.
ముందుగా నిన్నటి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేసిన ప్రకటన చదవండి ఓసారి…
పత్రికా ప్రకటన తిరుమల, 2025 ఏప్రిల్ 03
Ads
రూ. కోటి విరాళం చెల్లించే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు : టిటిడి
కలియుగ దైవం తిరుమల శ్రీవారికి రూ. కోటి విరాళం ఇచ్చే భక్తులకు టిటిడి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు జరిగే రోజులలో మినహా మిగిలిన రోజులలో విరాళం ఇచ్చిన భక్తులు తమకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవచ్చు.
రూ. కోటి విరాళం ఇచ్చే దాతలకు జీవితకాలంలో దాతతో పాటు నలుగురికి ప్రతి ఏడాది క్రింది సౌకర్యాలను టిటిడి కల్పిస్తోంది. సంవత్సరంలో 3 రోజులు సుప్రభాత సేవ మరియు 3 రోజులు బ్రేక్ దర్శనం, 4 రోజుల పాటు సుపథం ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. వీటితోపాటు 10 పెద్ద లడ్డూలు, 20 చిన్న లడ్డూలు, దుపట్ట – 1, రవిక – 1, మహా ప్రసాదం ప్యాకెట్లు – 10, ఒకసారి వేద ఆశీర్వచనం వంటి సౌకర్యాలను పొందవచ్చు వీటితో పాటుగా రూ. 3 వేలు రుసుం విలువ చేసే వసతి గదుల సదుపాయం 3 రోజులు కల్పిస్తారు.
అంతేకాక జీవిత కాలంలో ఒకసారి దాతకు ఒక 5 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్ మరియు ఒక 50 గ్రాముల సిల్వర్ డాలర్ ను తగిన ఆధారాలను కార్యాలయం వారికి చూపించి పొందవచ్చు.
దాతలు క్రింద కనబరిచిన టిటిడి ట్రస్ట్ లకు విరాళాలు ఇవ్వవచ్చు. కాటేజ్ డొనేషన్ స్కీం, ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్, ఎస్వీ విద్యాదాన ట్రస్ట్, బర్డ్ ట్రస్టు, శ్రీవేంకటేశ్వర అన్నదాన ట్రస్ట్, శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, శ్రీవేంకటేశ్వర సర్వశ్రేయాస్ ట్రస్ట్, శ్రీవేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, శ్రీవాణి ట్రస్ట్, శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్ట్, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదినీ స్కీమ్ (స్విమ్స్) లకు దాతలు విరాళాలు చెల్లించి సంబంధిత సౌకర్యాలను పొందవచ్చు.
దాతలు టిటిడి వెబ్ సైట్ అయిన www.ttddevasthanams.ap.gov.in లో ఆన్ లైన్ ద్వారా విరాళాలు చెల్లించవచ్చు. ఆఫ్ లైన్ లో అయితే దాతలు ఈవో, టిటిడి పేరిట డి.డి/ చెక్ లను తీసుకుని తిరుమలలోని దాతల విభాగంలో ( డోనార్ సెల్) అందజేయాలి.
————————————-
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
అర్థమైంది కదా… రోజురోజుకూ సగటు సామాన్య భక్తులకు వేగంగా దర్శనాలు చేయించడానికి… వసతి కల్పించడానికి బదులు ధనిక భక్తుల దేవుడిగా మార్చేస్తున్నారు తిరుమల వెంకన్నను..! అనుకోవడానికి కఠినంగా వినిపించినా… దేవుడిని ధనికులకు ధారాదత్తం చేయడం ఇది…
ఇప్పటికే ఆర్జిత సేవలకు ప్రాధాన్యం ఇస్తూ… వీవీఐపీల సేవల్లో తరిస్తున్న యంత్రాంగం దేవస్థానాన్ని మరింత వ్యాపారీకరిస్తోంది…
జగన్, చంద్రబాబు… ఎవరైతేనేం..? అందరిదీ ఇదే బాట… సగటు ధర్మదర్శనం భక్తులకు అగచాట్లు, పాట్లు, గంటల తరబడీ వెయిటింగు… డబ్బున్న భక్తులకు మాత్రం, అంటే కోటి విరాళం ఇస్తే సరి, ఏదంటే అది… దేవుడిగా చూసుకుంటుందట దేవస్థానం… వసతి, ప్రసాదం, వేదాశీర్వచనం, శేషవస్త్రం వాట్ నాట్..?
ఇప్పటికే ఆ దేవుడిని చివరకు పది నిమిషాలపాటు కునుకు కూడా తీయనివ్వకుండా… భక్తుల ఆశీస్సుల కోసం అలాగే నిలబెట్టేస్తున్నారు… కంట్రాక్టులు, నియామకాలు, కొనుగోళ్ల దందాలు పక్కన పెడితే… ఈ ఆస్థాన పాలకులు అక్షరాలా ఆ దేవుడినే శాసిస్తున్నారు…
అవునూ, తిరుమలను ఏదేదో ఉద్దరిస్తామని ప్రగల్భాలు పలికిన సనాతన ధర్మ పరిరక్షకులు ఏమైపోయారు..? సామాన్య భక్తుడికి నానాటికీ దేవుడిని దూరం చేయడమేనా సనాతన ధర్మ పరిరక్షణ..!?
Share this Article