Pressure- Failure:
1 . ఒక పద్యం:-
“అక్కరకు రాని చుట్టము,
మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున దా
నెక్కిన బారని గుర్రము
గ్రక్కున విడవంగవలయు గదరా సుమతీ!”
Ads
అవసరానికి ఉపయోగపడని చుట్టాన్ని; మొక్కితే వరమివ్వని దేవుడిని; యుద్ధభూమిలో పరుగెత్తని గుర్రాన్ని వెంటనే వదిలించుకోవాలన్నాడు సుమతీ శతకకారుడు.
2 . ఒక సామెత:-
“Fortune favours the brave”
ధైర్యవంతుడికే అదృష్టం అనుకూలిస్తుంది అని ఇంగ్లీషులో పాపులర్ ప్రావెర్బ్.
3 . ఒక వాడుక మాట:-
“జో జీతా వోహి సికందర్”
గెలిచినవాడే రాజు– అని హిందీలో వాడుకమాట.
4 . ఒక పాట:-
“కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
సుడిలో దూకి ఎదురీదకా…
మునకే సుఖమనుకోవోయ్
కొండలే రగిలే వడగాలీ..
నీ సిగలో పువ్వేలోయ్..
చందమామ మసకేసి పోయే ముందుగా కబురేలోయ్
లాయిరి నడి సంద్రములోనా…
లంగరుతో పని లేదోయ్..
అన్యులకే నీ సుఖము అంకితమోయ్…
వేదాలలో సారమింతేనోయ్!
ఈ వింతేనోయ్!
ఆ ఎరుకే నిశ్చలానందమోయ్!
బ్రహ్మానందమోయ్!”
సుడిలో మునిగినప్పుడు మునకే సుఖమనుకో! అని అనితరసాధ్యమయిన వాస్తవిక వేదాంత తత్వాన్ని బోధించింది దేవదాసు పాట. కొండలే రగిలే వడగాలిని సిగలో పువ్వుగా భావించి భరించమంది. నడిసంద్రంలో అలల పోటును భరించాల్సిందే కానీ…లంగరుతో పనిలేదు పొమ్మని తేల్చిపారేసింది. అన్యులకు మన సుఖాన్ని అంకితం చేయడమే నిశ్చలమైన ఆనందం. అదే బ్రహ్మానందం. వేదాలలో సారమిదే.
5 . ఒక సోషల్ మీడియా జోకు:-
“ఈరోజు మనం మ్యాచ్ చూడనేలేదు. అసలు వరల్డ్ కప్ అంటే ఏంటో మనకు తెలియదు. తెలిసినా ఇండియా- ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ మాత్రం చూడలేదు. విజయనగరంలో సాయిబాబా ప్రవచనాలు వినడానికి వెళ్లాము. ఎవరడిగినా ఇదే చెప్పండి”
దృశ్యం సినిమాలో ఫేమస్ డైలాగ్ కు సోషల్ మీడియాలో రాత్రి ఓటమి తరువాత వైరల్ అవుతున్న పేరడీ జోక్ ఇది.
1 . పది ఆటలూ గెలిచినా…తుదిపోరు పదకొండులో గెలవనప్పుడు అది అక్కరకు రాని ఆటే!
2 . అన్నిట్లో టాస్ అదృష్టం వరించింది…ఫైనల్లో ఎందుకు టాస్ చేజారిందంటే …ధైర్యవంతుడికే అదృష్టం అనుకూలం కాబట్టి!
3 . గెలిచిన ఆస్ట్రేలియా క్రికెట్టే రారాజు.
4 . కుడి ఎడమయ్యింది. ఈ మునకే సుఖమనుకుని…చివరి అడుగు దాకా వచ్చిన పది అడుగులే గొప్పవి అనుకుని మనల్ను మనం వేదాంతధోరణిలో దేవదాసు పాట రచయిత సముద్రాలలా ఓదార్చుకోవాలి.
5. అయినా…మనం 2023 నవంబర్ 19 ఆదివారం సాయిబాబా ప్రవచనాలు వినడానికి విజయనగరం వెళ్ళాము కదా! ఫైనల్ మ్యాచ్ చూసే అవకాశమే లేదు. మనకేమీ తెలియదు. ఎవరడిగినా మూకుమ్మడిగా ఇదే మాట మీద ఉందాం!
దేశాభిమానం- క్రీడాభిమానం వేరు వేరు కావాల్సిన బరువైన సందర్భమిది. ఆఫ్ఘనిస్థాన్ తో తలపడి ఆస్ట్రేలియా మాక్స్ వెల్ సిక్స్ డౌన్లో కండరాలు పట్టేసి కదల్లేకుండా ఉన్నా…ఒంటరి యోధుడిగా నిలబడి…డబుల్ సెంచరీ చేసినప్పుడే కప్పు ఆస్ట్రేలియాకు రిజర్వ్ అయ్యింది. సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాతో పోటీ పడి తాపీగా ఇటుక ఇటుక పేర్చుకుంటూ విజయసౌధాన్ని నిర్మించే క్రీడా నైపుణ్యమేమిటో చూపినప్పుడే కప్పు ఆస్ట్రేలియాకు రిజర్వ్ అయ్యింది. టాస్ గెలిచి 240 కి భారత్ ను కట్టడి చేసినప్పుడు పూర్తిగా కప్పు వారి సొంతమయ్యింది. మన గిల్ గిల్లలేక, మన శ్రేయస్సు నిశ్రేయస్సు అయ్యాక, మన సూర్యం గాల్లో ప్రాక్టీస్ చేయలేక; మన బౌలర్లు వికెట్లు కూల్చలేక…చేతులెత్తేసి..వారినంటే ఆడలేక మద్దెల ఓడు అన్నట్లే అవుతుంది.
They came- వారు వచ్చారు.
They saw- వారు చూశారు.
They conquered- వారు గెలిచారు.
గతంలో ఒంటరి యోధులైన కపిల్ దేవ్ వల్ల ఒకసారి, ధోనీ వల్ల మరోసారి ప్రపంచ కప్ దక్కిందన్నది సగటు క్రీడాభిమానుల విశ్లేషణ. అలా కనీసం ఒక యోధుడు సర్వ శక్తులు ఒడ్డి… ఒంటరి సైన్యంగా పోరాడి ఉంటే ఇప్పుడు కూడా కప్పు వచ్చి ఉండేది. ఆ యోధుడు ఏడీ? ఎక్కడ? లేడే! రాలేదే! అన్నది సగటు క్రీడాభిమాని ఆవేదన. పరితాపం. పరి పరితాపం.
అయినా….
గెలుపు గెలుపే. ఓటమి ఓటమే. విన్నర్ టేక్స్ ఆల్. గెలిచినవాడు అంతా తీసుకుని వెళ్లిపోతాడు. ఓడినవాడు గాయాలకు ఆయింట్మెంట్లు పూసుకుంటూ, విరిగిన ఎముకలకు పుత్తూరు సున్నం, వెదురు బద్దల కట్లు కట్టుకుంటూ , వాపులకు ఆవిరి కాపడం పెట్టుకుంటూ ఉంటాడు.
కొసబరువు:-
యాభై- యాభై వంద ఓవర్ల మధ్య బ్రేకుల్లో టీ వీ ల ముందు కదలకుండా 140 కోట్ల భారతీయులు బలవంతంగా, అనివార్యంగా కూర్చుని తిన్న విమల్ ఇలాచీ, కమలా పసంద్ పాన్ ప్రకటనల మసాలాలు వచ్చే వరల్డ్ కప్పులోపయినా అరుగుతాయా? ఆ కంపు ఇప్పట్లో పోదా? ఆ అజీర్తి బరువు ఎన్ని వరల్డ్ కప్పులదాకా మొయ్యాలి?
క్రికెట్ ఓటమి బాధకంటే-
షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ రెండు వేళ్లు కళ్ళ మీద పెట్టి మన నోట్లో, ఇంట్లో, వీధిలో చల్లిన విమల్ ఇలాచీ;
కపిల్ క్రిస్ గేల్, సునిల్ గవాస్కర్ వీరేంద్ర సెహ్వాగ్ మన నోట్లో పోసిన కమలా పసంద్ బాధ- గోరుచుట్టు మీద రోకలి పోటు కంటే ఎక్కువ! – పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article