, తను బీజేపీలో చేరేవాడే కాదు, అస్సోంలో కాంగ్రెస్ పని మటాషయి ఉండేది కాదు… జగన్ పట్ల సోనియాగాంధీ కాస్త సాదరంగా ఉండి ఉంటే, తను జైలుకు పోయేవాడు కాదు, ఆంధ్రాలో కాంగ్రెస్ అట్టడుగుకు పోయి ఉండేదీ కాదు… ఇలా బోలెడు కార్యకారణ సంఘటనలు చరిత్రలో చోటుచేసుకుంటూ ఉంటయ్..,
ఒకసారి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి విప్రోలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు.., కానీ తిరస్కరించబడింది.., ఇది ఐటి పరిశ్రమలో విప్రోకు అతిపెద్ద పోటీదారుల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ఆవిర్భావానికి దారితీసింది… వేల కోట్ల ఆ వ్యాపారి సీఎన్బీసీ-టీవీ18 ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు ఇది… (గతంలో పెద్దగా ఏ వివరాలూ చెప్పేవాడు కాదు, ఈమధ్య ఓపెన్ అప్ అవుతున్నాడు…) ఏమో, ఎవరి డెస్టినీ ఏ పాయింట్ దగ్గర టర్న్ తీసుకుంటుందో…
విప్రో మాజీ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ కూడా ఓసారి మూర్తిలో అదే అన్నాడుట… ప్చ్, నిన్ను ఆరోజే కొలువులోకి తీసుకుని ఉంటే ఇన్ఫోసిస్ పుట్టేదే కాదు అని..! నిజమే, ఆరోజు తనకు ఉద్యోగం ఇచ్చి ఉంటే విప్రో కథ, నారాయణమూర్తి కథ వేర్వేరుగా ఉండేవి కదా… 1981లో… తన ఆరుగురు మిత్రులతో కలిసి పది వేల రూపాయల పెట్టుబడితో ఇన్ఫోసిస్ స్టార్ట్ చేశాడు… అదీ తన భార్య సుధామూర్తి ఇచ్చిన సొమ్ము…
Ads
(అప్పట్లో నారాయణమూర్తితో జరిగిన తన పెళ్లి ఖర్చు అయిదు వందలో, ఎనిమిది వందలో అని చెప్పిందామె… నారాయణమూర్తిలో మూర్తి వేరు, తాము పెట్టుకునే మూర్తి వేరు అట… నారాయణమూర్తిలో Murthy … సుధామూర్తిలో Murthy అట… తన పిల్లలకు కేవలం Murty అనే కంటిన్యూ చేస్తాననీ పెళ్లికి ముందే షరతు పెట్టిందట ఆమె… తనే చెప్పింది… ఈ ఉచ్చరణలు, వాటిలో తేడా మనకు తెలియదు… అది వేరే సంగతి… మూర్తి అంటే రూపం అని మాత్రమే కాదు, ఉచ్చరణను బట్టి వేర్వేరు అర్థాలున్నాయట…)
నారాయణమూర్తి కంపెనీ స్క్రాచ్ నుంచి ప్రారంభం కాగా, ప్రేమ్‌జీ మాత్రం తమ వారసత్వ వంటనూనె వ్యాపారాన్ని ఐటీ Software Providing వ్యాపారంలోకి మార్చాడు… ఈరోజు ఈ కంపెనీల విలువ తెలుసా..? ఇన్ఫోసిస్ విలువ 6.65 లక్షల కోట్లు… విప్రో విలువ 2.43 లక్షల కోట్లు… (కాకపోతే విప్రో అధినేత ప్రేమ్‌జీ సామాజికసేవ వ్యయం, వితరణ పరిమాణం చాలా ఎక్కువ… తనతో నారాయణమూర్తి ఏమాత్రం పోటీపడలేడు, పడలేదు… దేశంలోనే తనకు ఈ విషయంలో పోటీ లేదు..)
మూర్తి ఇన్ఫోసిస్ కంపెనీ కూడా ఆల్ఆఫ్‌సడెన్ పుట్టుకొచ్చిందేమీ కాదు… తన జర్నీ ఒక టెక్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా స్టార్టయింది… అహ్మదాబాద్ ఐఐఎంలో రీసెర్చ్ అసోసియేట్ తను… తరువాత టీడీసీలో చీఫ్ సిస్టమ్ ప్రోగ్రామర్‌గా తన స్నేహితుడితో కలిసి ఇండియా తొలి BASIC Interpreter డెవలప్ చేశాడు… తరువాత తన సొంత ఐటీ కంపెనీ Softronics స్టార్ట్ చేశాడు, కానీ ఫెయిల్… ఏవేవో కంపెనీల్లో కొలువు కోసం ట్రై చేశాడు… ఆ తరువాతే ఇన్ఫోసిస్ పుట్టింది…
వ్యాపారంలో కుటుంబసభ్యులను ఇన్వాల్వ్ చేయడంలో కూడా ప్రేమ్‌జీ వేరు, నారాయణమూర్తి వేరు… ప్రేమ్‌జీ 2019లో తన సర్వీసెస్ విరమించుకున్న తరువాత కొడుకు రిషద్ ప్రేమ్‌జీ టేకప్ చేశాడు… కానీ నారాయణమూర్తి కొడుకు రోహన్ మాత్రం ఇన్ఫోసిస్ బాధ్యతలు చేపట్టడానికి ముందుకు రాలేదు, నారాయణమూర్తీ అడగలేదు… ‘కొన్ని విషయాల్లో తను నాకంటే కఠినుడు, కానీ బయటికి చెప్పడు’ అంటాడు మూర్తి…
అంతెందుకు..? భార్య సుధామూర్తి ఇన్ఫోసిస్‌లో జాయిన్ కావడానికి కూడా ఆయన అంగీకరించలేదు… ఆమె స్వయంగా ఇంజనీర్ కూడా… ప్చ్, ఆరోజు అంగీకరించి ఉండాల్సింది, తరువాత పలుసార్లు పశ్చాత్తాపపడ్డాను అంటున్నాడాయన… మా అందరికన్నా ఆమె చాలా బెటర్… ఆరోజు సరైన నిర్ణయం తీసుకోలేకపోయాను అన్నాడు ఆ ఇంటర్వ్యూలో…! ఇంట్రస్టింగు…!!
Share this Article