‘‘నేను ఓ వీఐపీ… అంటే Very Insignificant Person… అనగా అనామకుడిని… పుట్టుక రీత్యా తమిళుడిని… పేరు ఎం.ఆర్.ఆనంద్… అది డిసెంబరు 1978… అంటే ఇప్పటికి నలభయ్యేళ్ల క్రితం ముచ్చట ఇది… చదువు పూర్తయ్యింది, నాకెక్కడా కొలువు దొరకలేదు… అన్వేషిస్తున్నాను… పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు నోటిఫికేషన్ చూశాను దిహిందూలో… దరఖాస్తు చేసి, మరిచిపోయాను… అనుకోకుండా ఓరోజు ఇంటర్వ్యూకి రమ్మని లేఖ వచ్చింది… ఆ క్లర్క్ పోస్టుకు కూడా అప్పట్లో ఢిల్లీలో ఇంటర్వ్యూ… పోవాలా వద్దా…
నేనేమో అప్పటికి తమిళనాడు సరిహద్దులు కూడా దాటలేదు… కాసింత ఇంగ్లిషు, తమిళం తప్ప ఇంకే భాషా తెలియదు… దక్షిణం దాటితే చాలు, ఇక హిందీ ముక్క రానిది ఏ పనీ జరగదు… ఢిల్లీలో చుట్టాల్లేరు, దోస్తుల్లేరు… ఎవరిని అడిగినా, ఆ ఇంటర్వ్యూకు వెళ్లే ఆలోచన మానుకో అని చెప్పేవాళ్లే… కానీ మనసులో గింజులాట… వచ్చిన ఒక అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి అని…
మెదడు చించుకోగా కోగా ఓ ఐడియా తట్టింది… నిజానికి అది ఇప్పుడెవరికి చెప్పినా చెత్త ఐడియా అని తీసిపారేస్తారు… మరేం చేయను..? అప్పట్లో నాకు తట్టిన ఉత్తమ ఐడియా అదే మరి… ఈ రాజకీయ నాయకులు చాలామంది ఢిల్లీలో ఉంటారు కదా… ఒకరోజు ఆశ్రయం ఇవ్వలేరా మద్రాసు నుంచి వచ్చే ఓ ఉద్యోగార్థికి… అప్పట్లో అధికారంలో లేరు కదా, కాంగ్రెస్ వాళ్లను అప్రోచయితే బాగుంటుంది, కాస్త వర్కవుట్ కావచ్చు అనుకున్నాను… ఇంట్లో వాళ్లను అడిగితే సాహసం చేస్తున్నావు, అదీ పొలిటికల్ లీడర్ల మీద నమ్మకంతో.. అన్నారు…
పి.వి.నరసింహారావుగారి చిరునామా పట్టుకుని ఓ లేఖ రాశాను… అయ్యా, నేను ఫలానా, ఢిల్లీలో ఇదుగో ఈ ఇంటర్వ్యూ కోసం రావల్సిన పనిపడింది… దయచేసి ఒకరోజు మీ ఇంట్లో గానీ, ఇంకెక్కడయినా ఆశ్రయం కల్పించగలరా..? నా పరిస్థితి ఇది… నాకేమో ఈ కొలువు అవసరం… అంటూ కాస్త వివరంగానే రాశాను… నాయకులు కదా, దీన్ని తేలికగా తీసుకుంటారు అనే అనుకున్నాను… కానీ ఆశ్చర్యం… నాకు ఆయన నుంచి రిప్లయ్ వచ్చింది…
‘తప్పకుండా రండి, ఎక్కడో ఎందుకు, మా ఇంట్లోనే ఉండవచ్చు’ ఇదీ ఆ లేఖ సారాంశం… ఒకటికి నాలుగుసార్లు చదువుకుని, నిజమే అని నిర్ధారించుకుని, ఢిల్లీ రైలెక్కేశాను… ఢిల్లీ స్టేషన్లో దిగాను… అంతా అయోమయం, తెలియని లోకం… కష్టమ్మీద ఓ ఆటోవాలాకు నేనెక్కడికి పోవాలో ఇంగ్లిషులో చెప్పగలిగాను… ‘నర్సింహారావు, 99, షాజహాన్ రోడ్’… ఇంటికి చేరాను… కాలింగ్ బెల్ కొట్టాను… తనే తలుపు తీశారు … హమ్మయ్య…
మొహం ప్రసన్నంగానే ఉంది, కానీ చిరునవ్వు కూడా కనిపించలేదు… నేను ఫలానా అని చెప్పగానే, మీరేనా, రండి అని లోపలకు తీసుకెళ్లి, ఓ గది చూపించారు… స్నానం చేయండి ముందు, డైనింగు టేబుల్ మీద మీ బ్రేక్ ఫాస్ట్ రెడీగా ఉంది అన్నారు… నేనొస్తానని, ఆ సమయానికి ముందే నా బ్రేక్ ఫాస్ట్ ప్రిపేర్ చేయించారు… మళ్లీ ఆశ్చర్యం… నోట మాటరాలేదు నాకు…
నేను స్నానం చేసి వచ్చేదాకా తను బ్రేక్ ఫాస్ట్ చేయలేదు, డైనింగు టేబుల్ దగ్గరే వెయిట్ చేస్తున్నారు, ఆయన పక్కనే కూర్చున్నాను… మల్లెపూల వంటి ఇడ్లీలు… అదీ ఢిల్లీలో… నా ఇంటర్వ్యూ వివరాలు కనుక్కుని, తన మళయాళీ వంటమనిషిని పిలిచి, ‘ఈ అబ్బాయికి ఏం కావాలో కనుక్కుని, మధ్యాహ్న భోజనంలోకి వండండి..’ అని చెప్పారు…
ఎలాగోలా తిప్పలు పడుతూ ఇంటర్వ్యూ జరిగే స్థలానికి వెళ్లాను… ఇంటర్వ్యూ బాగా జరిగింది… మళ్లీ నరసింహారావుగారి ఇంటికి చేరాను… ఆరోజు ఆయన ఇంటికి రావటానికి అర్ధరాత్రి దాటింది… కొత్త స్థలం కదా, నాకు నిద్రపట్టలేదు, విజిటర్స్ హాలులోనే కూర్చుని, దొరికిన మ్యాగజైన్ ఏదో తిరగేస్తున్నాను… నన్ను గమనించి ‘ఇంటర్వ్యూ ఎలా జరిగింది..?’ అన్నారు…
బాగా జరిగింది సార్ అన్నాను…
‘ఎప్పుడు వెళ్లాలని అనుకుంటున్నావు తిరిగి..?’ అడిగారు…
రేపు జీటీ ఎక్స్ప్రెస్కు వెళ్తానన్నాను…
‘మరి టికెట్టు..? ముందే బుక్ చేసుకున్నావా..?’
‘పర్లేదు సార్, అప్పటికిప్పుడు తీసుకుంటాను…’
‘సరే, నేనే టికెట్టు తెప్పిస్తానులే, వెళ్లి పడుకో…’
ఉదయం టికెట్టు తెప్పించారు… ఆరోజు సాయంత్రమే రైలు… టికెట్టు నాకు ఇచ్చేసి, హాయిగా పడుకుని రెస్టు తీసుకో, నేను బయటికి వెళ్తున్నా, సాయంత్రం ఆరు గంటలకు వస్తాను, నిన్ను స్టేషన్లో డ్రాప్ చేస్తాను అని వెళ్లిపోయారు ఆయన …
ఈయన నాయకులపై నాకున్న అభిప్రాయాలను పటాపంచలు చేసేస్తున్నారు, ఇలాంటి నాయకులు కూడా ఉంటారా…? అన్నట్టుగానే సాయంత్రం వచ్చారు, నేను రెడీ… తనది ప్రీమియర్ పద్మిని కారు… తనే డ్రైవ్ చేశారు… రైల్వే స్టేషన్ వచ్చేశాం… అంతా ఓ కలలా ఉంది… ఆయనకు కృతజ్ఞత ఎలా చెప్పాలో అర్థం కాలేదు, కళ్లల్లో నీళ్లొచ్చాయి… వంగి ఆయన పాదాలను టచ్ చేయబోయాను… ఆయన వారించారు… అప్పుడు ఆయన మొహంలో కనీకనిపించని చిరునవ్వు… ‘నీకు ఓ సూచన… రాసేటప్పుడు గానీ, మాట్లాడేటప్పుడు గానీ సరళమైన ఇంగ్లిషు పదాలను వాడాలి…’ అని షేక్ హ్యాండ్ ఇచ్చి, వెళ్లిపోయాడు… ఈరోజుకూ అదే పాటిస్తున్నాను… అంతకుమించిన నివాళి నేనేమివ్వగలను ఆయనకు…!!’’
(18 జూన్ 2018న న్యూఇండియన్ ఎక్స్ప్రెస్లో ప్రచురితమైన లేఖ ఇది… యథాతథంగా తెలుగులో… నేను రాసిందే… పాత పోస్టు… ఈరోజు ఇడ్లీ దినం సందర్భంగా… ఇంకోసారి టేస్ట్ చేయడం కోసం అన్నమాట…)
Share this Article