ఎన్నో విమర్శలు… ఫామ్ కోల్పోవడం… భారీ ట్రోలింగు… అసలు ఇక జట్టులో కొనసాగిస్తారా లేదా అనే సంశయాలు… కెప్టెన్ కాదు, కేవలం ఆటగాడే… ఆ స్థితి నుంచి మళ్లీ కోహ్లి బయటపడ్డాడు… పాత కోహ్లి కనిపిస్తున్నాడు… ఈ వరల్డ్ కప్‌లో అందరికన్నా ఎక్కువ పరుగులు… దీనికితోడు సచిన్ సెంచరీల (వన్డే) రికార్డు బ్రేక్ చేశాడు… అదీ సచిన్‌కన్నా తక్కువ మ్యాచుల్లోనే… ఇది మామూలు రికార్డు కాదు… ఈ నేపథ్యంలో మిత్రుడు Psy Vishesh రాసిన ఓ పాత పోస్టు కనిపించింది…. అందులో ఓ పార్ట్ ఈ సందర్భంగా చదువుకుందాం…
విరాట్ లక్ష్యం ఒక్కటే.. క్రికెట్ లో అగ్రస్థానం.. ఆ స్థానాన్ని నిరంతరం విజువలైజ్ చేసేవాడు. అంతటితో ఆగకుండా సంవత్సరాల తరబడి రోజూ తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి స్టేడియంకు వెళ్లేవాడు. ఎప్పుడూ సీనియర్లతోనే క్రికెట్ ఆడేవాడు. చిన్న పిల్లలను ఔట్ చేస్తే కిక్కేముంటుంది అనేవాడు. “ఇండియా ఓడినప్పుడల్లా, నేను ఆ మ్యాచ్ లో ఉంటే ఆ మ్యాచ్ గెలిచేవాడ్ని కదా అనిపించేది” అంటాడు కొహ్లీ. అంటే చిన్నప్పటినుంచే తనను తాను ఇండియన్ క్రికెట్ టీమ్ సభ్యుడిగా విజువలైజేషన్ చేసుకుంటున్నాడన్నమాట.
ఎంత గొప్ప టాలెంట్ ఉన్నా దాన్ని సరైన దారిలో పెట్టే కోచ్ ఒకరు కావాలి. ఈ సంగతి విరాట్ తండ్రి ప్రేమ్ కొహ్లీ గుర్తించారు. 1998 మే 13న తొమ్మిదో ఏట ఢిల్లీలో రాజ్ కుమార్ శర్మ క్రికెట్ కోచింగ్ అకాడమీలో చేర్పించాడు. ఫస్ట్ మ్యాచ్ లో విరాట్ బ్యాటింగ్ చేయలేదు, అలాగని బౌలింగూ చేయలేదు. మరేం చేశాడంటారా? ఫీల్డింగ్. బౌండరీ లైన్ నుంచి నేరుగా వికెట్లను కొట్టేశాడు. అతని ఫీల్డింగ్ సామర్థ్యం చూసి కోచ్ ఆశ్చర్యపోయాడు. విరాట్ లోని టాలెంట్ కు పదును పెట్టాడు.
Ads
విరాట్ 2006లో కర్ణాటకతో జరిగిన రంజీ మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే అతని తండ్రి చనిపోయాడు, తెల్లవారు జామున మూడు గంటలకు విరాట్ చేతుల్లోనే. ముందురోజు 40 నాటౌట్ గా ఉన్నాడు కనుక మర్నాడు అతనే మ్యాచ్ ప్రారంభించాలి. కానీ తండ్రి చనిపోయాడు. ఏం చేయాలి? కోచ్ కు ఫోన్ చేశాడు.
“నీ కష్టం నాకు తెలుసు. నీ తండ్రి స్థానంలో చెప్తున్నాను.. నీకో అవకాశం వచ్చింది, వెళ్లి ఆడటమే మంచిది. అయితే తుది నిర్ణయం నీదే” అని చెప్పాడు. మ్యాచ్ లో ఔటయ్యాక విరాట్ కోచ్ కు ఫోన్ చేసి ఏడ్చాడు. “ఏడవకు, నీకు నేనున్నాను, తండ్రిలా నేను చూసుకుంటాను” అని కోచ్ ఓదార్చాడు. అప్పుడు విరాట్”కోచ్ సర్, అంపైర్ నన్ను తప్పుగా ఔట్ చేశాడు. బాల్ నా బ్యాట్ కు తగిలాకే ప్యాడ్ కు తగిలింది. అయినా అంపైర్ ఔట్ ఇచ్చాడు” అని చెప్పాడు. అంతగా ప్రేమించాడతడు క్రికెట్ ను. తండ్రి మరణ దు:ఖాన్ని కూడా దిగమింగేంతగా ప్రేమించాడు.
అలా చేయడం అబ్ నార్మల్, ఇన్సెన్సిటివ్ అని కొందరికి అనిపించవచ్చు. కానీ”తల్లి లేదా తండ్రి చనిపోయినప్పుడు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. పూర్తి నిరాశ ఆవహిస్తుంది. దానికి విరుగుడుగా అధిక వ్యాయామం చేయమంటారు. తద్వారా కార్టిసాల్ ఎఫెక్ట్ ను తగ్గించవచ్చు. విరాట్ చేసిందదే. క్రికెట్ ఆటతో తన ఒత్తిడిని అధిగమించాడు. చిన్న వయసులోనే చక్కని టెక్నిక్స్ సాధన చేస్తే పెద్దయ్యే కొద్దీ వాటిని ప్రయోగించే సామర్థ్యం పెరుగుతుంటారు. అందుకు కోచింగ్ ఉపయోగపడుతుందని చెప్తారు.
దారి తప్పిన టీనేజర్
2008 లో విరాట్ కెప్టెన్సీలో అండర్-19 ప్రపంచ కప్ గెలిచింది. తొలిసారి ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు. అయితే రోజూ పార్టీలతో దారి తప్పాడు. కోచ్ మాటలను కూడా విరాట్ లెక్కచేయలేదు. అతని ప్రవర్తన తీవ్ర విమర్శలకు గురైంది. అప్పుడే అతను స్వీయ విధ్వంసమా? బ్యాట్ తో విధ్వంసమా? అనే పరీక్షలో బ్యాట్ వైపుకే మొగ్గాలని నిర్ణయం తీసుకున్నాడు. తన ప్రవర్తనను, ప్రాక్టీస్ ను మార్చుకున్నాడు. 2011 నాటికి తన ప్రవర్తనతో ప్రశంసలు అందుకున్నాడు. ఇలాంటి పరిస్థితి చాలామంది టీనేజర్లకు ఎదురవుతుంది. తాత్కాలిక ఆనందం వైపు మొగ్గు చూపిన వారు కనుమరుగవుతారు, విజన్ పై గురి ఉన్నవాడు విజయం సాధిస్తాడు.
“క్రికెటర్ గా ఫీల్డ్ లో నేను చేసే ప్రతీ పనికీ నా ఇన్ స్టింక్ట్ కారణం. కొన్నిసార్లు ఎదురుగా ఏ బౌలర్ ఉన్నారో కూడా చూడను, బాల్ ను మాత్రమే చూస్తాను. ఒక విషయంపై ముందు మనం మన మనసును ఒప్పించగలిగితే మిగతాదంతా సులువే అని తెలుసుకున్నాను. అందుకే విజువలైజేషన్ చేసేవాణ్ని. బంతి వేగం, గమనాన్ని బౌలర్ మెదడులోకి వెళ్లి అంచనా వేసేవాణ్ని” అని చెప్తాడు విరాట్.
“ఈ అంత:ప్రేరణ ఒక వ్యక్తి చదువు, పెంపకంపై ఆధారపడి ఉంటుంది. అది మన అనుభవాల నుంచి వస్తుంది. మన సామర్థ్యాలపై మనకు విశ్వాసం పెరిగేలా చేస్తుంది. ఛాలెంజ్ ముందున్నప్పుడు విరాట్ మెదడులోని ఫ్రంటల్ లోబ్ బాగా యాక్టివ్ గా ఉంటుంది. లింబిక్ వ్యవస్థ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది. మెదడులోని న్యూరాన్లన్నీ అత్యుత్తమ స్థాయిలో ఉత్తేజం పొందుతాయి, పరిసరాలన్నీ మరచి విజయం గురించి మాత్రమే ఆలోచిస్తాయి” అంటారు Lera Boroditsky…
Share this Article