Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒకే ఒక్కడు… సుప్రీం చీఫ్ జస్టిస్… గొడుగుపాలుడు… ఒక్క రోజు కుర్చీ..!!

August 8, 2024 by M S R

శ్రీకృష్ణదేవరాయలు ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఛత్రం (గొడుగు) పట్టుకుని ఉండేవాడే గొడుగుపాలుడు (పేరు భూమా నాయుడు). శ్రీకృష్ణదేవరాయలు ప్రతిరోజూ పంపా విరూపాక్షస్వామి వారిని దర్శించుకుని పూజలు చేయడం రివాజు. ఒక రోజు శ్రీకృష్ణదేవరాయలు స్వామి వారి దర్శనానికి తన వేసవి విడిది పెనుగొండ నుండి తన రాజధాని హంపీకి బయలుదేరవలసి వచ్చింది.

సమయం తక్కువ ఉండటంతో తన గుర్రమెక్కి అతి వేగంగా హంపీ వైపు బయలుదేరారు. రాజు ఎక్కడికి వెళితే ఛత్రం పట్టేవారు కూడా వెళ్లాలి కాబట్టి గొడుగుపాలుడు కూడా కాలినడకన బయలుదేరాడు. గుర్రం పరుగుపెట్టే కొద్దీ గొడుగుపాలుడు కూడా పరుగు లంఘించుకున్నాడు.

సమయానికి దేవాలయం చేరుకోవాలని గుర్రాన్ని దౌడు తీయిస్తున్న రాయలవారు…వారికి సాయంకాలపు ఎండ తగలకుండా అంతే వేగంగా గొడుగుపాలుడు.. ఎక్కడా ఆగకుండా సాగిందా ప్రయాణం.

Ads

రాయలవారు హంపి చేరుకున్నంత వరకు గుర్రంతో సమానంగా 120 మైళ్ళు పరిగెత్తిన గొడుగుపాలుడు రాయలవారు ఆలయప్రవేశం చేయగానే ఆ బడలికతో స్పృహ తప్పి పడిపోయాడు. అతని రాజభక్తికి మెచ్చి ఏం కావాలో కోరుకో అని రాయలవారు అడగ్గా… ఒక్క రోజు రాజ్యం ఇప్పించండి చేతి నిండా దానాలు చేస్తా- అని అడిగాడు గొడుగుపాలుడు.

రాయలవారు సరే అని ఒక రోజు రాజ్యదానం చేయగా… పొద్దున్నుండి సాయంకాలం వరకు ఏకధాటిగా దానపత్రాల మీద సిరా అద్ది… రాజముద్ర వేసి… దానాలు చేశాడు. ఎంతలా దానాలు చేశాడంటే… తిండీ తిప్పలు మానేసి ఇస్తున్న ఈ దానపత్రాల ధాటికి రాజముద్ర వేయడానికి సిరా కూడా అయిపోయేంతగా. అయినా అలసిపోని గొడుగుపాలుడు తన భార్యలిద్దరినీ నోరు తెరవమని చెప్పి వాళ్ల వక్కాకు (తాంబూలం /తమలపాకు ) తమ్మతో దానపత్రాల మీద రాజముద్ర వేసి దానధర్మాలు చేశాడు.

ఇది కట్టు కథ కాదు. నిజంగా జరిగిన కథ. దీనికి సాక్ష్యాధారాలు:-
– మెకంజీ కైఫీయత్తులు
– విద్వాన్ కట్టా నరసింహులు కైఫీయత్తు కథలు
– “హంపీ నుంచి హరప్పా వరకు” తిరుమల రామచంద్ర చారిత్రక కావ్యంలో “గొడుగుపాలుడు” ఘట్టం

ఒకే ఒక్కరోజు చక్రవర్తిగా పనిచేసిన గొడుగుపాలుడి దాన శాసనాలన్నీ చెల్లుతాయని మరుసటి రోజు కృష్ణదేవరాయలు అధికారికంగా ఆమోదించడాన్ని తిరుమల రామచంద్ర ఒళ్లు పులకించేలా అక్షరీకరించారు. చక్రవర్తి సింహాసనం మీద కూర్చున్న గొడుగుపాలుడు ఇక ఎవరికీ గొడుగు పట్టాల్సిన అవసరం లేకుండా ఒక ఊరిని దానంగా ఇచ్చి ఏలుకొమ్మన్నాడు. ఆ ఊరే హంపీకి దగ్గర్లోని గొడుగుపాలపురం. కాలగతిలో దానిపేరు గోపాలపురమయ్యింది.

ఒకే ఒక్కరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే సామాన్యుడి కథనంతో అర్జున్ హీరోగా నటించిన ఒకే ఒక్కడు సినిమాకు ఈ గొడుగుపాలుడి కథే ఆధారం అని చాలామందికి తెలియకపోవచ్చు.

భారత సర్వోన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి సీట్లో ఒక రోజు కూర్చుని చూడండి! మీకే తెలుస్తుంది మా కష్టమేమిటో అన్నారు మన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్. ఒక కేసు వాదోపవాదాల సందర్భంగా వెంటనే విచారణకు తేదీలు నిర్ణయించాలని న్యాయవాది పట్టుబట్టగా ప్రధాన న్యాయమూర్తి ఈ మాటలన్నారు.

ఏమో! అప్పుడు గొడుగుపాలుడు ఒక్కరోజు చక్రవర్తిగా ఆచంద్రతారార్కమైన కీర్తి సంపాదించుకున్నట్లు న్యాయమూర్తి చంద్రచూడ్ నిజంగా ఒకరోజు కుర్చీ అవకాశం ఇస్తే ఇప్పుడు ఏ గొడుగుపాల న్యాయవాది అజరామరమైన కీర్తి సంపాదించుకుంటాడో! ఎవరికెరుక?

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘అనగనగా..’ ఓ సుమంతుడు… మరొక్కసారి అదే ఫెయిల్యూర్ అడుగు…
  • సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి అత్యంత కీలకమైన రాజ్యాంగ ప్రశ్నలు..!
  • అది సరే గానీ… మరి రేవంత్ రెడ్డి ఏమైపోతాడో చెప్పలేదేమిటి..?
  • ఫాఫం, తెలంగాణ వాళ్లు ఎవరూ దొరకడం లేదా సారూ..!!
  • దిక్కుమాలిన, తలకుమాసిన మర్యాద… వీటినే బానిస ధోరణులు అంటారు…
  • ఏ కులమైతేనేం… బలుపు చూపే కులంపై తిరగబడేవాడే,.. కర్ణన్…
  • సినిమా టైటిల్‌లో మొనగాడు ఉంటే చాలు… మనోళ్లకు ఖుషీ…
  • అంతే… ఆ స్పీచ్ తరువాత కాంగీ, సీపీఎం మొహాలు మాడిపోయాయ్…
  • యుద్ధంకన్నా క్లిష్టం… సింధు జలాల వాటాలు… దిక్కుతోచని పాకిస్థాన్…
  • వావ్ మద్రాస్..! అప్పట్లోనే ఆంధ్రాలీడర్లు ఇంకాస్త గట్టిగా పట్టుపట్టి ఉంటే..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions